నవతెలంగాణ-హైదరాబాద్: ప్రజల నడ్డి విరిచే విధంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ …. ఎక్కడికక్కడ నిరసనలు తెలియచేయాలని, ప్రజా ప్రతినిధులను (ఎంపీలు, ఎమ్మెల్యేలను) నిలదీయాలని ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ప్రజలకు పిలుపునిచ్చింది. పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి సోమవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు.
వరుసగా నాలుగోసారి మళ్లీ ఈ రోజు రూ.2.86, రూ.2.84లు చొప్పున చమురు ధరలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ చర్యలను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. గత పది రోజులుగా రెండు మూడు రోజులకొకసారి చమురు ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజానీకంపై పెనుభారం వేయడం గర్హనీయమన్నారు. దఫదఫాలుగా భారాలు వేస్తుండడంతో నిత్య జీవితావసరాల ధరలు పెరిగి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు చమురుపై రాష్ట్ర ప్రభుత్వం టాక్స్లు తగ్గించడం లేదని చెప్పారు. ఇష్టానుసారం ధరలు పెంచి దోచుకుంటున్న ప్రైవేట్ ఆయిల్ కంపెనీలకు ముకుతాడు వేయాలి… కానీ అదానీ, అంబానీలకు, అమెరికా ఆయిల్ కంపెనీలకు లొంగిపోయిన ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేస్తున్నది తప్ప ప్రజల బాధలు కనపడడం లేదు అని ధ్వజమెత్తారు. ప్రజలు వ్యతిరేకించి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాట తప్పి మోసం చేసిన ప్రభుత్వ తప్పుడు విధానాన్ని ప్రజలు నిరసించాలన్నారు. పెంచిన చమురు ధరలను ఉపసంహరించాలని ఎక్కడికక్కడ ప్రజలను కదిలించి నిరసనలు తెలపాలని పార్టీ శాఖలకు పిలుపునిచ్చారు.



