Magazines

బీజేపీ విస్త‌ర‌ణ సంస్థ‌గా ఈడీ

1 గంట క్రితం

ED acting as an expansion arm of the BJP.
avatar
balaji

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 4 నిమిషాల చదవడం

కేర‌ళం మాజీ సీఎం పిన‌ర‌యి ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలు

ఈడీ చ‌ట్ట‌విరుద్ధ‌ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌లు

కేర‌ళ‌ంలో జ‌రిగే ఆందోళ‌న‌ల్లో పాల్గొనాల‌ని కేజ్రీవాల్‌ను కోరాం

తీవ్ర నియంతృత్వ, ఆధిపత్య ధోరణితో సీఈసీ

బీజేపీ ఉద్యోగిలాగే సీఈసీ విధులు

ఈ తీవ్రమైన పరిస్థితిపై అన్ని పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాం

రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలనేది సీపీఐ(ఎం) విధానం :
ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌తో సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ భేటీ


నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో బీజేపీ విస్తరించేందుకు స‌హాయ‌కారి సంస్థ‌గా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌దర్శి ఎంఎ బేబీ విమ‌ర్శించారు. సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో స‌భ్యులు, కేర‌ళం మాజీ ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత‌ పిన‌ర‌యి విజ‌య‌న్‌ ప్రతిష్టను దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకుని ఈడీ దాడులు చేస్తోంద‌ని ధ్వ‌జమెత్తారు. బీజేపీ ఉద్యోగిలాగానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప‌ని చేస్తున్నారని, ఈ తీవ్రమైన పరిస్థితిపై అన్ని పార్టీల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని అన్నారు. ప్ర‌తిప‌క్షాల‌పై ఈడీ చ‌ర్య‌లు, ఎన్నికల సంఘం వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్వయాన్ని మరింత విస్తృతం చేసే దిశగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం నాడిక్క‌డ ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి, ఆప్ జాతీయ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌తో సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎంఎ బేబీ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కేజ్రీవాల్‌కు పూల‌ బోకేకి బదులుగా కేరళ రాష్ట్రం గురించి కేర‌ళ మాజీ ఆర్థిక మంత్రి టీ.ఎం థామ‌స్ ఐజాక్‌ రాసిన పుస్తకాన్ని అందజేశారు. లోథి రోడ్డులో కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్ర‌తిప‌క్షాల‌పై ఈడీ చ‌ర్య‌లు, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన వివాదం, ఎన్నికల సంఘం పనితీరు, ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలు చర్చకు వచ్చాయి. ఎన్నికల వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్ష శక్తులన్నీ కలిసి నిలవాల్సిన అవసరాన్ని బేబీ ప్రస్తావించారు.

ఈ అంశంపై ‘ఇండియా’ బ్లాక్‌ పరిధిని దాటి ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకుని విస్తృత వేదికను ఏర్పాటు చేయాల్సిన అవసరంపై చర్చలు జరిపారు. ఇప్పటికే పలు పార్టీలకు లేఖలు రాసినట్లు కేజ్రీవాల్‌కు తెలిపారు. అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారంపైనా సమావేశంలో చర్చించారు. కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చర్యలను బేబీ ప్రస్తావించారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌ గతంలో ఈడీ చర్యలను ఎదుర్కొన్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈడీ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన ప్ర‌తిఘ‌ట‌న అవ‌స‌రాన్ని బేబీ నొక్కి చెప్పారు. అలాగే ఈడీ చ‌ర్య‌ల‌కు వ్య‌తిరేకంగా కేర‌ళ‌ జ‌రిగే పోరాటాల్లో పాల్గొనాల‌ని కేజ్రీవాల్‌ను కోరారు. అందుకు ఆయ‌న సానుకూలంగానే స్పందించారు. కేజ్రీవాల్‌తో చర్చ సందర్భంగా ప్ర‌తిప‌క్షాల‌పై ఈడీ, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల చ‌ర్య‌లు, ఎన్నికల సంఘం వ్యవహారంపై బలమైన ఉమ్మడి పోరాటం అవసరమని ఆయన అభిప్రాయపడినట్లు బేబీ వెల్లడించారు. అయితే, దీనిపై ఆమ్ఆద్మీ పార్టీ అంతర్గతంగా చర్చించిన అనంతరం తన నిర్ణయాన్ని తెలియజేస్తుందని కేజ్రీవాల్‌ చెప్పినట్టు తెలిపారు.

కేజ్రీవాల్‌తో భేటీ అనంత‌రం ఎంఎ బేబీ మీడియాతో మాట్లాడుతూ తాము ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించామ‌ని అన్నారు. కేర‌ళం మాజీ ముఖ్యమంత్రి, కేరళం ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తీసుకుంటున్న చట్టవిరుద్ధ చర్యల గురించి, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్న తీరును బట్టబయలు చేస్తూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో వచ్చిన నివేదిక ప్రచురితమైన త‌రువాత‌ చోటుచేసుకున్న పరిణామాల గురించి చర్చించామ‌ని తెలిపారు. బీజేపీ ప్రభుత్వ విస్తరణ విభాగంగా పనిచేస్తున్న ఈడీ, కేరళం మాజీ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోంద‌ని విమ‌ర్శించారు. చాలా కాలంగా ఈడీ వివిధ చర్యలకు పాల్పడుతుంద‌ని దుయ్య‌బ‌ట్టారు. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా వీరందరూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్యలకు బాధితులేన‌ని, అందుకే ఈ దాడులకు వ్యతిరేకంగా కేరళంలో జరిగే కార్యక్రమాల్లో ఆయన వచ్చి పాల్గొనడం మంచిదని భావించామ‌ని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగానికి, దేశ సమాఖ్య గణతంత్రాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు వ్యతిరేకంగా కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్‌) నిర్వహిస్తున్నఆందోళ‌న కార్యక్ర‌మాలకు హాజరు కావాల్సిందిగా అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించాన‌ని తెలిపారు.


రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలనేది సీపీఐ(ఎం) విధానం
ఎలక్షన్ కమిషన్ తీవ్ర నియంతృత్వ, ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తోందనే విషయాన్ని నొక్కి చెప్పిన‌ట్టు తెలిపారు. ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఈ సంస్థను ఒక సాధనంగా బీజేపీ ఎలా ఉపయోగిస్తుందో బయటపెట్టడానికి బలమైన పోరాటం జరగాలని భావించిన‌ట్టు చెప్పారు. ఇండియా బ్లాక్‌తో పాటు ఇతర పార్టీలతో కూడా సంప్ర‌దింపులు చేస్తున్నామ‌ని అన్నారు. ఆయా పార్టీలు కూడా తమ పార్టీలో చర్చించుకుని, కలిసి ఎలా పనిచేయాలో చెబుతామన్నార‌ని అన్నారు. కేజ్రీవాల్‌తో ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వ్యవహరిస్తున్న నియంతృత్వ, చట్టవిరుద్ధమైన రీతిని ఎండగట్టడానికి మనం కలిసి పనిచేయాలని మాత్రమే తెలిపాన‌ని అన్నారు. ఎన్నికల సంఘం విశ్వసనీయత, భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్న అసాధారణ పరిస్థితిని ఎంఏ బేబీ వివ‌రించారు. రాజ్యాంగ విలువలను, పౌరుల ఓటు హక్కును పరిరక్షించడానికి సమన్వయ చర్యలు తక్షణమే తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. కేరళం మాజీ చీఫ్ సెక్రెటరీ ఇటీవల ఒక విషయాన్ని వెల్లడించిన విష‌యాన్ని ఎంఎ బేబీ గుర్తు చేశారు. జ్ఞానేశ్ కుమార్ విదేశాంగ మంత్రిత్వ శాఖలో సివిల్ సర్వెంట్‌గా పనిచేస్తున్నప్పుడు, కేరళం చీఫ్ సెక్రెటరీగా ప‌ని చేసే అధికారిని బీజేపీలో చేరి మంత్రి కావాలని ప్రభావితం చేయడానికి ప్రయత్నించార‌ని అన్నారు.

అప్పట్లో సివిల్ సర్వెంట్‌గా ఉన్నప్పుడు జ్ఞానేశ్ కుమార్ ఎలా పనిచేశారో, ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా కాకుండా బీజేపీ ఉద్యోగిలాగే పనిచేస్తున్నారని విమ‌ర్శించారు. ఆయన హోమ్ మంత్రిత్వ శాఖలో ఉన్నప్పుడు కూడా బీజేపీ ఉద్యోగిలాగే వ్యవహరించార‌ని, ఇది దేశంలో ఏర్ప‌డిన తీవ్రమైన పరిస్థితి అన్నారు. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ కలిసి పనిచేయాలనేది సీపీఐ(ఎం) విధానమ‌ని స్ప‌ష్టం చేశారు. సీపీఐ(ఎం) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా తాను ఈ నిర్ణయాన్ని తెలిపానని, అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి ముందుకు రావాల‌ని అన్నారు. బీజేడీ, విజ‌య్ పార్టీ, క‌మ‌ల్‌హాస‌న్ పార్టీ, సీజేపీ అన్ని పార్టీలు క‌లిసి ప‌ని చేయాల‌ని కోరారు. ఇప్ప‌టికే సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు క‌లిసి చ‌ర్చించార‌ని, మిగిలిన వామ‌ప‌క్ష పార్టీలు ఆర్ఎస్‌పీ, ఫార్వ‌ర్డ్‌బ్లాక్ సంప్ర‌దింపులు చేశామ‌ని అన్నారు. ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు వ్య‌తిరేకంగా అన్ని పార్టీలు క‌లిసి బ‌ల‌మైన పోరాటాన్ని నిర్మించేందుకు ముందుకు రావాల‌ని ఐదు వామ‌ప‌క్ష పార్టీలు పిలుపు ఇచ్చాయ‌ని గుర్తు చేశారు. సెప్టెంబర్‌ 30న ఢిల్లీలో ‘ఇండియా’ బ్లాక్‌ పార్టీల సమావేశం జరగనుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన పరిణామాలు, ఎస్ఐఆర్‌ తదితర అంశాలపై ఆ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బేబీ–కేజ్రీవాల్‌ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్