ట్రంప్‌పై పోప్ విమర్శలు
వాటికన్ సిటీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు తెచ్చిన ‘న్యాయమైన యుద్ధం’ అనే భావనకు కాలం చెల్లిందని పోప్ లియో అన్నారు. మానవత్వం అనేది హింసాత్మక అధికార సంస్కృతిలోకి జారిపోయిందని ఆయన హెచ్చరించారు. ఒక రకమైన మ్యానిఫెస్టో వంటి తన తొలి ఎన్‌సైక్లికల్ (రోమన్ క్యాథలిక్ చర్చిలో పోప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్‌లు, విశ్వాసులకు వివిధ అంశాలపై జారీ చేసే అత్యున్నత స్థాయి అధికారిక మతపరమైన లేఖ)లో కృత్రిమ మేధ సహా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. అదే సమయంలో యుద్ధ వ్యతిరేక సందేశాన్ని కూడా పునరుద్ఘాటించారు. ‘ఈ రోజు…గతంలో కంటే ఎక్కువగా ఆత్మరక్షణ హక్కుకు భంగం కలగకుండా చేసే ఏ రకమైన పోరునైనా సమర్ధించడానికి న్యాయమైన యుద్ధం అనే భావనను తరచుగా ముందుకు తెస్తున్నారు. అయితే దానికి కాలం చెల్లిపోయిందని చెప్పడం చాలా ముఖ్యం’ అని ఆయన అందులో రాశారు. మానవ జీవితాన్ని ముందుకు తీసుకుపోవడానికి, సంఘర్షణలను పరిష్కరించడానికి చర్చలు, దౌత్యం, క్షమాపణ వంటి అనేక ప్రభావవంతమైన, సమర్ధవంతమైన సాధనాలు మానవాళి వద్ద ఉన్నాయని పోప్ గుర్తు చేశారు. ఇరాన్‌పై ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయిల్ ప్రారంభించిన యుద్ధాన్ని పోప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇరాన్‌ను నాశనం చేస్తానంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కావని ఆయన గతంలోనే స్పష్టం చేశారు. శాంతి కోసం కృషి చేయాల్సిందిగా అమెరికా ప్రతినిధిసభ సభ్యులను డిమాండ్ చేయాలని అమెరికా ప్రజలకు సూచించారు.
న్యాయమైన యుద్ధానికికాలం చెల్లింది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



