Magazines

ద్రవ్యోల్బణం కోరలు

48 నిమిషాల క్రితం

The fangs of inflation
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

సెప్టెంబర్‌లో 5.65 శాతానికి చేరొచ్చు
ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచొచ్చు : ఎస్బీఐ రీసెర్చ్ వెల్లడి


న్యూఢిల్లీ : దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోందని ఎస్బీఐ రీసెర్చ్ అంచనా వేసింది. సెప్టెంబర్‌లో వినియో గదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 5.65 శాతానికి చేరొచ్చని అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో 6.5 శాతాన్ని దాటే అవకాశం ఉందని విశ్లేషించింది. అయితే 2027 ప్రారంభం నాటికి ద్రవ్యోల్బణం తిరిగి 6 శాతంగా ఉండొచ్చని తెలిపింది. పెరుగుతున్న ధరల ఒత్తిళ్లు, అంతర్జాతీయ మార్కెట్లలో రిస్క్‌లు, రూపాయి పతనం నేపథ్యంలో అక్టోబర్ 5-7 తేదీల్లో జరిగే ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో రెపో రేటును కనీసం 25 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉంది. ఆగస్టు సమీక్షలోనూ రేట్లలో మార్పులు చేయలేదు. జులైలో 4.45 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టులో 4.82 శాతానికి పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. ధరల పెరుగుదల కొన్ని వస్తువులకు మాత్రమే పరిమితం కాలేదని.. అనేక ఉత్పత్తులకు విస్తృతమయ్యాయని పేర్కొంది. ఈ ఏడాది జనవరి ద్రవ్యోల్బణంలో 90 శాతం వాటా కలిగిన వస్తువుల సంఖ్య 22 ఉండగా, ఆగస్టులో 51కి పెరిగిందని వెల్లడించింది. మరోవైపు డాలర్ బలపడటం, చమురు సంస్థలు, కార్పొరేట్ల నుంచి విదేశీ మారకద్రవ్యానికి డిమాండ్ పెరగడం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల విక్రయాలు, రూపాయిపై ఒత్తిడి తదితర పరిణామాలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెంచుతున్నాయని ఎస్బీఐ రీసెర్చ్‌ హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు దీర్ఘకాలిక సగటులో 87 శాతానికే పరిమితం కావడం, 43 శాతం జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదవడం, అక్టోబర్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాల అంచనాలు రబీ పంటలపై ప్రభావంతో ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరగొచ్చని తెలిపింది. ఆర్‌‌బిఐ అక్టోబర్ పాలసీలో జిడిపి వృద్ధి అంచనాను 30 బేసిస్ పాయింట్లు, ద్రవ్యోల్బణ అంచనాను 20 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్