Magazines

‌తెలంగాణ భవన్‌‌లో గాంధీ,
 ఎల్బీ శాస్త్రి జయంతి వేడుకలు

55 నిమిషాల క్రితం

మహాత్మాగాంధీ, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
మహాత్మాగాంధీ, లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి జయంతి వేడుకలు శుక్రవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి టి జీవన్‌‌రెడ్డి, మాజీమంత్రి వి శ్రీనివాస్‌‌గౌడ్‌ ‌పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖర్‌‌రెడ్డి, నాయకులు పల్లె రవికుమార్‌, గెల్లు శ్రీనివాస్‌ ‌యాదవ్‌, తుంగ బాలు, సుమిత్రానంద్‌, బొమ్మెర రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.

​సామాజిక మార్పు సాధించడమే గాంధీ ఆశయం : కేసీఆర్‌
సహనంతో కూడిన ప్రజాస్వామిక పోరాటాల ద్వారా సామాజిక మార్పు సాధించడమే గాంధీజీ ఆశయమని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తెలిపారు. విద్వేషపూరిత పాలనా పద్దతులను విడనాడి శాంతి సౌభ్రాతృత్వాలను నెలకొల్పడమే గాంధీకి అందించే ఘన నివాళి అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గాంధీ అనుసరించిన ప్రజాస్వామిక శాంతియుత పోరాట కార్యాచరణ తెలంగాణ సాధన ఉద్యమంలో తనకు స్పూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజాస్వామిక హక్కుల సాధనకోసం గాంధీ అనుసరించిన సత్యాగ్రహ పంథా నేటి యువతరానికీ ఆచరణీయమని తెలిపారు. న్యాయమైన ప్రజల ఆకాంక్షల కోసం, నిరంకుశ ప్రభుత్వాల మీద పోరాడే నాయకత్వం, విశాల దృక్పథంతో పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలనే తాత్వికతను గాంధీ జీవితం నుంచి నేర్చుకోవాల్సి ఉందని వివరించారు. పీడితులందరినీ సమన్వయం చేసుకుంటూ, భావజాల వ్యాప్తిని చేస్తూ, శాంతియుత పోరాటంలో భిన్న వర్గాలను ఐక్యసంఘటన శక్తిగా తీర్చిదిద్దుకోవాలనే గాంధీ ఆశయాలను ప్రతిఒక్కరు అనుసరించాలని సూచించారు. విద్వేషపూరిత ప్రసంగాలను, కక్షపూరిత వైఖరులను విడనాడి, ప్రజల నడుమ శాంతి, సౌభ్రాతృత్వం పరిఢవిల్లేలా పాలనను కొనసాగించడం ద్వారానే గాంధీకి నిజమైన నివాళులు అర్పించిన వారమౌతామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్