నాన్న! ఎక్కడిది పేదరికం
వాళ్ళు మనము
ఈ నేల మీదే పుట్టాము గదా
వాళ్ళు కార్లలో ఎందుకు తిరుగుతున్నారు
మనం ఇలా
ఈ నేలమీదే నడుస్తున్నామెందుకు?
వాళ్ళు తినే పంచ భక్ష పరమాన్నాలు
పీల్చే గాలి తాగే నీరు అన్నీ
ఈ పంచభూతాల నుండే వచ్చాయి కదా
మరి దేవుడు మన రాతనే ఇట్లెందుకు రాసిండు?
ఆ ఆకాశంలో విమానం
చప్పుడైనప్పుడల్లా బయటకచ్చి
మిల్కు మిల్కుమనే లైట్లను
జూసి మురిసిపోవుడేదప్పా
మనం ఎన్నడు ఎక్కింది లేదెందుకు?
మన గుడిసెల చిల్లులు ఎండకు మెరిస్తే
వాళ్ళ గాజు బంగ్లాలలో మెర్కూరి లైట్లు
రాత్రులు చెమక్కు చెమక్కు మనే చెమ్కిలలా
మెరిసి పోతున్నాయి ఎందుకు?
వాళ్ళ పిల్లలు ఏసి స్కూల్లలో
మోతెడు పుస్తకాలతో చదువుతుంటే
నేనెందుకు ఈ వీధి బల్లోనే
ఇంకా ఈ పలక పట్టుకునే అక్షరాలుదిద్దుతున్నాను
మౌనంగా వింటున్నావే గాని
నా ప్రశ్నలకు సమాధానం చెప్పవేం నాన్న?
తల్లి నా బంగారు మల్లి
ఆకాశంలో ఎగిరిన వాడైన
నేల మీద నడిచిన వాడికైన
ఆరడుగుల నేలొక్కటే
శాశ్వతమని ఎరుగని వారు వాళ్ళు తల్లి
కార్పోరేట్ స్కూల్లకన్న ఈ ఊరి బడే నయం
వీధి లైట్ల కింద చదివిన వాళ్ళు కూడా
గొప్పవాళ్ళు అయ్యారిక్కడని తెలుసుకో..
ఆ..అద్దాల మేడకు రాల్లెత్తడమే తప్పా
నేనైతే అడుగుపెట్టింది లేదు
ఆ..ఆకాశంలో విమానం నాకైతే అందదు
రోడ్డు మీది కారు దొరల పడవంటా
అది నేను తెలేనని నీకెలా చెప్పాలో
నాకు అర్థం కావడం లేదు
ఇక్కడ పేదవాడు పేదవాడుగానే వుంటాడు
దోచుకునేవాడు దొరగానే వెలుగుతాడు
నా మీద ఒట్టు
ఒక్కటైతే నిజం తల్లి!
నువ్వు అక్షరాన్ని నమ్ముకో
ఆ...చెమ్కీల బంగ్లాలో రాణిల ఉంటావు
రోడ్డు మీది కార్లలో దర్జాగా తిరుగుతావు
చిల్లుల గుడిసెలో నుండి చూసిన విమానం
హాయిగా ఎక్కి ఆ ఆకాశంలో పయనిస్తావు
ఇదొక్కటే నిజం
ఇదొక్కటే మనకు మార్గమని తెలుసుకో
అందుకు నా దీవనార్థులు తప్ప నేనేమివ్వగలను
శోధించమ్మ నా తల్లి నువ్ సాధించు
నేను నీకు బిడ్డనై మళ్ళీ పుడతాను!!
వజ్జీరు ప్రదీప్, 9989562991
సాధించు తల్లి
54 నిమిషాల క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 27, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)