30 కోట్ల మంది వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం
వీబీ-గ్రామ్‌జీపై గాంధీ విగ్రహం ముందు
ధర్నా.. కేంద్రంపై ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరు మార్చి (వీబీ-గ్రామ్‌జీ) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జి నాగయ్య విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వద్ద ఉన్న గాంధీ విగ్రహం ముందు వ్యవసాయ కార్మిక సంఘంతో పాటు స్వచ్చంద సంస్థలు, దళిత, గిరిజన, వృత్తి ప్రజాసంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని (మనరేగా) పునరుద్దరించాలని, ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగమే వీబీజీ గ్రామ్‌జీ పథకమనీ, కూలీల వ్యతిరేక మోడీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు. ప్రజా సంఘాల పిలుపులో భాగంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రా ములు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జి నాగయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ, ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్ అరుణ జ్యోతి,కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ గ్రామీణ వ్యవసాయ కార్మికులకు కనీసం వంద రోజుల ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఎంజీఎన్‌ఆర్ ఈజీఏను తీసుకొచ్చారని చెప్పారు. ప్రస్తుతం దాని అమలుకు అవసరమైన నిధులను తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2004లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు వామపక్షాల మద్దతు కీలకంగా మారిన సమయంలో, కొన్ని షరతులతో యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని తెలిపారు.
వ్యవసాయ రంగంలో ఏడాది పొడవునా ఉపాధి లభించని పరిస్థితుల్లో వ్యవసాయ కార్మికులకు అదనంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకువచ్చినట్టు గుర్తు చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీల వేతనాలు పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. అందుకు కేంద్రం తగినన్ని నిధులు కేటాయించటం లేదన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది గ్రామీణ కార్మికులు ఈ పథకంపై ఆధారపడుతున్నారని తెలిపారు. వారి జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పథకానికి నిధులను పెంచాలని డిమాండ్ చేశారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను క్రమంగా తొలగించే దిశగా చర్యలు చేపడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి ప్రత్యామ్నాయంగా వీబీ-గ్రామ్‌జీ పేరుతో కొత్త పథకాన్ని తీసుకురావడం ద్వారా ఉపాధి హామీ పథకం స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కొత్త విధానాల వల్ల గ్రామీణ ఉపాధి కూలీలకు అందుతున్న హక్కులు, పని దినాలు, వేతనాలు, కేంద్ర నిధులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 30 కోట్ల మంది వ్యవసాయ కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు.
గాంధీ పేరుతో ఉన్న ఆ చట్టాన్ని తొలగించటంలో గాంధీ పేరును ఉచ్చరించటం వారికి ఇష్టం లేదన్నారు. గాంధీని హత్య చేసిన వారికి వారసులుగా ఉన్న వారు అధికారంలో ఉన్నారని తెలిపారు. మూడో సారి అధికారంలోకి వచ్చిన మోడీ సాధారణ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న హక్కులను హరిస్తున్నదని విమర్శించారు. అందులో భాగంగానే గాంధీ పేరుతో ఉన్న చట్టాన్ని సవరించారని చెప్పారు. ఇది దుర్మార్గ చర్యకాక మరేమిటని ప్రశ్నించారు. గతంలో కేంద్రం ప్రభుత్వం 90శాతం నిధులతో ఈ చట్టాన్ని కొనసాగించారనీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై 40శాతం నిధులివ్వాలని చెబుతున్నదని తెలిపారు. క్రమంగా కేంద్రం ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియనుంచి తప్పుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. రోజువారి కూలి రూ.800గా ఉండాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతుసంఘం కోశాధికారి మూడ్ శోభన్, వ్యకాస ఉపాధ్యక్షులు బొప్పిడి పద్మ, రాష్ట్ర నాయకులు ఆర్. ఆంజనేయులు, గాయకుడు రింగు సైతులు పాల్గొన్నారు.





కామెంట్‌లు (0)