నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ నాయకత్వంతో చర్చల కోసం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ బుధవారం టెహ్రాన్ చేరుకున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీతో కూడిన ప్రతినిధి బృందంలో మునీర్ కూడా ఉన్నారని సైనిక మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఒకప్రకటనలో తెలిపింది. మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో భాగంగా వారిరువురు ట్రెహాన్ చేరుకున్నారని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి వారికి స్వాగతం పలికినట్లు ఆ ప్రకటన తెలిపింది. ఇరాన్ నాయకత్వానికి అమెరికా సందేశాన్ని అందించడం, తదుపరి దశ చర్చల కోసం వ్యూహాత్మక ప్రణాళికను రచించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొంది.
వారాంతంలో ఇస్లామాబాద్ లో జరిగిన చర్చలు ఎటువంటి పురోగతి లేకుండా ముగిసిన తర్వాత, పాకిస్తాన్ ద్వారా అమెరికా సందేశాల మార్పిడి కొనసాగిందని బుధవారం ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఖాయీ ధృవీకరించారు. ఆదివారం ఇరాన్ ప్రతినిధి బృందం టెహ్రాన్ కు తిరిగి వచ్చినప్పటి నుండి, పాకిస్తాన్ నుండి పలు సందేశాలు అందాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా ఇర్నా తెలిపింది. ఒక పక్షం మరో పక్షంపై ఆంక్షలు విధించడం ఆధారంగా చర్చలు జరిగితే, అవి చర్చలు కావని, ఆదేశించడం లేదా బలవంతంగా రుద్దడం అవుతుందని అన్నారు. ఇరాన్ ఎప్పటికీ ఆ ఆంక్షలకు లొంగదని అన్నారు. అధికారిక పర్యటన కోసం ఇరాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ బుధవారం సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ వెళ్లినట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది.



