Sunday, June 7, 2026
E-PAPER
Homeకవితమనసు తంత్రులు...

మనసు తంత్రులు…

- Advertisement -

మనసు ఒక వెన్నెల సరస్సు
పైకి ప్రశాంతం…లోతుల్లో అలల యుద్ధం
ఆలోచనలు తూనీగల్లా రెక్కలు తొడుక్కుని
గిర్రున తిరుగుతుంటాయి
నిశ్శబ్దపు నీటిమీద వలయాలు వలయాలుగా
మనసు కలం పట్టి కవిత గీసి పోతోంది
భావాలన్నీ చిందర వందరగా…
ఎన్నని వరుసలో ఏరుకుంటాము..!?
గతం ఎప్పుడూ మల్లెపూల పరిమళమే
వాడిపోయినా వేళ్లలో నిలిచే జ్ఞాపకం
భవిష్యత్తు ఉదయపు పొగమంచు
కనిపిస్తూ కనిపించని దూరపు దారి.
కోరికలెప్పుడూ… గాలిపటాల్లా
ఆకాశాన్ని తాకాలని దారాన్ని లాగుతాయి
భయాలు ముళ్లతీగల్లా
అడుగు ముందుకు వేయగానే పాదాలను చుట్టుకుంటాయి
నిరాశ వానతడి తగిలిన అద్దాల కిటికీ
బయట ప్రపంచాన్ని మసకబార్చేస్తుంది
తలపుల తలుపులు తెరిచే వరకూ..
దృశ్యం ఎప్పుడూ.. అదృశ్యమే
మన పక్కనే తచ్చాడే ప్రేమ
వేణుగానంలా…కనిపించకుండా హృదయాన్ని తట్టి పిలుస్తుంది..
ఎక్కడికో… ఏకాంతం ఎడారి వెన్నెల
అందంగా ఉన్నా ఆలింగనం చేయదు.
గుండెకు వేళ్లాడే తంబూరా తీగలు
ఒకే స్పర్శకు అనేక రాగాలు పలుకుతోంది
లోని నదికి గట్టు కట్టిన స్వార్థం
ప్రవాహానికి పరిమితుల్ని నేర్పుతుంది
కాలమంతా కరిగి పోయాక జ్ఞానోదయాలు వరుసలు కడతాయి
కన్నీరు ముత్యపు చినుకులే…
నొప్పికి లోలోపలి సముద్రం ఇచ్చిన నిశ్శబ్ద బహుమతులు అవి
అశ్రుధార లేకుండా ఆవలి తీరం చేరలేము
నవ్వు సంపంగి పువ్వే..
వేదనను సుగంధంగా దాచుకుంటుంది
మనసు సంఘర్షణ రెండు ఋతువుల మధ్య నిలిచిన వసంతం
ఒక వైపు మెరుపుల పిలుపిచ్చి
మరో వైపు వెన్నెల ఒడిలోకి లాగుతోంది
ఏ దారిని ఎంచుకోవాలో తెలియక
హృదయ వీణ అదే స్వరాన్ని అప్పుడప్పుడు
బోర్‌ గా ఆలపిస్తుంది.. ప్చ్‌..!
డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -