Wednesday, April 15, 2026
E-PAPER
Homeబీజినెస్దక్షిణాసియాలో వరి సాగు సంక్షోభం!

దక్షిణాసియాలో వరి సాగు సంక్షోభం!

- Advertisement -

యుద్ధం ప్రభావంతో ఇంధన, ఎరువుల ధరలకు రెక్కలు

ఖర్చులు పెరగడంతో పంటలు వేయడం తగ్గిస్తున్న రైతులు
భవిష్యత్తులో ఆహార కొరత వచ్చే ప్రమాదం : హెచ్చరిస్తున్న నిపుణులు


బ్యాంకాక్‌, ఫ్నామ్‌పెన్‌, మనీలా : మధ్యప్రాచ్యంలో యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన,ం ఎరువుల ధరలు పెరిగాయి. ఇది దక్షిణాసియా దేశాల పైనా ప్రభావం చూపింది. ఇంధన ధరల షాక్‌తో ఇక్కడి రైతులు కొత్త పంటలు వేయడాన్ని తగ్గిస్తున్నారు. మరికొందరైతే పంటలను పూర్తిగా వదిలేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దీంతో ఇది ప్రపంచ ఆహార భద్రతపై ఆందోళనలు పెంచుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కోట్లాది మంది రైతులపై ప్రభావం
పంట కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు ఖాళీగా ఉండిపోతున్నాయి. కొంత మంది రైతులు వచ్చే సీజన్‌కు విత్తనాలు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇది ప్రపంచంలో ప్రధాన వరి ఉత్పత్తి ప్రాంతమైన దక్షిణాసియాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దక్షిణాసియాలో కోట్లాది మంది చిన్న రైతులు ట్రాక్టర్లు, నీటిపారుదల పంపులు, వరి నాటే యంత్రాలకు అవసరమైన డీజీల్‌, అలాగే ఎరువులను కొనలేక ఇబ్బందులు పడుతు న్నారు. థారులాండ్‌లో కొన్ని చోట్ల పంట కోయడానికి ఖర్చు ఎక్కువ కావడంతో రైతులు పొలాల్లోనే పంట వదిలేస్తున్నారు.

అన్నదాతల్లో భయం
ఇరాన్‌లో జరిగిన ఆరు వారాల యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బ తీసిన విషయం విదితమే. ముఖ్యంగా హార్ముజ్‌ జలసంధి మార్గం దాదాపు మూసుకుపోవడంతో ఇంధన, ఎరువుల సరఫరా తీవ్రంగా ప్రభావితమైంది. ఈ మార్గం ద్వారా ఆసియాకు సరఫరాలు ఎక్కువగా జరుగు తాయి. కాంబోడియాలోని బీఆర్‌ఎం ఆగ్రో సంస్థ సహ వ్యవస్థాపకులు ప్యాట్రిక్‌ డేవెన్‌పోర్ట్‌ మాట్లాడుతూ… ”రైతులు భయంతో ఉన్నారు. ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధా రపడే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు” అని తెలిపారు.

తక్కువగానే వరి ధరలు.. పడిపోయిన లాభాలు
ప్రపంచ జనాభాలో సగానికి పైగా ప్రజలకు వరి ప్రధాన ఆహారం. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకం. కానీ రైతులు ఇప్పుడు రెట్టింపు, మూడింతలైన ఖర్చులతో ఇబ్బందులు పడుతుండగా.. వరి ధరలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. థారులాండ్‌లో ఐదు శాతం బ్రోకెన్‌ రైస్‌ ధరలు గత దశాబ్దంలో కనిష్టానికి పడిపోయాయి. టన్నుకు 400 డాలర్ల కంటే తక్కువగా ధరలు ఉండటంతో రైతులకు లాభాలు తగ్గిపోయాయి.

ధర హామీ లేకుండా సాగుకు నో
ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన ఆర్థికవేత్త మాక్సిమో టోరెరో ప్రకారం.. హార్ముజ్‌ మార్గం ఇంకా 20-30 రోజులు మూసుకుపోతే.. ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఆహార కొరత ప్రభావం కనిపించవచ్చు. కాంబోడియాలో కొంత మంది రైతులు సరైన ధర హామీ లేకుండా ఈ నెలలో విత్తనాలు వేయడానికి సిద్ధంగా లేరు. బీఆర్‌ఎం ఆగ్రోతో పని చేస్తున్న రైతుల్లో దాదాపు పది శాతం మంది ముందుగా ధర ఖాయం అయితేనే సాగు చేస్తామని చెప్తున్నారు. ఫిలిప్పీన్స్‌లో ఈ ఏడాది వరి ఉత్పత్తి కనీసం పది శాతం తగ్గవచ్చని అంచనా. అంటే దాదాపు రెండు మిలియన్‌ టన్నుల వరి ఉత్పత్తి కోల్పోయే ప్రమాదం ఉంది. ఫిలిప్పీన్స్‌ రైతు సంఘం ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ప్రభావం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ పంటకోత సమయంలో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు.

‘ఈ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు’
ప్రస్తుతం దక్షిణాసియాలో రైతులు రెండు సీజన్ల మధ్యలో ఉన్నారు. ఒకవైపు ఎండాకాలం పంటకోత జరుగుతుండగా.. మరోవైపు వర్షాకాలపు పంటకు విత్తనాలు వేయాల్సిన సమయం వచ్చింది. ఈ సమయంలో ఖర్చులు పెరగడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త అలీషర్‌ మిర్జాబాయెవ్‌ ప్రకారం.. ఇంధనం, ఎరువుల ఖర్చులు ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం నిల్వలు ఉన్నందున తాత్కాలికంగా సమస్య కనిపించకపోయినా, నిర్లక్ష్యం చేయరాదని ఆయన హెచ్చరించారు.


భారత్‌లో కొన్ని నెలల్లో వరి పంట సాగు

భారత్‌లో ప్రధాన వరి పంట సాగు ఇంకా కొన్ని నెలల దూరంలో ఉంది. ఇలాంటి సమయంలో ఇంధన, ఎరువుల ధరలు దేశ రైతులపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నాయి. చైనా మాత్రం ఈ ఇంధన, ఎరువు సమస్యల నుంచి కొంత వరకు రక్షితంగానే ఉంది. వియత్నాం మెకాంగ్‌ డెల్టాలో రైతులు మూడు పంటలు వేసే బదులు రెండు పంటలకే పరిమితం కావాలని ఆలోచిస్తున్నారు.
ఖర్చులు పెరగడంతో లాభాలు దాదాపు లేకుండా పోతున్నాయి. థారులాండ్‌లో కొంత మంది రైతులు పంటకోతకు సిద్ధంగా ఉన్న పంటను కూడా కోయకుండా వదిలేస్తున్నారు. దీనితో పంట నాణ్యత తగ్గిపోతోంది. 2026 మార్చి-ఏప్రిల్‌ కాలంలో ఎండాకాలపు వరి పంట దాదాపు 19 శాతం తగ్గవచ్చని అంచనా.

కొత్త మార్గాలు వెతుకుతున్న రైతులు
ఈ ఏడాది ప్రధాన పంట సాగు త్వరలో ప్రారంభమవుతుంది. కానీ ఎరువుల లభ్యతపై ఆధారపడి ఉత్పత్తి పరిమితం అవుతుందని రైతు సంఘాలు చెప్తున్నాయి. ఈ సమస్యల నేపథ్యంలో రైతులు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కొందరు వరికి బదులు తక్కువ నీరు అవసరమైన మక్క జాతి పంటలకు మారుతున్నారు. మరికొం దరు బయో ఎరువులు, సౌరశక్తితో నడిచే పంపులు, ఎలక్ట్రిక్‌ మోటార్లు వంటివి ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చాలా మంది రైతులకు ఇవి సాధ్యం కాకపోవడంతో, నష్టాలు వచ్చినా సాగు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ”మాకు ఇంకో మార్గం లేదు. భూమిని ఖాళీగా వదిలేయడం కంటే మళ్లీ పంట వేయడం మంచిదని భావిస్తున్నాం” అని ఫిలిప్పీన్స్‌ రైతు రుయెల్‌ బాంటుగన్‌ అన్నారు.

‘ప్రభుత్వాలు అన్నదాతలకు బాసటగా నిలవాలి’
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో శాంతి పునరుద్ధరణ చాలా కీలకమని మేధావులు సూచిస్తున్నారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంతో రైతుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగింపునకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని సూచిస్తున్నారు. అలాగే ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు ఈ కష్టకాంలో రైతులకు బాసటగా నిలిచి, ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని అంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -