సైజ్ మినహా కార్డులో కొత్త ఆప్షనేమీలేదు
రేషన్ దుకాణాల్లోకెళ్లి కార్డు తీసుకోవడంపై అనాసక్తి
ఆగస్టు 15న సంగారెడ్డిలో ప్రారంభించిన సర్కారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీ నత్తనడకన సాగుతోంది. ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి అట్టహాసంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 40 రోజులువుతున్నా అవి లబ్దిదారుల చెంతకు చేరలేదు. ఇప్పటికే అన్ని కార్టులను సిద్ధం చేసి, రేషన్ దుకాణాలు, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలు, మండలాల కార్యాలయాలకు చేర్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని చోట్ల స్థానిక కార్పొరేటర్లు, కౌన్సిలర్ల కన్ను సన్నల్లోనూ పంపిణీ జరుగుతున్నట్టు తెలిసింది. కొన్ని జిల్లాల్లో కార్డుల పంపిణీ వేగవం తంగా జరుగుతుంటే, మరి కొన్ని జిల్లాల్లో పంపి ణీ చాలా నిదానంగా సాగుతోంది. సంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి వంటి జిల్లాల్లో ఎక్కువ మంది లబ్దిదా రులకు కార్డుల పంపిణీ జరిగినట్టు అధి కారులు చెబుతున్నారు. మిగతా జిల్లా ల్లో పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో ప్రజల్లో అనాసక్తి కారణంగా పంపిణీ నత్తనడకన సాగుతోంది.
1.06 కోట్ల కార్డులు.... 3.43కోట్ల లబ్దిదారులు
రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై ఇటీవల పౌరసరఫరాల శాఖ తాజాగా కీలక గణాంకాలను విడుదల చేసింది. గడిచిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో 14.40 లక్షల కొత్త కార్డులను మంజూరు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2025 జనవరిలో 89.95 లక్షలుగా ఉన్న రేషన్ కార్డుల సంఖ్య, 2026 జనవరి నాటికి 1,04,35,848కు చేరింది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లబ్దిదారుల సంఖ్య 3,35,96,875కు పెరిగింది. అదే సమయంలో ప్రస్తుత జులై మాసానికి ఈ సంఖ్య 1.06కోట్లకు చేరుకోవడం గమనార్హం. అంటే గడిచిన సంవత్సర కాలంలోనే రాష్ర్టంలో రేషన్ కార్డుల సంఖ్య ఏకంగా 16,32,810 పెరిగింది. దీంతో లబ్దిదారుల సంఖ్య కూడా 3.43కోట్లకు చేరుకుంది. ఈ కార్డుల ద్వారా రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం మందికి ప్రస్తు తం నెలకు 6 కిలోల చొప్పున ఉచిత సన్న బియ్యం అందుతోంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రూ.14వేల కోట్ల మేర ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం రాష్ర్టంలో అత్యధికంగా హైదరాబాద్ లో 7.20లక్షలకు పైగా కార్డులు ఉండగా తర్వాతి స్థానంలో రంగారెడ్డిలో 6.21లక్షల కార్డులు, మేడ్చల్ మల్కాజిగిరిలో 5.91లక్షల కార్డుల వరకు ఉండగా అత్యల్పంగా ములుగు, వనపర్తి జిల్లాలో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి నెలా 2.16లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంను పంపిణీ చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ కార్డు దారులకు 5 కిలోల బియ్యం ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో కిలో కలిపి ప్రతి లబ్దిదారునికి 6కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తోంది.
ఆసక్తి చూపని లబ్దిదారుల
ఆహారభద్రతా కార్డులు ఉంటే, పోర్టబుల్ పద్ధతిలో రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా ...రేషన్‌కార్డు నెంబర్ ఉంటే చాలు బియ్యం తీసుకోవచ్చు. ప్రస్తుతం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పోర్టబుల్ కూడా ఉండటంతో కార్డు హోల్డర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇంటికి సమీపంలోని రేషన్ దుకాణానికి కార్డుదారులను అలాట్ చేస్తారు. ఇతర కారణాలతో అక్కడి నుంచి దూరంగా పోయిన ప్పటికీ బియ్యం కూడా అక్కడే తీసుకోవచ్చు. దీంతో కొత్త స్మార్టు కార్డు తీసుకున్నా...తీసుకోకపోయినా... ఒక్కటేలే అని కార్డుదారులు భావిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. పాత కార్డు నెంబర్ మారలేదు. స్మార్టు కార్డులో క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఉన్నా....రేషన్‌కార్డుల్లో స్కానర్లు అందుబాటులోకి తీసుకురాలేదు. కాబట్టి ఎక్కడైనా బియ్యం తీసుకునే వెసులుబాటు ఉంది. ఇల్లు మారిన వారు, ఊర్లో కార్డు ఉండి పట్టణాల్లో నివసిస్తున్న వారు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సమయం కుదిరినప్పుడు స్మార్టు రేషన్‌కార్డు తీసుకుందాం... లే అన్న ధోరణితో ఉన్నారని రేషన్‌డీలర్లు అంటున్నారు.







కామెంట్‌లు (0)