Magazines

జనాభా తగ్గుతోంది

1 గంట క్రితం

population
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 3 నిమిషాల చదవడం

వృద్ధుల సంఖ్య పెరుగుతోంది!
భారత్‌కు ‘డెమోగ్రాఫిక్‌
షిఫ్ట్‌’ హెచ్చరిక

'రీప్లేస్‌మెంట్‌ స్థాయి' కంటే దిగువకు సంతానోత్పత్తి రేటు
భవిష్యత్తులో కార్మిక కొరత.. పలు రంగాలపై ప్రభావం
పెన్షన్లు–వైద్యంపై పెరగనున్న భారం : మూడీస్‌


భారత్‌ ప్రస్తుతం యువ జనాభా అధికంగా ఉన్న దేశమే. ఇదే భారత్‌కు ఒక మంచి అవకాశం. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదని తాజా మూడీస్‌ రేటింగ్స్‌ నివేదిక హెచ్చరిస్తోంది. సంతానోత్పత్తి రేటు 'రీప్లేస్‌మెంట్‌ స్థాయి' కంటే దిగువకు పడిపోయింది. దీంతో ఈ శతాబ్దం ద్వితీయార్థంలో భారత్‌ వృద్ధ జనాభా అధికంగా ఉన్న దేశంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మార్పు కేవలం డెమోగ్రాఫిక్‌ షిఫ్ట్‌ (జనాభా నిర్మాణం)నే కాదు.. ఉపాధి, ఆర్థిక వృద్ధి, పెన్షన్లు, వైద్యం, వినియోగం, ప్రభుత్వ సేవలపై కూడా ప్రభావం చూపనుంది.


న్యూఢిల్లీ : భారత్‌లో జనాభా సంఖ్య వేగంగా మారుతోంది. పిల్లల సంఖ్య తగ్గుతూ.. వృద్ధుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి రాబోయే దశాబ్దాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారే అవకాశం ఉందని మూడీస్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక పేర్కొంది. సంతానోత్పత్తి రేటు రీప్లేస్‌మెంట్‌ స్థాయి 2.1 కంటే దిగువకు పడిపోవడం ఈ మార్పునకు ప్రధాన కారణమని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. ప్రపంచ జనాభాలో 70 శాతానికి పైగా ప్రజలు రీప్లేస్‌మెంట్‌ స్థాయి వద్ద లేదా దాని కంటే తక్కువ సంతానోత్పత్తి రేటు ఉన్న దేశాల్లో నివసిస్తున్నారని మూడీస్‌ పేర్కొంది. 1950లో ప్రపంచ సగటు సంతానోత్పత్తి రేటు ఒక్కో మహిళకు 4.9 మంది పిల్లలు ఉండగా.. ప్రస్తుతం అది సుమారు 2.2కి పడిపోయింది. ఇక భారత్‌ ఇప్పటికీ యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా ఉన్నప్పటికీ.. వయస్సుల నిర్మాణంలో మార్పు ఇప్పటికే ప్రారంభమైందని నివేదిక పేర్కొంది. సంతానోత్పత్తి రేటు వేగంగా పడిపోతున్న దేశాలు భవిష్యత్తులో అంతే వేగంగా వృద్ధ జనాభా దేశాలుగా మారే అవకాశం ఉందని మూడీస్‌ హెచ్చరించింది.


ఆర్థిక వృద్ధికి సవాలు
వృద్ధ జనాభా పెరిగితే దేశంలో పనిచేసే వయస్సు జనాభా వృద్ధి మందగిస్తుంది. దీంతో కొన్ని రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా యంత్రాలతో పూర్తిగా భర్తీ చేయడం కష్టమైన రంగాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని నివేదిక పేర్కొంది. కార్మిక శక్తి పెరుగుదల తగ్గితే.. ఆర్థిక వృద్ధిని కొనసాగించేందుకు ఉత్పాదకత పెంచడం మరింత కీలకమవుతుంది. మరోవైపు వృద్ధుల సంఖ్య పెరగడం వల్ల పెన్షన్లు, ఆరోగ్య సేవలపై ప్రభుత్వాల వ్యయం పెరిగే అవకాశం ఉంది. పదవీ విరమణ చేసిన వారి సంఖ్య పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రజా సేవలను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని మూడీస్‌ సూచించింది. వృద్ధ జనాభా పెరుగుదల వినియోగ విధానాలను కూడా మార్చనుంది. ఆరోగ్య సేవలు, రిటైర్మెంట్‌ సేవలు, వృద్ధుల సంరక్షణ, సంపద నిర్వహణ, వృద్ధులకు అనుకూలమైన గృహాలకు డిమాండ్‌ పెరగవచ్చు. యువత ఆధారంగా నడిచే కొన్ని రంగాల్లో మాత్రం డిమాండ్‌ తగ్గే అవకాశం ఉంది.


విధానాలే కీలకం

సంతానోత్పత్తి తగ్గుదలను కేవలం జనాభా సమస్యగా చూడటం సరిపోదని తాజా పరిస్థితి స్పష్టం చేస్తోంది. పిల్లల పెంపకం ఖర్చులు, గృహ వ్యయం, ఉద్యోగ భద్రత, మహిళలపై సంరక్షణ భారం వంటి అంశాలు కూడా కుటుంబాల నిర్ణయాలను ప్రభావితం చేయగలవు. అందువల్ల ప్రభుత్వాలు నగదు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, గృహ–మార్ట్‌గేజ్‌ సహాయం, పిల్లల సంరక్షణ సదుపాయాలు, తల్లిదండ్రుల సెలవులు వంటి చర్యలను పరిశీలించాలని మూడీస్‌ సూచించింది. అయితే ఇలాంటి చర్యలతో ఇప్పటికే ఏర్పడిన జనాభా మార్పును పూర్తిగా వెనక్కి తిప్పడం సాధ్యం కాదని నివేదిక స్పష్టం చేసింది. అందుకే భవిష్యత్తులో వృద్ధ జనాభాను దృష్టిలో పెట్టుకుని పెన్షన్‌, వైద్యం, ఉపాధి, ఉత్పాదకత, సామాజిక భద్రత రంగాల్లో ముందస్తు ప్రణాళిక అవసరమని మూడీస్‌ సూచిస్తోంది. అంటే.. భారత్‌కు ఇప్పుడు జనాభా పెరుగుదల మాత్రమే సమస్య కాదు. రాబోయే దశాబ్దాల్లో ఆ జనాభా వయసు పెరగడం కూడా దేశ ఆర్థిక విధానాలకు పెద్ద పరీక్షగా మారనుంది.


భారత్‌కు హెచ్చరిక

చైనాలో ఈ మార్పు ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. 65 ఏండ్లు పైబడిన వారి వాటా సుమారు 20 ఏండ్లలో 7 శాతం నుంచి 14 శాతానికి రెట్టింపు అయిందని మూడీస్‌ పేర్కొంది. బ్రెజిల్‌, థాయ్‌లాండ్‌, టర్కీ కూడా ఇదే తరహా మార్పును ఎదుర్కొంటున్నాయి. భారత్‌లోనూ సంతానోత్పత్తి రేటు రాష్ట్రాలవారీగా గణనీయంగా తగ్గింది. 2024 సాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌ నివేదిక ప్రకారం దేశ సగటు మొత్తం సంతానోత్పత్తి రేటు 1.9గా ఉంది. అంటే రీప్లేస్‌మెంట్‌ స్థాయి 2.1 కంటే తక్కువ.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్