Magazines

వైద్య విద్యలో ఫీజుల దోపిడీని అరికట్టాలి

1 గంట క్రితం

The exploitation through fees in medical education must be curbed.
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 2 నిమిషాల చదవడం

ప్రయివేటు మెడికల్‌ కాలేజీలపై చర్యలు తీసుకోవాలి
ఎఫ్‌ఆర్‌సీ నిబంధనలు పకడ్బందీగా 
అమలు చేయాలి
మెడికో పేరెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లోజుల సత్యనారాయణచారి


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మెడికల్‌ కళాశాలల్లో ఎఫ్‌ఆర్‌సీ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారనీ, దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం, ఎఫ్‌ఆర్‌సీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తక్షణమే చర్యలు తీసుకోవాలని మెడికో పేరెంట్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మల్లోజుల సత్యనారాయణచారి డిమాండ్‌ చేశారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించేలా చూడాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌‌లోని నాచారంలో గల ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో మెడికో పేరెంట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి మెడికో పేరెంట్స్‌ ఫ్యామిలీ మీట్‌ నిర్వహించారు. అందులో పలు అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేసి కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ చారి మాట్లాడుతూ..నాలుగున్నరేండ్ల ఎంబీబీఎస్‌ ‌కోర్సుకు కొన్ని కాలేజీలు ఐదేండ్ల ఫీజును వసూలు చేస్తున్నాయనీ, ఏ, బీ కేటగిరీలో విపరీత దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. గతేడాది ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు చెల్లించలేని 20 మంది వైద్య విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి కళాశాలల్లో చేర్పించామని వివరించారు. ఈ ఏడాది కూడా ఇద్దరి విద్యార్థులకు సహకారం అందించామని చెప్పారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యలో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులకే స్థానికత ఆధారంగా వైద్య సీట్లు కేటాయించేలా నిబంధనలు రూపొందించాలని సూచించారు. జీవో నంబర్‌ 150 కారణంగా ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నాలుగేండ్ల తెలంగాణలో చదివి స్థానిక కోటా కింద వైద్య సీట్లు పొందుతున్నారనీ, దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతోందని అన్నారు. అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు మాట్లాడుతూ వైద్య విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అసోసియేషన్‌ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఐక్యంగా నిలిస్తే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. పేద విద్యార్థుల వైద్య విద్యకు సహకరించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పొడిశెట్టి రమేష్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల సంఖ్య పెరిగినా అనేక కళాశాలల్లో మౌలిక వసతుల కొరత ఉందన్నారు. కార్యక్రమంలో పల్లవి ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ మల్కా నవీన్‌కుమార్‌, అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు పొడిశెట్టి రమేష్‌, బొడ్డుపల్లి అంజయ్య, పి.సుజాత, కోశాధికారి రవికుమార్‌ కొప్పుల, ఆర్గనైజర్‌ సెక్రటరీ కట్ట వెంకటరావు (కేవీఆర్‌), తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్