నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం శక్తి జిల్లాలో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింఘితరాయ్‌లోని వేదాంత పవర్ ప్లాంట్‌లో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. మంగళవారం మధ్యాహ్నం ప్లాంట్‌లో కార్మికులు విధుల్లో ఉండగా అకస్మాత్తుగా బాయిలర్ ట్యూబ్ పేలిపోయింది. పేలుడు ధాటికి ప్లాంట్ ప్రాంగణమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో కార్మికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. హుటాహుటిన క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై విచారణకు ఆదేశించింది. ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాల పాటించడంలో వైఫల్యం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



