నవతెలంగాణ – పరకాల : హనుమకొండ జిల్లా పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి బలం పెరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి శనివారం బీఆర్ఎస్‌లో చేరారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ ప్రధాన కార్యదర్శి ఆలేటి శ్రావణ్ కుమార్, నాయకుడు ఐరబోయిన అజయ్‌తో పాటు మరికొందరు యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మాజీ అధ్యక్షుడు యాట వీరస్వామి ఆధ్వర్యంలో వీరు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే పార్టీ బీఆర్ఎస్ అని, అందుకే యువత పెద్ద ఎత్తున పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత మంది నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



