నవతెలంగాణ-హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛ భారత్ దివస్ నిర్వహించారు. జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, కాచిగూడ రైల్వే స్టేషన్‌లో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి, శ్రమదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. గత నెల నుంచి శుక్రవారం ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమాన్ని చేపట్టారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతితో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో అధికారులు, సిబ్బంది, కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాశ్, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ స్టేషన్‌లోని ‘సఫాయి మిత్ర’లను సన్మానించారు. అలాగే, పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ప్రజల్లో పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు రైల్వే ఉద్యోగులు స్టేషన్‌లో పరిశుభ్రత అంశంపై ‘నుక్కడ్ నాటక్’ను ప్రదర్శించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు. పరిశుభ్రతను ప్రోత్సహించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా జనరల్ మేనేజర్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు పర్యావరణహితమైన జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ రోజు స్వచ్ఛ భారత్ దివస్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. పరిశుభ్రత అనేది ఒక్కరోజుకే పరిమితమైన కార్యక్రమం కాదనీ, ఏడాది పొడవునా ప్రతిరోజూ పాటించాల్సిన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. రైళ్లు, రైల్వే స్టేషన్లు, వాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుర్తు చేశారు.
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ దివస్ నిర్వహణ
48 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది అక్టో 03, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)