Magazines

పెట్టుబడుల మందగమనం..

46 నిమిషాల క్రితం

Slowdown in investments
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 2 నిమిషాల చదవడం

కొత్త ప్రాజెక్టులు 48.5 శాతం పతనం
క్యూ2లో రూ.10.2 లక్షల కోట్లకు పరిమితం
మూడేండ్ల కనిష్టానికి ప్రభుత్వ ‌వ్యయాలు
ప్రయివేటు ప్రాజెక్టులు 49 శాతం క్షీణత

న్యూఢిల్లీ : దేశ పురోగతికి ప్రధాన గీటురాయిగా భావించే పెట్టుబడుల్లో మందగమనం చోటు చేసుకుంది. గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికం (క్యూ2)లో రోడ్లు, వంతెనల వంటి ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టులతో పాటు కొత్త ఫ్యాక్టరీలు, ఇతర ప్రయివేటు పెట్టుబడులకు సంబంధించిన ప్రకటనలు భారీగా తగ్గాయి. కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు తగ్గడంతో పాటు నిలిచిపోయిన ప్రాజెక్టుల విలువ పెరగడం, పూర్తయిన ప్రాజెక్టుల సంఖ్య తగ్గడం లాంటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా ప్రాథమిక గణాంకాల ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2026-27 సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల్లో కొత్త పెట్టుబడి ప్రాజెక్టుల మొత్తం విలువ వార్షిక ప్రాతిపదికన 6 శాతం పతనమై రూ.10.2 లక్షల కోట్లకు పరిమితమైంది. అంతక్రితం జూన్ త్రైమాసికంతో పోలిస్తే మరింత క్షీణత చోటు చేసుకుంది. జూన్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు 52 శాతం పెరగగా.. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఏకంగా 48.5 శాతం తగ్గాయి.
కొత్త ప్రాజెక్టులు 31 శాతం పతనం..

ప్రభుత్వ పెట్టుబడుల మందగమనం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కొత్త ప్రాజెక్టుల ప్రకటనలు ఏడాది ప్రాతిపదికన 27 శాతం, జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్‌ త్రైమాసికంలో 47 శాతం తగ్గి రూ.1.3 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. దీంతో ప్రభుత్వ రంగ కొత్త పెట్టుబడులు మూడేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ప్రయివేటు రంగంలోనూ పరిస్థితి పెద్దగా ఆశజనకంగా లేదు. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ప్రయివేటు కొత్త ప్రాజెక్టుల విలువ 2 శాతం, జూన్‌ త్రైమాసికంతో పోలిస్తే ఏకంగా 49 శాతం పతనమై రూ.8.8 లక్షల కోట్లకు దిగజారాయి. సెప్టెంబర్‌ త్రైమాసికంలో స్థూలంగా కొత్త ప్రాజెక్టుల సంఖ్య 31 శాతం తగ్గి కేవలం 1,004కు పరిమితమైంది. డేటా సెంటర్లు, అణు విద్యుత్‌ కేంద్రాలు మినహా మూలధన ఆధారిత రంగాల్లో పెట్టుబడిదారుల స్పందన ఆశించిన స్థాయిలో లేకపోయిందని నిపుణులు చెబుతున్నారు. ఐటి, విద్యుత్‌, లోహ రంగాల వంటి కొన్ని రంగాలకే పెట్టుబడులు పరిమితమవుతున్నాయని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా చీఫ్‌ ఎకనామిస్ట్‌ మదన్‌ సబ్నవిస్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల మూలధన వ్యయం తగ్గడం కొత్త ప్రాజెక్టుల ప్రకటనలపై ప్రభావం చూపిందని ఐడిఎఫ్‌‌సి ఫస్ట్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనామిస్ట్‌ గౌరా సేన్‌గుప్తా విశ్లేషించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్