ప్రాజెక్టుల పెండింగ్ పనులపై చర్యలు : తెలంగాణ ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు
వనపర్తి జిల్లాలో పర్యటన, అధికారులతో సమీక్ష
నవతెలంగాణ- వనపర్తి
వనపర్తి జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులను అత్యంత వేగంగా పూర్తిచేయాలని తెలంగాణ ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ కె.శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం జిల్లాలో పర్యటిం చారు. ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని జిల్లాల్లో పర్యటించి నీటిపారుదల ప్రాజెక్టులపై సమీక్షిస్తామ న్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్టు లను పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. గణపసముద్రం ప్రాజెక్టుకు పెండింగ్ లో ఉన్న 197 ఎకరాల భూసేకరణకుగాను 164 ఎకరాలకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ అయిందని, రైతులను ఒప్పించి అవార్డు కూడా త్వరగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా కర్నె తాండ లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 17 ఎకరాల భూసేకరణకు సంబంధించి సోమవారంలోగా ప్రతిపాదనలు పంపాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్యాకేజ్ 29కు సంబంధించి మైనర్ కెనాల్స్ 77 ఎకరాల భూసేకరణకు పెగ్‌మార్కింగ్ త్వరగా పూర్తిచేసి ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు. ఘనపూర్ బ్రాంచ్ కెనాల్ 30 ఎకరాల భూమికి సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తిచేసి, ఎస్‌డిఆర్ స్టేజిలో ఉన్న 60 ఎకరాలకు కూడా త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. బుద్ధారం పెద్దచెరువుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసిన 101 ఎకరాల భూమి కోసం రైతులతో మాట్లాడి అవార్డు వేగంగా జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఖాన్ చెరువుకు సంబంధించి చందాపూర్, సవాయిగూడెం, పెద్దగూడెం గ్రామాల పరిధిలో అటవీశాఖ అధికారులతో సమన్వయం చేసుకొని పర్వేష్ పోర్టల్‌లో త్వరగా అనుమతులు పొందే విధంగా చూసుకోవాలన్నారు.
ప్రాజెక్టుల విషయంలో భూసేకరణ పనులు పూర్తి చేయడం ప్రథమ ప్రాధాన్యతగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆ దిశగా జిల్లాలోని రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టులకు కీలకమైన ప్రాంతాల్లో భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ రహీముద్దీన్, ఎస్‌ఈ చంద్రశేఖర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్వే ఏడి శ్రీనివాసులు, ఇతర రెవెన్యూ అధికారులు, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



