– పోస్టర్ ఆవిష్కరించిన నాయకులు
– జయప్రదం చేయాలని పిలుపు
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై సమరశంఖం పూరించడానికి, రైతాంగ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 3వ మహాసభలు ఈ నెల ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ చారిత్రాత్మక మహాసభలను జయప్రదం చేయాలని రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజలను తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పోతినేని సుదర్శన్ రావు, టి సాగర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో మహాసభల పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల జీవితాల్లో ఆశించిన మార్పు రాలేదు. ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతన్నను అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో గడిచిన మూడేళ్లలో జరిగిన పోరాటాలను సమీక్షించుకోవడానికి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవడానికి ఈ 3వ మహాసభలు ఒక వేదిక కానున్నాయి. పండించిన ప్రతి గింజకూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు మద్దతు ధర కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. రైతులకు పూర్తిస్థాయి రుణమాఫీ అమలు కాకపోవడం, బ్యాంకుల వేధింపులపై చర్చ జరుగుతుందని అన్నారు. పోడు సాగుదారులకు హక్కు పత్రాల పంపిణీలో జరుగుతున్న జాప్యంతో అటవీ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అసలైన సాగుదారులైన కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, ప్రభుత్వ పథకాలు వారికి అందేలా చూడాలని అన్నారు.
మొదటి రోజు (ఏప్రిల్ 23) ప్రారంభ సభలో జాతీయ రైతు నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. దేశవ్యాప్త రైతు ఉద్యమ అనుభవాలను, ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిణామాలను వివరిస్తారు. రెండవ రోజు (ఏప్రిల్ 24) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుండి ఎంపిక చేయబడిన ప్రతినిధులు ఈ సభలో పాల్గొంటారు. గత మూడేళ్లలో జిల్లాలు, మండలాల వారీగా జరిగిన ఉద్యమాలపై నివేదిక సమర్పించబడుతుంది. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులు, కార్పొరేట్ శక్తుల చొరబాటుపై చర్చాగోష్ఠులు జరుగుతాయి. మూడవ రోజు (ఏప్రిల్ 25) భవిష్యత్ కార్యాచరణ & నూతన కమిటీ ఎన్నిక ఉంటుందని తెలిపారు. ముగింపు రోజున రాబోయే మూడేళ్ల కాలానికి చేపట్టబోయే ఉద్యమాలకు రూపకల్పన చేస్తారు. రైతు సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేసేందుకు సరికొత్త రాష్ట్ర నాయకత్వాన్ని ఈ సందర్భంగా ఎన్నుకుంటారు. ఈ మహాసభలకు అఖిల భారత రైతు సంఘం (AIKS) జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు డాక్టర్ అశోక్ దావలే, డాక్టర్ విజూ కృష్ణన్ హాజరుకానున్నారు. రాష్ట్రంలోని మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, సామాజిక కార్యకర్తలు తమ విలువైన సూచనలు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహరెడ్డి, పి జంగారెడ్డి, అరిబండి ప్రసాదరావు, వర్ణ వెంకట్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణ, బొంతు రాంబాబు, మాటూరి బాలరాజు గౌడ్, ఈసంపెల్లి బాబు, ఎం శ్రీనివాసులు, పల్లపు వెంకటేష్, రాపర్తి సోమయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు వాసిరెడ్డి ప్రసాద్, మీరాసాహెబ్, మల్లు నాగార్జున రెడ్డి, కొప్పుల రజిత, కందాల శంకర్ రెడ్డి, పారేపల్లి శేఖర్ రావు, దేవిరెడ్డి అశోక్ రెడ్డి, మేక అశోక్ రెడ్డి, భూక్యా చందు నాయక్, నల్లపు సుధాకర్, రాజారావు, తిరుపతి రెడ్డి, మిల్కురి వాసుదేవారెడ్డి, రావుల జంగయ్య, బాలరెడ్డి, బండి రమేష్, దశరథం తదితరులు పాల్గొన్నారు.



