సర్ ప్రక్రియను నిలిపేయాలి
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్
టీజేఎస్ ఆధ్వర్యంలో మౌన దీక్ష
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్
ఎన్నికల కమిషన్ పారదర్శకంగా వ్యవహరించాలని, సర్ ప్రక్రియను నిలిపివేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఎమ్మెల్సీ, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె. శ్రీనివాస్‌రెడ్డి దీక్షను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ సమావేశాలు సక్రమంగా జరగకపోవడం, సర్ ప్రక్రియలో అవకతవకలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించే విషయాలన్నారు. అధికారంలో ఉన్నవారు చెప్పినట్టు ఎన్నికల కమిషన్ వ్యవహరించే పరిస్థితి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శకమైన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్ కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. సర్ ప్రక్రియలో కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే ఫారం-6లో అదనపు అంశాలను చేర్చడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోందన్నారు. కొత్తగా ఓటు హక్కు పొందే యువతకు అనవసరమైన అడ్డంకులు సృష్టించడం సరికాదన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన బాధ్యతలను ప్రయివేటు సంస్థలకు అప్పగించడంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఓటర్ల నమోదు ప్రక్రియలో సాంకేతిక వ్యవస్థల వినియోగం, వాటి నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డా. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పక్షాలూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యం, ఓటు హక్కు పరిరక్షణకు ముందుకు రావాలని కోరారు. రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ సామాన్య ప్రజలకు కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, అర్హులైన పౌరుడి ఓటు హక్కు పరిరక్షణ కోసం టీజేఎస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర యువజన అధ్యక్షులు సలీమ్ పాషా తెలిపారు. కార్యక్రమంలో టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, నిజ్జన రమేష్ ముదిరాజ్, పల్లె వినయ్‌కుమార్, రాష్ట్ర విద్యార్థి అధ్యక్షులు మాసంపల్లి అరుణ్‌కుమార్, బీసీ విభాగం అధ్యక్షులు జస్వంత్‌కుమార్, రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి హనుమంత్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)