1966 ప్రాంతంలో కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్) ఏర్పాటుతో పాల్వంచ పారిశ్రామికీకరణకు బీజం పడింది. ఆ తరువాత ఏ, బీ, సీ, డీ స్టేషన్ల నిర్మాణంతో వేలాది మందికి ఉపాధి లభించగా, సుమారు మూడు వేల మంది శాశ్వత ఉద్యోగులుగా స్థిరపడ్డారు. విద్యుత్ కేంద్రం నీటి అవసరాల కోసం కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మించడంతో వ్యవసా యానికి కూడా కొంతమేర నీటి సౌకర్యం అందింది. భూమి, మానవ వనరులు, బొగ్గు, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో పాల్వంచ పారిశ్రామిక అభివృద్ధికి అనుకూల ప్రాంతంగా మారింది.1970 ప్రాంతంలో నవభారత్ ఫెర్రో అల్లాయిస్ ఏర్పాటుతో మరిన్ని ఉపాధి అవకాశాలు వచ్చాయి. నిర్మాణ దశలో పనిచేసిన వందలాది మంది కార్మికుల్లో సుమారు 500 మంది శాశ్వత ఉద్యోగులుగా మారగా, ఇతర విభాగాల్లో మరో 2,000 మందికి పైగా ఉపాధి లభించింది. 1975లో ఏపీ స్టీల్ ఏర్పాటు కోసం ప్రజల నుంచి సుమారు 110 ఎకరాల భూమిని సేకరించారు. ఇందులో 700 మంది శాశ్వత ఉద్యోగులు, లోడింగ్, అన్‌లోడింగ్ తదితర విభాగాల్లో మరో 300 మందికి ఉపాధి లభించింది.
ఆర్థిక వ్యవస్థకు కీలకం
1975లో స్పాంజ్ ఐరన్ ఇండియా లిమిటెడ్‌కు జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో పునాది వేయగా, 1979-80లో ఉత్పత్తి ప్రారంభమైంది. తరువాత DRP-II, బ్రికెటింగ్ ప్లాంట్, ఐదు మెగావాట్ల క్యాప్టివ్ పవర్ ప్లాంట్ వంటి విభాగాలు ఏర్పడ్డాయి. 1993-94లో తుక్కు ఇనుముతో ఇనుప ప్లేట్లు తయారు చేసేందుకు రూ.30 కోట్లతో SAF ప్లాంట్ నిర్మిం చారు. రూ.2 కోట్లతో మరమ్మతులు చేసినప్పటికీ, ఉత్పత్తి ప్రారంభించకుండానే అది నిర్వీర్యమైంది.ఈ కర్మాగారం కోసం 320 ఎకరాల భూమిని సేకరించగా, సుమారు 650 మంది శాశ్వత ఉద్యోగులు, మరో 300 మంది పరోక్షంగా ఉపాధి పొందారు. కేటీపీఎస్ విద్యుత్‌ను వినియోగించిన ఏపీ స్టీల్, నవభారత్ ఫెర్రో అల్లాయిస్, స్పాంజ్ ఐరన్ పరిశ్రమలు పరస్పరం ఆధారపడి ఉత్పత్తి సాగించేవి. స్పాంజ్ ఐరన్ ఉత్పత్తిలో సుమారు 75 శాతం ఏపీ స్టీల్‌కు ముడిసరుకుగా ఉపయోగించేవారు. నవభారత్ నుంచి కూడా ఏపీ స్టీల్‌కు కొంతమేర ముడిసరుకు సరఫరా అయ్యేది. దీంతో ఈ మూడు పరిశ్రమలు పాల్వంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా నిలిచాయి.
మూతపడిన పరిశ్రమలు
అంతర్జాతీయ పరిణామాలు, దేశంలో అమలైన నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొ న్నాయి. స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్లో మార్పులు చేసి పరిశ్రమలను కాపాడే చర్యలు తీసుకుని ఉంటే వేలాది కుటుంబాలకు ఉపాధి కొనసాగేది. కానీ ఏపీ స్టీల్‌ను 1995లో పూర్తిగా మూసివేయడంతో వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. టెర్మినేషన్ బెనిఫిట్స్ అందకపోగా, పీఎఫ్ డబ్బుల కోసం దశాబ్దానికి పైగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.ఏపీ స్టీల్ మూతపడటంతో స్పాంజ్ ఐరన్‌కు ముడిసరుకు కొనే పరిస్థితి లేకపోయింది. కార్మికులను వీఆర్‌ఎస్ వైపు నెట్టారు. 2003-04లో అప్పటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం పరిశ్రమను వందశాతం డిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియలోకి తీసుకెళ్లింది. కార్మిక సంఘాలు ‘భద్రాద్రి ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్’ పేరుతో బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. సీఐటీయూ ‘అటవీ ప్రాంత గిరిజన సంఘం’ పేరుతో హైకోర్టును ఆశ్రయించగా స్టే ఆర్డర్ లభించింది.తరువాత యూపీఏ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన సమయంలో పెద్ద పరిశ్రమల్లో చిన్న పరిశ్రమలను విలీనం చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. దాని ఫలితంగా ఎస్‌ఐఐఎల్‌ను ఎన్‌ఎండీసీలో విలీనం చేసి, స్పాంజ్ ఐరన్ యూనిట్‌గా కొనసాగించారు. 2017 వరకు ఉత్పత్తి సాగినప్పటికీ, ఆ తరువాత నష్టాల పేరుతో ఉత్పత్తి నిలిపివేసి క్రమంగా కర్మాగారాన్ని నిర్వీర్యం చేశారు. మరోవైపు కేటీపీ ఎస్‌లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు పేరుతో పాత ఏ, బీ, సీ, డీ ప్లాంట్లను మూసివేసి ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.
పునర్‌వైభవం చాటాలి
నాలుగు దశాబ్దాల పాటు పారిశ్రామికంగా వెలుగొందిన పాల్వంచ ఇప్పుడు ఉపాధి అవకాశాలు కోల్పోయింది. చిన్న వ్యాపారాలు, నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితికి పరిష్కారంగా ఎన్‌ఎండీసీ ఆధ్వర్యంలో ఉన్న 426 ఎకరాల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. భూమి, రైల్వే, నీరు, బొగ్గు, డోలమైట్, విద్యుత్ వంటి అవసరమైన వనరులు ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి.అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ మూసివేతతో ఖాళీగా ఉన్న భూముల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలి. ఈ రెండు రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే సుమారు పదివేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాల్వంచ పారిశ్రామిక పునరుజ్జీవనంపై దృష్టి సారించి కొత్త పరిశ్ర మల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. అందుబాటులో ఉన్న భూములు, మౌలిక వసతులను వినియోగిస్తే పాల్వంచకు మళ్లీ పారిశ్రామిక పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు వేలాది కుటుంబాలకు ఉపాధి, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి అందించవచ్చు.
దొడ్డా రవికుమార్, 9502072002
పాల్వంచ పారిశ్రామిక వెలుగులేవి?
1 గంట క్రితం

Rajabapu Odela
ప్రచురించబడింది సెప్టెం 28, 2026 | 3 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)