కొండాపూర్‌లో ‘అప్జీ హౌస్’ ప్రారంభించిన మంత్రి వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమం, భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గిగ్ వర్కర్లకు చట్టపరమైన రక్షణతో పాటు సామాజిక భద్రత, సంక్షేమ సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. శుక్రవారం కొండాపూర్‌లో క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన ‘అప్జీ హౌస్’ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సలావుద్దీన్, అప్జీ ప్రతినిధులు, గిగ్ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగర జీవన విధానంలో గిగ్ వర్కర్లు కీలకంగా మారారని తెలిపారు. ఇంటి నుంచి ఫోన్‌లో ఆర్డర్ చేస్తే 10–15 నిమిషాల్లో ఆహారం, నిత్యావసర వస్తువులు అందుతున్నాయని, ఈ సౌకర్యం వెనుక గిగ్ వర్కర్ల శ్రమ ఉందని చెప్పారు. హైదరాబాద్‌లో సుమారు నాలుగు లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నట్లు యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారనీ, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వర్కర్లు నగర ఆర్థిక వ్యవస్థలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం రూపొందించిందని చెప్పారు. గిగ్ వర్కర్లకు ఎలా రక్షణ కల్పించాలి? వారికి మరిన్ని సౌకర్యాలు ఎలా అందించాలి? అనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఇప్పటికే అగ్రిగేటర్లతో కూడా పలుమార్లు చర్చలు జరిపామని తెలిపారు. గిగ్ వర్కర్లకు కూడా కనీస వేతనం, సామాజిక భద్రత, ఇతర సంక్షేమ సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో అగ్రిగేటర్లు, పరిశ్రమల ఆందోళనలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఆచరణాత్మక పరిష్కారాలను రూపొందించాల్సి ఉంటుందని చెప్పారు.







కామెంట్‌లు (0)