Magazines

‘‘స్వామినాథన్‌’’ సిఫార్సుల అమలుకు ఇంకెంతకాలం?

1 గంట క్రితం

Swaminathan
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 02, 2026 | 3 నిమిషాల చదవడం

1990 దశకం ప్రారంభంలో దేశంలో అమలైన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్‌పీజీ) ఆర్థిక విధానాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపాయి. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యవసాయ కార్మికులు, రైతు కుటుంబాల వలసలు పెరిగాయి. ఈ సంక్షోభానికి కారణాలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించేందుకు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2004 నవంబర్ 18న ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ అదే ఏడాది డిసెంబర్ 1న తొలి నివేదికను సమర్పించి, 2006 అక్టోబర్ 4న తుది నివేదికతో మొత్తం ఐదు నివేదికలను ప్రభుత్వానికి అందించింది. భూసంస్కరణలు, కనీస మద్దతు ధర, మహిళా రైతుల హక్కులు, సాగునీరు, వ్యవసాయ రుణాలు, పంటల బీమా, మౌలిక వసతులు, రైతులకు లాభదాయకమైన ఆదాయం వంటి అంశాలపై కీలక సిఫార్సులు చేసింది. అయితే తుది నివేదిక సమర్పించి ఇరవై సంవత్సరాలు పూర్తవుతున్నా, కీలక సిఫార్సులు మాత్రం అమలు కాలేదు. రైతుల ఆదాయానికి గ్యారంటీ కూడా దక్కలేదు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు సంబంధించిన ‘సి2+50’ ఫార్ములా. అంటే పంట ఉత్పత్తికి అయ్యే సమగ్ర వ్యయం (C2)పై కనీసం 50 శాతం అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలి. అయితే కేంద్ర ప్రభుత్వం 2018-19 నుంచి అమలు చేస్తున్న విధానం ప్రధానంగా A2+FL ఉత్పత్తి వ్యయంపై ఆధారపడుతోంది.

C2లో భూమి కౌలు విలువ, పెట్టుబడిపై వడ్డీ వంటి అంశాలు కూడా ఉంటాయి. వీటిని పరిగణనలోకి తీసుకోకపోవడం వల్ల స్వామినాథన్ ఫార్ములా, కేంద్ర ప్రభుత్వ విధానాల మధ్య కీలక తేడా ఏర్పడుతోంది. రాష్ట్రాలు సమర్పించే వాస్తవ ఉత్పత్తి వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా తక్కువ వ్యయాన్ని ఆధారంగా చేసుకుని ఎంఎస్‌పీ నిర్ణయించం అనేక విమర్శలకు తావిస్తోంది. ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం 2023-24లో వరి ధాన్యం క్వింటాల్ ఉత్పత్తి వ్యయాన్ని రూ.2,935గా, పత్తిని రూ.8,523గా అంచనా వేసింది. ఆ వ్యయంపై యాభై శాతం కలిపితే వరికి రూ.4,403, పత్తికి రూ.12,784 మద్దతు ధర రావాలి. కానీ కేంద్రం ప్రకటిం చిన ఎంఎస్‌పీ వరికి రూ.2,369, పత్తికి రూ.8,500గా ఉంది. దీంతో రైతు సంఘాలు C2+50 ప్రకారం ఎంఎస్‌పీ నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని దశాబ్దకా లంగా ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. భూమిలేని నిరుపేదలకు మిగులు, బంజరు భూములను పంపిణీ చేయడం, సాగుకు అనుకూలమైన భూములను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా రక్షించడం స్వామినాథన్ కమిషన్ ప్రధాన సిఫార్సుల్లో ఉన్నాయి. కానీ ప్రాజెక్టులు, రహదారులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో సాగుభూముల స్వాధీనం, భూకేంద్రీకరణ పెరుగు తున్నాయి. కౌలు రైతులకు సరైన గుర్తింపు, రుణాలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందడం లేదు.

వారికి ప్రత్యేక గుర్తింపు చట్టం అవసరం. వ్యవసాయంలో మహిళల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూమి యాజమాన్య హక్కుల్లో వారి వాటా తక్కువగా ఉంది. మహిళా రైతులకు సంయుక్త పట్టాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, బ్యాంకు రుణాలు, శిక్షణ వంటి సదుపా యాలు కల్పించాలన్న కమిషన్ సిఫార్సులు పూర్తిస్థాయిలో అమలు కావాలి. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రతి రైతుకు నాణ్యమైన సాగునీరు, తక్కువ వడ్డీకి సంస్థాగత రుణాలు, ప్రత్యేక వ్యవసాయ రిస్క్ ఫండ్, సమగ్ర పంట-పశువుల బీమా వంటి చర్యలను కమిషన్ సూచించింది. పంట నష్టపోయిన రైతుకు సకాలంలో పరిహారం అందే వ్యవస్థ అవసరం. రైతులకు సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ ధరల సమాచారం అందించేందుకు గ్రామస్థాయిలో విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు కూడా కీలకం. భారత వ్యవసాయం మరో తీవ్రమైన వైరుధ్యాన్ని ఎదుర్కొంటోంది. జీడీపీకి వ్యవసాయం వాటా సుమారు 15-18 శాతమే అయినప్పటికీ, దేశ శ్రామికశక్తిలో సగానికి పైగా ప్రజలు వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆధారపడుతున్నారు.

86 శాతం రైతులు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి కలిగి ఉన్నారు. ఇలాంటి చిన్న, సన్నకారు రైతులకు అందు బాటులో ఉండే యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం, చౌకైన వ్యవసాయ సేవలు అత్యవసరం. వ్యవసాయ సంక్షోభానికి కేవలం రుణమాఫీలు, తాత్కాలిక సబ్సిడీలు పరిష్కారం కావు. రైతుకు భూమిపై హక్కు, సాగుకు నీరు, చౌకైన రుణం, పంటకు హామీ ధర, నష్టానికి బీమా, మార్కెట్‌లో రక్షణ, లాభదాయకమైన ఆదాయం లభించాలి. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, దిగుమతుల ప్రభావం చిన్న, సన్నకారు రైతులపై పడకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. రైతును రక్షించకుండా వ్యవసాయాన్ని రక్షించలేం, వ్యవసాయాన్ని రక్షించకుండా గ్రామీణ భారత భవిష్యత్తును కాపాడలేం. దీన్ని కేంద్రం గుర్తించేందుకు రైతు,ప్రజా ఉద్యమాలే శరణ్యం.


బొంతు రాంబాబు, 9490098205

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్