దుఃఖాన్ని ఒక పాత మెస్సేజ్ లాగా డిలీట్ చేశాను కాని అది నా జ్ఞాపకాల క్లౌడ్‌లో మరింత లోతుగా దాక్కుంది దాన్ని అక్కడే వదిలేసి నగరంలోకి నడిచాను అది నా నీడకు బదులుగా నాతో వచ్చింది పనుల్లో మునిగిపోయాను స్క్రీన్‌పై వంద నోటిఫికేషన్లు మెరిశాయి కానీ నా లోపల మాత్రం ఒకే పేరు నిశ్శబ్దంగా వెలిగింది నవ్వుతూ సేల్ఫీ దిగాను కెమెరాకు నా ముఖం కనిపించింది, నా లోపల పగిలిన అద్దం కనిపించలేదు ‘కాలం’ గాయం మీద ప్లాస్టర్ వేస్తుందనుకున్నాను కానీ అది నెమ్మదిగా గాయాన్ని కప్పేయడం కాదు దానితో కలిసి నడవడం నేర్పింది ఒక రాత్రి కిటికీ తెరిచాను చాలా రోజులుగా లోపల బంధించిన గాలి బయటికి వెళ్లింది దాని వెంట కొంచెం దుఃఖమూ వెళ్లింది అప్పుడు తెలిసింది కొన్ని బాధలు మనల్ని విడిచిపెట్టడానికి రావు మనలోని పాత మనిషిని విడిచిపెట్టి కొత్త మనిషిగా మనల్ని మళ్లీ తయారు చేయడానికి వస్తాయి దుఃఖాన్ని దాటిపోవాలని చూడొద్దు దాని గుండా నడవాలి ఒక రోజు వెనక్కి తిరిగి చూసినప్పుడు అప్పుడు అక్కడ గాయం ఉండదు నువ్వు నడిచిన ఒక దారి మాత్రమే ఉంటుంది వారాల ఆనంద్







కామెంట్‌లు (0)