సామ్రాజ్యవాదులు, జాతీయ అగ్రవర్ణ దురహంకారాల కబంధ హస్తాలలో నలిగిపోతూ ఉండే గుంటూరు జిల్లా పలనాడు ప్రాంతంలో దట్టమైన అడవుల మధ్య ఉండే ఒక మారుమూల కుగ్రామం ఒకప్పటి వినుకొండ. కులము మతము సాంఘిక దురాచారాలు వెయ్యి పడగల విషకోరలు, సామ్రాజ్య పాలన కలసి బుసలు కొడుతున్న రోజులవి. దానికి తోడు దట్టమైన అడవిలోంచి ఒక పులి వినుకొండ గ్రామం పై పడి నానా బీభత్సం చేసి మనుషులను చంపేదట! ప్రతిరోజు ప్రతిక్షణం భయం గుప్పెట్లో ప్రజలు ఉండేవారట. వలస వచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులు, రాజ్యం దోపిడి కాంక్షతోనే కొద్ది కరుణతో, వినుకొండ గ్రామ ప్రజల భయాన్ని పోగొట్టడానికి, ఎవరైనా ముందుకు వచ్చి పులిని చంపగలిగితే వారికి, పారితోషకము రాజ సత్కారం ఉంటుంది అని ప్రకటించారట. కానీ ఎవరు ధైర్యం చేయలేదట ఎవరు సాహసం చేయలేదట. ముఖ్యంగా యువకులు సాహసం చేయలేకపోయారట. చరిత్రకు కాలం ఎప్పటికప్పుడు ఒక వీరుని ఇస్తుందని, రుజువు పరిచిన సత్యంలోంచి ఒక వీరుడు ముందుకు వచ్చాడట. అయితే ఆ నునుగు మీసాల యువకుడ్ని ఒక అమ్మాయి ప్రేమించిందట. రెండు రోజులలో వివాహం కూడా జరగడానికి నిర్ణయం కూడా అయిందట! గ్రామస్తులు ఆ యువ వీరున్ని అడవికి పోవద్దని బతిమాలుతుంటే, ప్రేమించిన అమ్మాయి మాత్రం అడవికి పొమ్మని పులిని చంపి రమ్మని చెప్పిందట. వీరుడిగా తిరిగి వస్తే, ఒక సాహసి నా భర్తని గర్వంగా చెప్పుకుంటానని, అతడు మరణిస్తే కూడా ఆ వీర సాహసానికి చిహ్నంగా నేను అతని స్మృతిలో ఉంటూ జీవితాంతం అతడే నా భర్తగా భావిస్తానని, కన్న మట్టికి ప్రజల క్షేమం కోసం సాహసం చేసే వీరుడిని ప్రేమించినందుకు, ఎంతో ఆనందంగా ఉంది. అతడిని వెళ్ళనివ్వండి అడవిలోకి అని తల ఎత్తి చెప్పిందట. సూర్యుడు నెలబాలుడే కాదు, ఉద్యమ బాలుడు అయినట్లు, అడవిలోకి వీరుడు పోయిండట! ఒక రాత్రి దట్టమైన చీకటి అడవి కొమ్ముల మధ్య కొవ్వొత్తి కరిగిపోయింది. ఒక పగలు కూడా పట్టుమని వెలిసిపోయింది. వీరుడు తిరిగి రాలేదు. భయం భయంతోనే ప్రజలు సమూహంగా కాగడాల వెలుగులతో అడవిలోకి వెళ్లి చూస్తే ఏముంది! ఒకవైపు వీరుడు, మరోవైపు పులి యుద్ధ క్షేత్రంలో మృత్యోదృశ్యం. సమూహం మధ్యలోంచి వీరుడిని ప్రేమించిన స్త్రీ దృశ్య క్షేత్రంలో నిలబడి, నుదుట కుంకుమ తూర్చుకుంది. చేతుల గాజులు పగలగొట్టుకుని, పగలబడి దుఃఖానికి నవ్వుల్ని నేర్పిందట. పంచభూతాల సాక్షిగా చూపుల్ని సముద్ర అలలు చేసి ఈ సాహసి నా సహచరుడు నా భర్త గర్వంగా తల ఆకాశానికి వెన్నెల బొమ్మ చేసి చెప్పిందట..! ఇచ్చోట..... నే లేత ఇల్లాలి నల్లపూసల సౌరూ, గంగ కలిసిపోయే.... జాషువా మధ్య గర్భ కాంతికి పురుడు పోసిందట. జాషువా ఒక్కొక్క పద్యానికి ఒక యదార్థ గాథ ఉందని పద్యం పద్యం దుఃఖంలో గర్భం దాల్చి పురుడు పోసుకుందని, పద్యము కొత్త జననం ఈ నేల మీద శిశువై శివమెత్తిందని, తెలుగు సాహిత్య శిఖరం మీద జెండా అయిందని, చరిత్ర సంతకమైందని.... ఎప్పటివలె ఒకరోజు రేడియో ఆకాశవాణి వింటూ ఉంటే, జాషువా సమకాలికుడు సహచరుడు.. ఇచ్చోటనే... పద్యం పురుడు పోసుకున్న జన్మ రహస్యం ఇదని, వినుకొండ వీరుడి యదార్థ సాహసగాథ చెప్పాడు. అప్పటికే దుఃఖంలో నిలబడి జీవితంతో యుద్ధం చేస్తున్న నాకు, నన్ను వెంటాడుతున్న జాషువా, మరింత లోపలకి పోయి, ప్రభావ కాంతి జ్యోతి అయిండు. నా చీకటి గదిలో. స్నేహ, శత్రువు, ముఖాల నవ్వుల అంతర్ కుట్ర మీద, ఒక అగ్గిపుల్ల గీసి ఇచ్చాడు విశ్వ మానవ మహాకవి గుర్రం జాషువా.
తండ్రి... జాషువా
నిన్ను దలిచి!
మాట నడకకు నిలువెత్తు కులం నింపుకొని
భూమంతా పుట్టలు పుట్టెలుగా పడగల నీడల కింద
జాతి లోహితుడు శవం గా పడి ఉన్న
ఒక దుఃఖ లోకం మీద..,
ఆకాశము కూడా అంటరానిదై
ఊరు అవతల ఏరు దాటి అడవిలో ఎండిన
ఒంటరి చెట్టుకు ఉరి పోసుకుంటున్నప్పుడు
అక్షరము అగ్నిపుణితమై పురుడుపోసుకుంది!
తండ్రి జాషువా...!
ఎంత దుఃఖం! ఎంత వేదన!
ఎంత హైందవ రంపపు చిత్రహించకు
పుట్టం పెట్టుకున్నావో..,
పడగల మీది అక్షరం...... నీ
పాదాల కింద మట్టి తేజం చేసుకున్నావు.
తండ్రి జాషువా...!
ఇచ్చోటనే నువ్వు ఇచ్చిన
అక్షరం ఆయుధా అక్షయపాత్రయింది.
దళిత తల్లి యుద్ధపుత్ర వీర తిలకం అయింది.
తండ్రి నిన్ను దలిచి
హైటెక్ హైందవ కుబుసం మీద కూడా
యుద్ధం జరుగుతుంది!
( విశ్వ మానవ మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా )
జనజ్వాల, 9949163770







కామెంట్‌లు (0)