కష్టాలున్నా పేదరికంతో గుర్తింపు కోరుకోని సౌమ్యులు
ఐక్యంగా ఉంటేనే బలం.. రాజకీయాల్లో మీ వాటా సాధించుకోవాలి
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి రోశయ్యే కారణం..
అందుకే విగ్రహం ఏర్పాటు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఉప్పల్ భగాయత్‌లో ‘ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన’ నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆర్యవైశ్యులు ఎంతో సౌమ్యులని, అమితమైన ఆత్మాభిమానం కలవారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల్లోనూ ఎంతోమంది పేదలు ఉన్నప్పటికీ, ఆత్మగౌరవం కోసం పేదలుగా గుర్తింపు పొందడానికి ఇష్టపడరని తెలిపారు. సమాజంలో ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా గౌరవప్రదంగా జీవించే మనస్తత్వం వారిదని ప్రశంసించారు. ఆదివారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ భగాయత్‌లో నిర్మించనున్న ‘ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవనం’ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎల్లప్పుడూ ఆర్యవైశ్యుల శ్రేయోభిలాషినని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎంత పేదవాడైనా సరే ఆకలితో అలమటిస్తే కడుపు నిండా తినడానికి అప్పు ఇచ్చే సహృదయం ఆర్యవైశ్యుల సొంతమన్నారు. పల్లెల్లో ఏ శుభకార్యం జరిగినా మొదట గుర్తుకొచ్చేది ఆర్యవైశ్య సోదరులేనని తెలిపారు. ప్రపంచంలో వ్యవసాయం, వ్యాపారం అనే రెండే ప్రధాన వృత్తులని, వ్యాపార రంగం ద్వారా సమాజానికి ఎనలేని సేవలందిస్తున్నారని కొనియాడారు.
ఆర్థిక క్రమశిక్షణకు రోశయ్యే రోల్ మోడల్
గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వై.ఎస్.రాజశేఖరరెడ్డి వంటి నేతలు ప్రభుత్వ ఖజానా(గల్లాపెట్టె) నిర్వహణ బాధ్యతలను నమ్మకంతో ఆర్యవైశ్యులకే అప్పగించారని సీఎం గుర్తుచేశారు. జూన్ 2, 2014న రాష్ట్రం విడిపోయిన సమయంలో తెలంగాణ రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో ఏర్పడిందంటే దానికి కారణం ఆనాటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోశయ్య ఆర్థిక క్రమశిక్షణేనని ప్రశంసించారు. శాసనమండలిలో తాను దూకుడుగా మాట్లాడిన రోజుల్లో రోశయ్య తనను పిలిచి.. ‘ఆవేశం తగ్గించుకుని, అనుభవంతో ముందుకు వెళ్తే ఉన్నత స్థాయికి ఎదుగుతావు’ అని ఆశీర్వదించారని, తనలోని ప్రతిభను మొదట గుర్తించింది ఆయనేనని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు. నాలుగు దశాబ్దాల క్రితమే హైదరాబాద్‌కు వచ్చిన రోశయ్య.. ‘మంచైనా, చెడైనా నాది ఇక హైదరాబాద్’ అని ప్రకటించారని, ఆయన గౌరవాన్ని కాపాడేందుకే నగర నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. విగ్రహ ఏర్పా టుపై కొందరు విమర్శలు చేసినా, ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం గౌరవించిందని చెప్పారు.
ఐక్యంగా ఉంటేనే రాజకీయ వాటా
చరిత్రలో ఇంతటి ఘనత ఉన్న ఆర్యవైశ్యులకు సమాజంలో రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వానికి ఆర్యవైశ్యుల పట్ల సంపూర్ణ విశ్వాసం, గౌరవం ఉన్నాయని తెలిపారు. నిర్మించబోయే ఆత్మగౌరవ భవనం ఆర్యవైశ్యుల్లోని నిరుపేద బిడ్డల ఉన్నతికి సంపూర్ణంగా ఉపయోగపడాలని ఆకాంక్షిం చారు. ఈ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రకటించారు. ‘‘ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉన్నప్పుడే మీకు బలం చేకూరుతుంది. సమైక్యంగా ఒక్కతాటిపై నడిస్తే సమాజం, రాజకీయ పార్టీలు గౌరవిస్తాయి. ఇప్పటికే మా ప్రభుత్వం ఆర్యవైశ్యులకు ఒక కార్పొరేషన్ పదవి ఇవ్వడంతో పాటు, కొడంగల్‌లోని ఒక మున్సిపాలిటీకి ఆర్యవైశ్యుడిని చైర్మెన్‌గా నియమించింది. రాజకీయాల్లో మీ న్యాయమైన వాటాను మీరు సాధించుకోవాలి. కలిసికట్టుగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్య నారాయణ గుప్త, బండారి లక్ష్మారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, మల్‌రెడ్డి రంగారెడ్డి, నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్త, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌తో పాటు పలువురు ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్యవైశ్యులు ఆత్మాభిమానవంతులు
13 సెప్టెంబర్, 2026

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 14, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)