మగ్గం గిరగిరలు.. రంగు దారాల అల్లికలు.. కష్టానికి కళను జోడించి ప్రపంచానికి వస్త్రాలను అందించే చేతులు.. ఇదే సిరిసిల్ల. తెలంగాణలో చేనేతకు చిరునామాగా నిలిచిన సిరిసిల్ల పేరు వినగానే గుర్తొచ్చేది నేతన్నల జీవనగాథే. అగ్గిపెట్టెలో ఇమిడే చీర, దబ్బునంలోంచి దూరే చీర ఇలా ఎన్నో అద్భుతమైన కళాఖండాలను సష్టించి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతన్నలదే. అలాంటి నేతన్నల కష్టం, కళ, ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇప్పుడు సిరిసిల్ల సిగలో మరో మణిహారం జతకాబోతోంది. కలెక్టరేట్ జంక్షన్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ”జోట” (నాడె) స్టాచ్యూ కేవలం ఒక శిల్పం కాదు.. సిరిసిల్ల జీవన స్రవంతికి ప్రతిబింబం.
సాధారణంగా పట్టణాల్లో జంక్షన్‌లంటే ట్రాఫిక్ నియంత్రణ కేంద్రాలుగానే కనిపిస్తాయి. కానీ కాలక్రమేణా అవి నగర సంస్కతిని చెప్పే చిహ్నాలుగా మారుతున్నాయి. హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ విగ్రహాలు, వరంగల్‌లో కాకతీయ కళాతోరణం ఎలాగైతే ఆ ప్రాంత చరిత్రను చెబుతున్నాయో.. అలా ఇప్పుడు సిరిసిల్లలోని కలెక్టరేట్ జంక్షన్ కూడా నేతన్న జీవనతత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే కేంద్రంగా మారబోతోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ”జోట” స్టాచ్యూ వెనుక ఉన్న ఆలోచన కూడా అదే. సిరిసిల్ల అంటే చేనేత.. చేనేత అంటే నేతన్న.. ఆ నేతన్న జీవితంలో ‘జోట’కు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకం. వస్త్రాన్ని సష్టించే మగ్గంలో జోట (నాడె) కదిలితేనే నేతన్నల బతుకు చక్రం తిరుగుతుంది. అందుకే ఈ విగ్రహం కేవలం కళాఖండం కాదు.. ఒక వత్తికి ఇచ్చే గౌరవం.
నేతన్న చెమట చుక్కలకు కళారూపం
సిరిసిల్ల చేనేత పరిశ్రమ ఎన్నో ఒడిదుడుకులు చూసింది. ఒకప్పుడు ఆర్థిక కష్టాలు, అప్పుల భారంతో ఎన్నో నేతన్న కుటుంబాలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. అయినా మగ్గం ఆగలేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా పవర్‌లూమ్స్, ఆధునిక టెక్నాలజీ వచ్చినా చేనేతతో ఉన్న అనుబంధం తగ్గలేదు. ఇప్పుడు అదే జీవనగాథను శిల్పరూపంలో చూపిస్తుంది ఈ జోట స్టాచ్యూ. జంక్షన్ చుట్టూ రూపొందిస్తున్న త్రీడీ చిత్రాలు కూడా కేవలం అలంకరణ కోసం కాదు. నేతన్న ఉదయం నుంచి రాత్రి వరకు పడే కష్టం, దారంతో జీవితాన్ని నేసే కళ, కుటుంబాల ఆర్థిక బంధం.. ఇవన్నీ ఓ పాఠంలా చెప్పే విధంగా రూపకల్పన చేయబడింది. దూది నుండి నూలు తీయడం, నూలుకు రంగులద్దడం, మగ్గంపై వస్త్రం తయారీ, కండెలు చుట్టే యంత్రం.. ఇలా వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న కొన్ని ప్రక్రియలను చిత్ర రూపంలో రూపొందించారు.
రూ.3 కోట్లతో సుందరీకరణ.. అందం వెనుక ఆలోచన
రూ.3 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ జంక్షన్ సుందరీకరణలో కేవలం అందం మాత్రమే లక్ష్యం కాదు. ఒక పట్టణానికి ప్రత్యేక గుర్తింపును సష్టించడం కూడా. పట్టణంలోకి వచ్చే వారికి మొదటి చూపులోనే ”ఇది నేతన్నల నేల” అనే భావన కలిగించేలా రూపకల్పన జరిగింది. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ప్రారంభమైన ఈ పనులు, జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో శరవేగంగా సాగి తుది దశకు చేరుకొని అతి త్వరలో ప్రారంభానికి కూడా సిద్ధమయ్యింది. పరిపాలన, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ఈ ప్రాజెక్ట్ వేగంగా పూర్తి కావడం విశేషం. ఇప్పటికే పట్టణం నడిబొడ్డున పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుడి విగ్రహాం పట్టణానికే గుర్తుగా నిలువగా, ఈ ”జోట”(నాడె) స్టాచ్యూ పట్టణానికే తలమానికంగా మారబోతోంది.
సిరిసిల్ల గర్వం
ప్రతి పట్టణానికి ఒక గుర్తింపు ఉంటుంది. సిరిసిల్లకు ఆ గుర్తింపు చేనేత. అయితే కొత్త తరం పిల్లలకు నేతన్న కష్టం, చేనేత గొప్పతనం ప్రత్యక్షంగా కనిపించే అవకాశాలు తగ్గుతున్నాయి. అలాంటి సమయంలో ఈ జోట (నాడె) స్టాచ్యూ ఒక చరిత్ర పాఠంలా నిలవనుంది. రేపటి తరం ”ఇది ఏమిటి?” అని అడిగితే ”ఇది మన నేతన్న గౌరవం” అని చెప్పేలా ఈ నిర్మాణం ఉంటుంది. సెల్ఫీలకు మాత్రమే పరిమితం కాకుండా, ఒక వత్తి వెనుక ఉన్న కష్టం, కళ, జీవన తత్వాన్ని గుర్తు చేసే ప్రజా చిహ్నంగా మారే అవకాశం ఉంది. చేనేత ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సిరిసిల్ల.. ఇప్పుడు ఈ జోట స్టాచ్యూతో పర్యాటక కోణంలోనూ ప్రత్యేకత సాధించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక సంస్కతిని ప్రతిబింబించే ప్రదేశాలపై యువత, పర్యాటకులు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇది సెల్ఫీ స్పాట్‌గానే కాకుండా, చేనేత వారసత్వాన్ని చాటే ల్యాండ్‌మార్క్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. మగ్గం చప్పుడు వినిపించే నేలపై.. నేతన్న కష్టాన్ని శిలగా మలిచే ఈ ”జోట” స్టాచ్యూ జంక్షన్ ప్రారంభమైతే, అది కేవలం జంక్షన్ అందం కాదు.. సిరిసిల్ల ఆత్మకు నిలువెత్తు ప్రతిరూపంగా నిలుస్తుంది.
– ఆకుల జయంత్ కుమార్
రాజన్న సిరిసిల్ల



