Magazines

చరిత్రకు వక్రభాష్యాలొద్దు

13 సెప్టెంబర్, 2026

No distorted interpretations of history.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 14, 2026 | 3 నిమిషాల చదవడం

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం..
ఓ మహత్తర ప్రజా పోరాటం
రెండు మతాల కొట్లాటగా చిత్రీకరించేందుకు బీజేపీ కుట్రలు
కొత్త తరాన్ని గందరగోళపరచటమే ఆ పార్టీ లక్ష్యం :
‘తెలంగాణ విలీనం-వాస్తవాలు-వక్రీకరణలు ’ అంశంపై సదస్సులో ఎస్‌ ‌వీరయ్య
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ : ‘తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం.. ఓ మహత్తరమైన ప్రజా పోరాటం. అది మత పోరాటం కాదు.. కులాలకు అతీతంగా భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటం’ అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ ‌వీరయ్య తెలిపారు. ఆదివారం హైదరాబాద్ లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘం అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన ‘తెలంగాణ విలీనం-వాస్తవాలు-వక్రీకరణలు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్య క్షులు ఎస్వీ రమ, కార్యదర్శి కూరపాటి రమేశ్‌, హైదరాబాద్‌ ‌జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం దశరథ్‌, జె కుమారస్వామి, హైదరాబాద్‌ ‌సౌత్‌ ‌జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్వులు మీనా, శ్రావణ్‌‌కుమార్‌ ‌పాల్గొన్నారు. ఈ సందర్బంగా వీరయ్య మాట్లాడుతూ మహత్తర రైతాంగ సాయుధ పోరాటా నికి వక్రభాష్యాలు చెబుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. యువతరాన్ని కన్‌‌ఫ్యూజ్‌ ‌చేస్తున్నారని తెలిపారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది కొత్త తరానికి కొత్త ప్రశ్నలుగా ఉన్నాయ న్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ , బీజేపీ శక్తులు వాస్తవ చరిత్రకు మసిబూసి మారేడు కాయ చేస్తున్నారని విమర్శించారు. ఊరంతా ఒక దారైతే.. ఉలిపికట్టెది ఒక దారన్నట్టు ఆ పోరాటాన్ని విమోచన దినంగా వక్రీకరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విలీన దినం జరుపుతుంటే.. ఇక్కడే.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం విమోచన దినం జరపటంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌దాని రాజకీయ పార్టీకి హైదరాబాద్‌ ‌రాష్ట్రంలో ఆనవాళ్లే లేవని తెలిపారు. కానీ.. రాజకీయ లబ్ది కోసం రెండు మతాల మధ్య కొట్లాటగా చిత్రీకరించేందుకు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. నిజాం నిరంకుశత్వం, జమీందారు విధానానికి వ్యతిరేకంగా పల్లెల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సంఘాలను స్థాపించారని చెప్పారు. ఈ క్రమంలో చిట్యాల ఐలమ్మ పోరాటం, ఆ తర్వాత భూస్వాముల దాడిలో నేలకొరిగిన తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, దొరతనం నుంచి విముక్తి సాగుతున్న ఆ పోరాటం సాయుధ రూపాన్ని సంతరించుకుందని గుర్తు చేశారు. ఈ చారిత్రాత్మకమైన పోరాటంలో హిందువులు, ముస్లింలు అనే భేదం లేకుండా రైతులు, కష్టజీవులు ఐక్యంగా భూస్వాములకు, నైజాం కు వ్యతిరేకం గా పోరాటం చేశారన్నారు. వీర తెలంగాణ పోరాటాన్ని నిజాం ముస్లిం పై హిందువుల పోరాటంగా మతోన్మాదులు చిత్రీకరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వక్రీకరణ చరిత్ర వల్ల వారు చరిత్రహీనులవుతారని హెచ్చరించారు. బందగి, షోయాబుల్లా ఖాన్ లాంటి ఎందరో మహానుభావులు దొరలపై, నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంపై బీరాలు పలికిన కాంగ్రెస్ పార్టీ పోలీస్ చర్య తర్వాత ప్రజలపై భూస్వామ్య దాష్టీకాలకు కారణమైన నిజాం రాజును, దొరలపై విచారణ జరపలేద న్నారు. నిజాం రాజును రాజ ప్రముఖ్ గా చేశారని గుర్తు చేశారు. తిరిగి దొరలు, భూస్వాములు పటేల్, పట్వారిలు గ్రామాలకు రావడానికి అవకాశం కల్పించారని చెప్పారు. ఇలాంటి వాస్తవాలను దాచిపెట్టేందుకు పాలక వర్గాలు పడరాని పాట్లు పడుతున్నారని తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధివగాంచిన ఆ మహత్తర పోరా టాన్ని ఉన్నది ఉన్నట్టు అర్తం చేసుకుని, కార్మిక వర్గ పోరాటాలకు మరింత పదునెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. నేటికీ పేదలకు భూమి, ఉపాధి, భద్రత అవసరం : పాలడుగు భాస్కర్‌ తెలంగాణ సాయుధ పోరాటం కేవలం ఒక పాలకుడికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాద‌ని పాలడుగు భాస్కర్‌ ‌తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం, సామాజిక న్యాయం కోసం సాగిన మహత్తర ప్రజా పోరాటమని తెలిపారు. నాడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల చేతుల్లో భూములు కేంద్రీకృతమై ఉండగా, నేడు కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారుల చేతుల్లో భూములు కేంద్రీకృతమవుతున్నాయని విమర్శించారు. పేదలకు భూమి, ఉపాధి, జీవన భద్రత కల్పించాల్సిన అవసరం నేటికీ ఉందన్నారు. నేడు కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొం టున్నారని తెలిపారు. కార్మికులకు పని భద్రత లేకపోవడం, కాంట్రాక్టు, ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగాలు పెరగడం, ఎనిమిది గంటల పని చట్టం ఉన్నప్పటికీ 12 గంటల పని చేయించడం, కనీస వేతనాలు అమలు కాకపోవడం, కార్మిక సంక్షేమం, భద్రతా చట్టాలు అమలుకు నోచుకోకపోవడం వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని అన్నారు. ప్రజా స్వామ్య హక్కులపై దాడులు పెరుగుతు న్నాయని, ప్రశ్నించే గొంతులను అణచివేసే ప్రయత్నాలు జరుగుతున్నా యని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంతో పాటు కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్మిక ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలి : చుక్కరాములు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో నేటి కార్మిక ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని చుక్క రాములు పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కొందరు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను మతపరమైన కోణంలో వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ పోరాటంలో పాల్గొన్న అనేక మంది నాయకులు అనంతరం కార్మిక ఉద్యమంలోకి వచ్చారని, కార్మిక వర్గ హక్కుల కోసం కూడా పోరాడారని తెలిపారు.ఆ పోరాట చరిత్రను కార్మిక సంఘాల స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్