Magazines

అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి

1 గంట క్రితం

పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 2 నిమిషాల చదవడం

పనుల ఎంపికలో గ్రామసభలకు ప్రాధాన్యత : పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క ​
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ర్టంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ‘వీబీ ‌జీ గ్రామ్‌ ’ అమలుపై బుధవారం హైదరాబాద్‌‌లోని సచివాలయం నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో రోజుకు కనీసం 100 నుంచి 150 మంది కూలీల చొప్పున రాష్ర్ట వ్యాప్తంగా కనీసం 6 లక్షల మంది పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. పని ప్రదేశాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, రోజుకు రూ.308 వేతనం అందేలా ఉత్పాదక పనులకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఎలినినో కారణంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనీ, దీనివల్ల గ్రామీణ కూలీల ఆదాయం, వ్యవసాయం, భూగర్భజలాలు, పశుగ్రాసం పై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. వీబీ జీ గ్రామ్‌ పనులను కేవలం ఉపాధి కల్పించే కార్యక్రమంగా కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రక్షణ కల్పించేలా, నీటి వనరులను పెంపొందించేలా అమలు చేయాలని సూచించారు. సర్పంచులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను గుర్తించి పనులను వేగవంతం చేయాలన్నారు. ఉపాధి హామీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించకపోతే భవిష్యత్‌లో నిధుల కేటాయింపుపై ప్రభావం పడే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. ఎన్ని పనులు సమర్థవంతంగా చేపడితే అంత మేరకు గ్రామాలకు నిధులు వచ్చేలా ప్రణాళిక రూపొందించు కోవాలని సూచించారు. సోషల్, రిసోర్స్ మ్యాప్ ఆధారంగా గ్రామావసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో ఎంపిక చేసిన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామంలో అవసరం ఉన్న ప్రతి కుటుంబానికి కొత్త జాబ్ కార్డు అందేలా చర్యలు తీసుకోవాలని సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పక్షపాతంతో కొన్ని జిల్లాలకే నిధులు కేటాయించారనీ, తమ ప్రభుత్వం మాత్రం అన్ని జిల్లాలకు, అన్ని గ్రామాలకు సమన్యాయం చేసే విధంగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.204.50 కోట్ల ఎలిజిబుల్ మెటీరియల్ కాంపొనెంట్ అందుబాటులో ఉందని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్