సీఈసీ తీరుపై 28న రాష్ర్ట వ్యాప్త ఆందోళనలు
ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన : టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్యాన్ని అబాసుపాలు చేస్తూ ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటు న్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు శనివారంనాడొక ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉదయం 10.30 గంటలకు భారీ నిరసన చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఆందోళ నా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత 10 నెలల్లో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై చీఫ్ ఎన్నికల కమిషనర్ ను విభేదిస్తూ ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా పరిగణనలోకి తీసుకోలే దని తెలిపారు. ఇద్దరు కమిషనర్లు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్ జాబితాల నుంచి తొలగింపునకు కారణాలను రాష్ట్రాలు, నియోజకవర్గాల వారీగా ఎన్నికల సంఘం బహిరంగపర్చాలని కోరారు.





కామెంట్‌లు (0)