రాష్ట్రంలో అవినీతి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రజలకు హక్కుగా అందాల్సిన ప్రభుత్వ సేవలు లంచం ఇస్తేనే దక్కే పరిస్థితి నెలకొంది. పనికోసం కార్యాలయాల చుట్టూ తిరిగి.. చివరకు అప్పు తెచ్చయినా లంచం చెల్లించాల్సిన దుస్థితి సామాన్యుడిని వేధిస్తోంది. ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న ఏసీబీ కేసుల పర్వం.. పాలనా వ్యవస్థలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో కండ్లకు కడుతున్నది. 2026 జూలై 10 నాటికే ఏసీబీ 86 ట్రాప్ కేసులు, 14 ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసింది. ఆస్తుల కేసుల్లో గుర్తించిన ఆస్తుల ప్రాథమిక విలువ రూ.83 కోట్లకు పైగా ఉండగా.. భూములు, భవనాల మార్కెట్ విలువను కలిపితే అది రూ.వెయ్యి కోట్లకు మించవచ్చని అధికారుల అంచనా. పోలీస్, రెవెన్యూ, ఇంజినీరింగ్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులు ఈ కేసుల్లో ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. సస్పెండైన డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసు సంచలనం కలిగించింది. ఆయనకు సంబంధించి పదహారు ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో సుమారు రూ.200 కోట్ల మార్కెట్ విలువైన ఆస్తుల పత్రాలు బయటపడినట్టు ఏసీబీ తెలిపింది. మరోసారి జరిగిన సోదాల్లో రూ.1.35 కోట్ల నగదు, విదేశీ కరెన్సీ, ఇతర వస్తువులతో పాటు బినామీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించినట్టు అధికా రులు వెల్లడించారు. నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్ కేసులోనూ రూ.6.13 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ తెలిపింది. అయితే అవినీతి అంటే కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల వ్యవహా రాలే కాదు. అసలు అవినీతి బాధ సామాన్య ప్రజల దగ్గరే మొదలవుతోంది. ములుగు జిల్లా గోవిందరావు పేటలో వారసత్వ భూమిని భార్య పేర బదలాయించేందుకు ఓ వ్యక్తిని రూ.14 వేల లంచం అడిగి తీసుకుంటుండగా ఎంఆర్వో ఏసీబీకి చిక్కారు. చేవెళ్ల సబ్‌ట్రెజరీ కార్యాలయంలో జీతం, పెన్షన్ బకాయిల కోసం రూ.2.5 లక్షలు డిమాండ్ చేసి, రూ.లక్ష తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు పట్టుబడ్డారు. నిజామాబాద్‌లో తల్లి పెన్షన్ మంజూరు కోసం సర్వీస్ బుక్‌లో నమోదు చేయడానికి రూ.15 వేలు తీసుకుంటూ ఇద్దరు సిబ్బంది దొరికిపోయారు. ఇవన్నీ ప్రజలకు హక్కుగా అందాల్సిన సేవలే. పోలీస్‌స్టేషన్లలోనూ పరిస్థితి ఆందోళన కరంగానే ఉంది. కేసు పెట్టకుండా ఉండటం, స్టేషన్ బెయిల్ ఇవ్వడం, కేసులో వేధింపులు లేకుండా చేయడం వంటి వాటికీ డబ్బు అడిగిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కీసర పోలీస్‌స్టేషన్‌లో రూ.5 లక్షల లంచం కేసులో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐ ఏసీబీకి చిక్కిన తర్వాత స్థానికులు పోలీస్‌స్టేషన్ బయట బాణాసంచా కాల్చి సంబరాలు చేసు కోవడం.. ప్రజల్లో పేరుకుపోయిన ఆగ్రహానికి నిదర్శనం. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్‌పైనే నమ్మకం తగ్గితే.. అది ఒక్కశాఖ సమస్య కాదు, మొత్తం పాలనా వ్యవస్థపై ప్రజల విశ్వాసానికి సంబంధించిన ప్రశ్న. లంచం ఇచ్చే స్థోమత లేనివారి పరిస్థితి మరింత దారుణం. చిన్నరైతు భూమి రికార్డు కోసం, కూలీ తన బకాయి కోసం, వృద్ధుడు పెన్షన్ కోసం కార్యాలయానికి వెళ్తాడు. పని ఆలస్యం చేస్తూ పదేపదే తిప్పడం కూడా ఒక రకమైన వేధింపే. రోజువారీ కూలీ పనిని వదిలి కార్యాలయాల చుట్టూ తిరగాలి. ప్రయాణ ఖర్చు, పని నష్టం, చివరకు లంచం.. అన్నీ వారిపైనే భారమవ్వడం ఎంతటి బాధాకరం. అవినీతి వల్ల బాధితులు నష్టపోవడమే కాదు.. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వారి కుటుంబాలు కూడా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్‌లో షేక్‌పేట తహసీల్దార్‌గా పనిచేసిన సుజాత ఏసీబీ కేసులో అరెస్టైన తర్వాత ఆమె భర్త మృతిచెందిన ఘటన అప్పట్లో అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇలాంటి ఘటనలు అవినీతి ప్రభావం కుటుంబాలపైనా పడుతుందని గుర్తుచేస్తున్నాయి. అదానీ, అంబానీలాగా లక్షల కోట్లు ఏమైనా దోస్తున్నారా? అన్న ప్రశ్న కూడా అక్కడక్కడ తలెత్తుతుంది. బడా కార్పొ రేట్ల అవినీతికి ప్రభుత్వమే బార్లు తీస్తున్నది. అది వేరే విషయం. కానీ, ఇక్కడ ఒక చిన్న ఉద్యోగి పనికోసం తన పైనున్న అధికారికి ఎంతోకొంత ముట్టజెప్పాల్సిరావడం అన్యాయం. పాతికవేలు సంపాదించేవారి దగ్గర కూడా ఏదో తప్పును చూపి దోపిడీకి పాల్పడటం తీవ్రమైన నేరం. ఇదేదో కిందిస్థాయి ఉద్యోగులకే పరిమితమైనది కాదు, పై నుంచి కిందిదాకా ఇదే కథ, దోపిడీ వ్యథ. ఇదేదో నిన్నమొన్న మొదలైన సమస్య కాదు, ఏండ్లుగా సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి చీడ. కాలక్రమం లో రూపాలు మారుతూ, పరిధి పెరుగుతూ ప్రజల జీవితాలను పీల్చిపిప్పి చేస్తోంది.ప్రభుత్వ, ప్రయివేటు అనే తేడా లేకుండా అన్ని రంగాలనూ ప్రభావితం చేస్తోంది. దీన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు పూనుకోకపోవం అసలైన విషాదం. కాబట్టి పౌరసమాజమే అవినీతికి వ్యతిరేకంగా కదలాల్సిన అవసరం ఉన్నది.





కామెంట్‌లు (0)