Magazines

‌త్వరలో కొడంగల్‌‌లో బీఆర్‌ఎస్‌‌ సభ

58 నిమిషాల క్రితం

BRS meeting in Kodangal soon
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

బీజేపీ ఎంపీలకు ప్రజలతో సంబంధాల్లేవు :మీడియాతో చిట్‌‌చాట్‌‌లో మాజీమంత్రి తలసాని
ఖైరతాబాద్‌‌లో గెలుపు మాదే మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు తప్పదు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి సిద్ధిపేటలో సభ పెట్టాక కొడంగల్‌‌లో బీఆర్‌ఎస్‌ ‌సభ ఉంటుందని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రతిపక్ష పార్టీ సీఎం నియోజకవర్గంలో సభ పెట్టి తామేంటో చూపిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌‌లో ఆయన మీడియాతో చిట్‌‌చాట్‌ ‌నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు స్థానాలనూ ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడం ఆ పార్టీని దెబ్బతీస్తుందని చెప్పారు. బీసీల్లో పట్టభద్రులు ఎక్కువగా ఉన్నారనీ, వారంతా ఆలోచించి ఓట్లు వేస్తారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ‌నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా హైదరాబాద్‌ ‌నుంచి కాసాని వీరేశ్‌, నాగేందర్‌‌గౌడ్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిన ఏనుగుల రాకేశ్‌‌రెడ్డికి ఇవ్వొచ్చని అన్నారు. సీఎం సిరిసిల్ల పర్యటన కాంగ్రెస్‌కు నె‌గెటివ్‌గా మారిందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వారు ఏ నియోజకవర్గానికైనా వెళ్లే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. కానీ వేలాది మంది పోలీసులతో వెళ్లి కేటీఆర్, హరీశ్‌రావు‌లను తిడితే ఏమోస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్టు చేసి జగన్‌ బూమరాంగ్ అ‌య్యారని గుర్తు చేశారు. తెలంగాణ సాధించిన నేతగా కేసీఆర్‌‌కు ప్రజల్లో పేరుందనీ, దాన్ని చెరిపేయలేరని అన్నారు.
సస్పెండ్‌ ‌చేసి దమ్ముంటే అసెంబ్లీకి రండి అంటే ఎలా?
ప్రభుత్వం నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల కన్నా బీఆర్‌ఎస్‌ మాక్ అసెంబ్లీ ఎక్కువ హైలెట్ అయ్యిందని తలసాని చెప్పారు. అసెంబ్లీలో తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌చావును కోరుకున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శంకర్‌ ‌క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ ‌చేశామన్నారు. తప్పు చేయకపోయినా శీతాకాల సమావేశాలు మొత్తానికి సస్పెండ్‌ ‌చేశారని అన్నారు. ఇంకోవైపు తమను సస్పెండ్‌ ‌చేసి దమ్ముంటే బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు అసెంబ్లీకి రావాలని సవాల్‌ ‌విసురుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ తాతా మధు పేరు పెట్టి ఎవరినీ తిట్టలేదన్నారు.

ఖైరతాబాద్‌‌లో బీఆర్ఎస్‌‌దే గెలుపు
ఉప ఎన్నికల్లో సాధారణంగా అధికార పార్టీ గెలుస్తుందని తలసాని చెప్పారు. గతంలో కంటోన్మెంట్‌, జూబ్లీహిల్స్‌‌లోనూ అదే జరిగిందని గుర్తు చేశారు. కానీ ఖైరతాబాద్‌‌లో ప్రభుత్వానికి ఉండే సానుకూలతను తిరగరాస్తామనీ, బీఆర్‌ఎస్‌ ‌గెలుపు పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలకు తాను ఇన్‌‌చార్జీగా ఉంటానని అన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఈసారి చాలా టేస్టీగా ఉంటుందన్నారు. రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు దోస్తులు అయినా పోటీ తప్పదని చెప్పారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలపైనా అనర్హత వేటు పడుతుందన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని దానం నాగేందర్ చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. బీజేపీ ఎంపీలకు ప్రజలతో సంబంధాల్లేవనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది రుజువైందని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్