Thursday, August 20, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిపాలిటెక్నిక్‌ విద్యపై కార్పొరేట్‌ నీడ

పాలిటెక్నిక్‌ విద్యపై కార్పొరేట్‌ నీడ

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పాలిటెక్నిక్ విద్యతో పాటు ITI, ATC కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో నంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాలిటెక్నిక్ విద్య రెండు ముక్కలు కానుంది. పాలిటెక్నిక్‌తో పాటు ITI, ATC కాలేజీలు స్కిల్ యూనివర్సిటీ కిందకు, ఉద్యోగు లంతా శక్తి శాఖ (Department of Skill Human Capital and Knowledge Training Initiatives) పరిధిలోకి వె‌ళ్లనున్నారు. ప్రభుత్వం తీసుకొన్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. పాలిటెక్నిక్‌, ITI విద్యను సాంకేతిక విద్యాశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పదవ తరగతి తరువాత ఉపాధి, ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్య ఒక సువర్ణ అవకాశం లాంటివి. ఐటీఐ విద్య ఒక ఒకేషనల్ కోర్సు. ఐటీఐలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పై 70శాతం కంటే ఎక్కువ శ్రద్ధ పెడతారు.

యంత్రాలను ఎలా ఆపరేట్ చేయాలి, రిపేర్ ఎలా చేయాలి అనే ‘క్రాఫ్ట్స్‌మెన్’ నైపుణ్యాలను నేర్పుతారు. పాలిటెక్నిక్ విద్య అనేది డిప్లమా కోర్స్. దీనిలో థియరీ (ఇంజనీరింగ్ సిద్ధాంతాలు)తో పాటు ప్రాక్టీకల్స్ సమానంగా నేర్పుతారు. ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న సాంకేతికతను అర్థం చేసుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. డిప్లమా విద్య పూర్తి చేసుకున్న వేలాది విద్యార్థులు నేడు కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులుగా, ISRO, DRDO, BHEL, NFC, FCI లాంటి సంస్థల్లో సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా పనిచేస్తూ దేశ అభివృద్ధిలో భాగమవుతున్నారు. డిప్లమా తరువాత ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఈసెట్ ఎంట్రన్స్ ద్వారా లాటరల్ విధానంతో ఇంజనీరింగ్ కోర్సులలో రెండవసంవత్సరంలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ కళాశాలలు, 54 ప్రయివేటు కళాశాలల్లో మొదటి, రెండవ, మూడేండ్లల్లో దాదాపుగా లక్ష మంది విద్యా ర్థులు చదువుతున్నారు. పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపుగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులే అధికం. అందులో ఎక్కువ శాతం బాలికలే. ఇక స్కిల్ యూనివర్సిటీ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ-2020 లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది.

ఈ యూనివర్సిటీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ (PPP) మోడల్లో నడుస్తుంది. యువతలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. పదిహేను మందితో యూనివర్సిటీ బోర్డు ఏర్పాటు చేయగా, అందులో ఏడుగురు మల్టీనేషనల్ కంపెనీల యజమాను లు ఉన్నారు. దీనికి చాన్స్‌లర్‌గా సీఎం రేవంత్ రెడ్డి, చైర్మ‌న్‌గా మహేంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహేంద్ర ఉన్నారు. ఈ యూనివర్సిటీకి నిధులు ప్రభుత్వం, కార్పొరేట్ నిధులతో పాటు బ్యాంకులు, కార్పొరేషన్ ద్వారా సమకూరనున్నాయి. దాతలు డబ్బులిస్తే భవనాలు, గదులు, సెంటర్లు నిర్మించి వాటికీ దాతల పేర్లు పెట్టనున్నారు. ఫీజుల విషయానికొస్తే బయట కోర్సుల కంటే అధికంగా వున్నాయి. ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంలో నడుస్తున్న యూనివర్సిటీ కనుక యూనివర్సిటీ వద్ద నిధులు లేకుంటే ఆ భారం విద్యార్థుల మీద పడనుంది. ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తే రానున్న రోజుల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్య పట్ల వున్న నిర్లక్ష్య వైఖరి తెలియజేస్తుంది.

దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను, కోట్ల విలువ చేసే కళాశాలల భూములతో సహా, పబ్లిక్-ప్రయివేటు పార్టనర్‌షిప్ (PPP) మోడల్‌లో నడిచే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ పరిధిలోకి నెట్టడం వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు దాగున్నాయి. కార్పొరేట్ కంపెనీలకు అవసరమైనట్టు సామాజిక భద్రత లేకుండా, తక్కువ జీతాలతో పనిచేసే కొద్దిమంది అసంఘటిత కార్మికుల తయారీ మాత్రమే ఈ స్కిల్ యూనివర్సిటీలో జరుగుతుంది. తద్వారా దేశ అభివృద్ధి వెనక్కి నెట్టబడుతుంది. SBTETను యథావిధిగా కొనసాగిస్తూ, సాంకేతిక విద్యకు ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలి. రాష్ట్రంలోని వనరులను వినియోగించి ప్రభుత్వ రంగంలో చిన్న, కుటీర పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. ఆయా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను ITIలు, పాలిటెక్నిక్‌లలో విద్యార్థులకు అందించేలా విద్యా విధానాన్ని రూపొందించాలి. దీంతో తెలంగాణలో భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నిరుద్యోగ సమస్యను కూడా కొంతవరకు పరిష్కరించవచ్చు.

జనార్ధన్

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -