‘అమ్మకు చదువొస్తే, అందరికీ వచ్చినట్లే’ అనే సూక్తి ఎంత నిజమో.. ‘ప్రతిపక్షం బాగుంటే, ప్రజలు బాగుంటారు’ అన్నది కూడా అంతే నిజం! ముఖ్యంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది కేవలం అధికారంలో లేని రాజకీయ పార్టీ కాదు. అది ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఒక బాధ్యతాయుతమైన వ్యవస్థ. ప్రతిపక్ష పార్టీలు చురుగ్గా, నిర్మాణా త్మకంగా పనిచేసినప్పుడే ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయి. రాచరిక వ్యవస్థ నుంచి నేటి ప్రజాస్వామ్య పాలన వరకు పాలకులు తమంతట తాముగా ప్రజల కోసం అన్నీ చేసిన సందర్భాలు చాలా అరుదు. ప్రజలు తమ హక్కుల కోసం చేసిన పోరాటాలు, కార్మిక-కర్షక ఉద్యమాలు, ప్రజా సంఘాల పోరాటాల ఫలితంగానే అనేక హక్కులు, సంక్షేమ సౌకర్యాలు ప్రజలకు అందాయి. అందువల్ల ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకను వినిపించ డం, పాలకులను ప్రశ్నించడం చాలా కీలకం.
అయితే ప్రతిపక్షం అంటే కేవలం ప్రశ్నించడం కాదు.. ప్రజల తరఫున ప్రశ్నించడం! అడిగిన ప్రతి ప్రశ్నకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశం కంటే, ప్రజలకు మేలు జరిగే పనులను సాధించాలనే పట్టుదల ఉండాలి. సమాజంలోని సమస్యలపై అవగాహన, ప్రజల జీవితాలపై స్పష్టమైన అవగాహన ప్రతి పక్షానికి ఉండాలి. అధికారంలో ఉన్న వ్యక్తులను ప్రశ్నించేటప్పుడు ప్రశ్నల్లో సహేతుకత, శాస్త్రీయత, సామాజిక స్పృహ ఉండాలి. వ్యక్తిగత దూషణలు, అసభ్య పదజాలం, పరస్పర నిందారోపణలు రాజకీయ చర్చను ప్రజా సమస్యల నుంచి దూరం చేస్తాయి. నేటి రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని విమర్శించడమే ప్రధాన లక్ష్యంగా మారకుండా, ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని రాజకీయ పోరాటం జరగాలి.
వ్యక్తులపై దాడి చేయడం కంటే వారి విధానాలు, నిర్ణయాలు, పాలనా తీరును ప్రశ్నించడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన పద్ధతి. గ్రామ పంచాయతీ నుంచి అసెంబ్లీ, పార్లమెంట్ వరకు.. సర్పంచ్ నుంచి మంత్రుల వరకు.. ప్రజలకు ఉపయోగపడే పని చేసినప్పుడు అభినందించాలి. ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు కచ్చితంగా ప్రశ్నించాలి. మనకు వ్యతిరేక పార్టీ కాబట్టి, వాళ్లు చేసే ప్రతి మంచి పనినీ వ్యతిరేకించాలనే ధోరణి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజల కోసం మంచి పని చేసినప్పుడు దాన్ని గుర్తించడం కూడా రాజకీయ సంస్కృతిలో భాగమే.
ప్రస్తుత ఎన్నికల రాజకీయాల్లో డబ్బు, సంపద, అధికార ప్రభావం పెరుగుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాల బాధ్యత మరింత పెరిగింది. రాజకీయా ల్లోకి పెద్ద మొత్తంలో డబ్బు ప్రవేశించినప్పుడు సామాన్య ప్రజల సమస్యలు వెనుకబడే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రజా సమస్యలను నిరంతరం ముందుకు తీసుకెళ్లే బలమైన ప్రతిపక్షం అవసరం మరింత పెరుగుతుంది. కొన్ని గ్రామాల్లో అధికార పక్షానికి ప్రత్యామ్నాయంగా నిలిచే ప్రతిపక్ష స్వరం బలహీనంగా ఉన్నప్పుడు, గ్రామ పాలనలో ఏకపక్ష ధోరణి పెరిగే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించకుండా, నిరంతరం ప్రజల మధ్య ఉండాలి.
గ్రామ సమస్యలను గుర్తించి, ప్రజలను కలుపుకొని, అవసరమైన చోట అధికారులను ప్రశ్నించి, ప్రజా ప్రయోజనాల కోసం పోరాడాలి. ప్రజల సమస్యలపై నిలబడే ప్రతిపక్షమే నిజమైన ప్రజాశక్తిగా ఎదగగలదు. సంపద ఉన్నంత మాత్రాన సామాజిక స్పృహ ఉంటుందని చెప్పలేం. సమాజంలోని ఆకలి, అసమానతలు, వివక్ష, పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలను అర్థం చేసుకోవడానికి సామాజిక అవగాహన అవసరం. సమాజాన్ని మనుషుల జీవన పరిస్థితుల కోణంలో చూడగలిగే దృష్టి అవసరం.
ఈ సమాజం కొద్దిమంది వ్యక్తుల వల్ల నడవడం లేదు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మంది శ్రామిక ప్రజలు తమ శ్రమతో సమాజాన్ని నడిపిస్తున్నారు. రైతు ఆహారం పండిస్తాడు. కార్మికుడు ఉత్పత్తి చేస్తాడు. ఉద్యోగి సేవలు అందిస్తాడు. నిర్మాణ కార్మికుడు ఇళ్లు, రహదారులు నిర్మిస్తాడు. వారి కృషి వల్లే సమాజ జీవనం కొనసాగుతోంది. కాబట్టి శ్రమజీవుల సంక్షేమం, వారి జీవన వికాసం గురించి ఆలోచించడ మే నిజమైన సామాజిక జ్ఞానం. ఈ సామాజిక జ్ఞానం ప్రజల్లో పెరిగినప్పుడే సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, వివక్షను ప్రశ్నించే చైతన్యం పెరుగు తుంది. ప్రజలు ప్రశ్నించినప్పుడే పాలకులు తమ నిర్ణయాలకు జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను ముందుకు తీసుకొచ్చినప్పుడే ప్రభుత్వాలు తమ పాలనను మరింత పారదర్శకంగా నిర్వహించాల్సి వస్తుంది. ప్రజాస్వామ్యం అంటే అధికారంలో ఉన్నవారి పాలన మాత్రమే కాదు.. వారిని ప్రశ్నించే ప్రజల హక్కు కూడా. అందుకే ప్రశ్నించాలి.. ప్రశ్నిస్తూనేవుండాలి.
ముద్దగౌని సుభాష్, 9000904284






కామెంట్‌లు (0)