Magazines

రేపటి తరాల కోసం నేటి నుంచే మారుదాం

4 రోజుల క్రితం

Let us change starting today for the sake of future generations.

Let us change starting today for the sake of future generations.

avatar
Rajabapu Odela

ప్రచురించబడింది సెప్టెం 20, 2026 | 3 నిమిషాల చదవడం


మనిషి అభివృద్ధి పేరుతో ప్రకృతికి దూరమవుతున్న కొద్దీ పర్యావరణ సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న జనాభా, పట్టణీకరణ, ప్లాస్టిక్ వినియోగం, విచ్చలవిడిగా పడేస్తున్న చెత్త, ప్రకృతి వనరుల దుర్వినియోగం భూమిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్న ఆలోచన ‘జీరో వేస్ట్ లైఫ్‌స్టైల్’.

జీరో వేస్ట్ అంటే అసలు చెత్తే ఉత్పత్తి చేయకూడదని కాదు. మన రోజువారీ జీవన విధానం వల్ల ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సాధ్యమైనంత వరకు తగ్గించడం, వస్తువులను పునర్వినియోగించడం, రీసైక్లింగ్ చేయడం, సేంద్రియ వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చడం ద్వారా భూమిపై చెత్త భారాన్ని తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం.
చిన్న మార్పులతోనే పెద్ద ఫలితం
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటి నుంచే మార్పు ప్రారంభించవచ్చు. బయటకు వెళ్లేటప్పుడు పునర్వినియోగించే వాటర్ బాటిల్, షాపింగ్‌కు క్లాత్ బ్యాగ్ తీసుకెళ్లడం, ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ వస్తువులను తిరస్కరించడం వంటి చిన్న చర్యలు కూడా ఎంతో ఉపయోగకరమైనవే. పాత వస్తువులను వెంటనే చెత్తలో వేయకుండా వాటిని మరో విధంగా ఉపయోగించవచ్చా అని ఆలోచించాలి.
జీవనశైలిలోనే పరిష్కారం
నిజానికి జీరో వేస్ట్ లైఫ్‌స్టైల్ కొత్తేమీ కాదు. మన తాతలు, ముత్తాతల జీవన విధానాన్ని పరిశీలిస్తే అందులోనే పర్యావరణహితమైన ఎన్నో పద్ధతులు కనిపిస్తాయి. వారు అరటి ఆకుల్లో భోజనం చేసేవారు. రాగి, ఇత్తడి వంటి పాత్రలు ఏండ్ల తరబడి ఉపయోగించేవారు. వస్తువులు పాడైతే వాటిని మరమ్మతు చేసి మళ్లీ వినియోగించేవారు. మార్కెట్‌కు వెళ్లేటప్పుడు పునర్వినియోగ సంచులను తీసుకెళ్లేవారు. అంటే అప్పట్లో ‘యూజ్ అండ్ త్రో’ అనే సంస్కృతి లేదు. కానీ ఆధునిక జీవనశైలిలో ఒక్కసారి ఉపయోగించి పడేసే వస్తువుల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు, కప్పులు, ప్లేట్లు, ప్యాకేజింగ్ పదార్థాలు పెద్ద మొత్తంలో చెత్తగా మారుతున్నాయి. వీటి ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా నేల, నీరు, గాలి, జంతుజాలంపైనా పడుతోంది.
చెత్త ఎక్కడికి వెళ్తుంది?
ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఉపయోగించే ప్రతి వస్తువు గురించి ఒక్కసారి ఆలోచించాలి. మనం పారేసిన చెత్త మన ఇంటి నుంచి బయటకు వెళ్లినంత మాత్రాన అది మాయమైపోదు. అది డంపింగ్ యార్డులకు, కాలువలకు, చెరువులకు, నదులకు, చివరకు సముద్రాలకు చేరే ప్రమాదం ఉంది. నగరాల చుట్టూ పెరుగుతున్న చెత్త కుప్పలు కేవలం అందాన్ని దెబ్బతీయడం మాత్రమే కాదు. దుర్వాసన, దోమలు, ఈగలు, కలుషిత నీరు, భూగర్భ జలాల కాలుష్యం వంటి అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. కాబట్టి చెత్త సమస్యకు పరిష్కారం చెత్తను తరలించడం మాత్రమే కాదు.. చెత్త ఉత్పత్తి అయ్యే స్థాయినే తగ్గించడం.
పాటించాల్సినవి *
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులుగా పునర్వినియోగించే బాటిళ్లను ఉపయోగించాలి. * మార్కెట్‌కు వెళ్లేటప్పుడు క్లాత్ లేదా పునర్వినియోగ సంచులను తీసుకెళ్లాలి. * అవసరం లేని వస్తువులను కొనకుండా ‘అవసరం–అనవసరం’ అనే తేడాను గుర్తించాలి. * పాత వస్తువులను మరమ్మతు చేసి వీలైనంత కాలం ఉపయోగించాలి. * కాగితం, గాజు, లోహం వంటి రీసైకిల్ చేయగల వస్తువులను విడిగా సేకరించాలి. * ఇంటి సేంద్రియ వ్యర్థాలతో కంపోస్ట్ తయారు చేసి మొక్కలకు ఉపయోగించాలి. * బయట ఆహారం తీసుకునేటప్పుడు సాధ్యమైనంత వరకు పునర్వినియోగించే స్పూన్లు, గ్లాసులు, బాటిళ్లు ఉపయోగించాలి. * ఫంక్షన్లు, కార్యక్రమాల్లో ప్లాస్టిక్ అలంకరణలకు బదులుగా సహజమైన పూలు, పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలి. * మిగిలిపోయిన ఆహారం సురక్షితంగా ఉంటే అవసరమైన వారికి అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. * పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల్లో రిటర్న్ గిఫ్ట్స్‌గా ప్లాస్టిక్ వస్తువులకు బదులుగా మొక్కలను అందించాలి.
మొక్కలు నాటాలి
మన పూర్వీకులు మొక్కలు నాటేటప్పుడు తమకు దాని ఫలాలు అందుతాయా లేదా అని ఆలోచించలేదు. తాము నాటిన చెట్టు భవిష్యత్తులో ఎవరికో నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది, స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది అనే ఆలోచనతో చెట్లను పెంచారు. అందుకే నేడు మనం అనుభవిస్తున్న పచ్చదనం, చెట్ల నీడ, ప్రకృతి అందాలు వారి దూరదృష్టికి ప్రతిఫలాలు. వారు మన కోసం నాటారు. ఇప్పుడు మనం రాబోయే తరాల కోసం నాటాలి.
ఒక రోజు కార్యక్రమం కాదు
జీరో వేస్ట్ లైఫ్‌స్టైల్ అనేది ఒక్కరోజులో సాధించే మార్పు కాదు. ఇది నిరంతర ప్రయాణం. ప్రతి వ్యక్తి వంద శాతం చెత్త రహిత జీవన విధానాన్ని పాటించలేకపోయినా, చెత్తను పది శాతం తగ్గించేందుకు చేసే ప్రయత్నం కూడా విలువైనదే. ఒక కుటుంబం ఒక ప్లాస్టిక్ బాటిల్‌ను తగ్గిస్తే అది చిన్న విషయంలా అనిపించవచ్చు. కానీ లక్షలాది కుటుంబాలు అదే అలవాటును పాటిస్తే దాని ప్రభావం ఎంతో పెద్దదిగా ఉంటుంది.

పేరిచర్ల విశాల

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్