ఆయన త్యాగాలు, పోరాటాలు సమాజానికి స్ఫూర్తిదాయకం : మంత్రి వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగాలు, పోరాట స్ఫూర్తి బీసీ సమాజానికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని శక్తి, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకల్లో మంత్రి వివేక్‌తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాగరాజు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ .. తెలంగాణ కోసం, నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీసీల హక్కుల కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలు చిరస్మరణీయమని చెప్పారు. ప్రజల సమస్యలపై ధైర్యంగా పోరాడాలని, అణచివేతకు గురవుతున్న వర్గాల కోసం ముందుకు సాగాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో 92 ఏళ్ల వయసులోనూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఢిల్లీకి వచ్చి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆ వయసులో కూడా తెలంగాణ సాధన కోసం పోరాటం చేయడం, నిరాహార దీక్షలో పాల్గొనడం చూస్తే..తెలంగాణపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. తన భూమికి సంబంధించిన సమస్యపై చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను పంపిన సమయంలోనూ 92 ఏళ్ల వయసులో కొండా లక్ష్మణ్ బాపూజీ స్వయంగా హైకోర్టును ఆశ్రయించి తన హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. వయసుతో సంబంధం లేకుండా హక్కుల కోసం పోరాడిన ఆయన స్ఫూర్తి అందరికీ ఆదర్శమని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ బీసీ సమాజానికి ఒక రోల్ మోడల్ అని, బీసీలంతా ఐక్యంగా ఉండి తమ హక్కులు, అవకాశాల కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు సాగాలని మంత్రి తెలిపారు.
బీసీ సమాజానికి కొండా లక్ష్మణ్ బాపూజీ రోల్ మోడల్
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)