భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం…. ఈ పంచభూతాల సమన్వయమే మన విశ్వ నిర్మాణం. విశ్వంలో గల మొత్తం జీవరాశి శ్రేయస్సే పరమావిధిగా భూ ఉపరితలం పైన భూ గర్భం లోపల కూడా మనకు అనేక అమూల్యమైన వనరులను అందిస్తూ సమస్త జీవకోటి భారాన్ని మోస్తూ ఉంది. ఈ విశ్వంలో మనకు తెలిసిన జీవం ఉన్న ఏకైక గ్రహం భూమి మాత్రమే. ఈ భూమిపై సుమారు 71% నీరు, మిగిలిన 29% భూమి ఉంది. కానీ ఈ ఒక వంతు భూమే మనిషి, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు వంటి కోట్లాది జీవరాశులకు ఆశ్రయం కల్పిస్తుంది. విశ్వంలో వేరే ఎక్కడైనా జీవం ఉందా అనే అన్వేషణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నా, మనకు తెలిసినంతవరకు ప్రాణికోటికి ఆశ్రయం ఇచ్చింది మాత్రం ఈ భూమి మాత్రమే.
జీవకోటికి ఆహారాన్ని అందిస్తున్న ఈ భూమి అనేది లేకపోతే జీవం అనేది అసాధ్యం. ఎందుకంటే భూమి అంటే ఉపరితలం మాత్రమే కాదు, భూగర్భంలో సైతం అపారమైన ఖనిజ వనరులను అందిస్తూ, కోట్లాది జీవరాశుల జీవనభారం మోస్తూ ఉంది. అందుకే భారతీయ సంస్కతిలో భూమిని ‘మాతా భూమీ పుత్రోహం పథివ్యాః’ అని ప్రకటించారు. భూమితో మన సంబంధం కేవలం వనరుల వినియోగం కాదు… అది తల్లీబిడ్డల అనుబంధం. ఓర్పు, సహనానికి ప్రతీకగా ‘క్షమయా ధరిత్రీ’ అని భూమిని గౌరవించారు. అటువంటి ఈ భూమి మనకు పంటల ద్వారా ఆహారాన్ని, అడవుల ద్వారా ఆక్సిజన్, ఖనిజాలు, ఇంధన వనరులు ఇస్తుంది. అయితే, ఈ భూమి సహనాన్ని పరీక్షించే విధంగా మనిషి ప్రవర్తన మారింది.
పుడమిపై ఓ వైపు పెరుగుతున్న జనం.. మరో వైపు తరుగుతున్న వనరులు.. ఇంకొక వైపు పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, అభివద్ధి పేరిట మితిమీరి వనరుల వాడకం భూమికి శాపంగా మారింది. మరో పక్క వాహనాల సంఖ్య అధికం కావడం, పెరుగుతున్న జనాభాకు అవసరం అయ్యే ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం భూమిపై రసాయన క్రిమి సంహారక మందులు వాడకం తీవ్రత, అడవుల నరికివేత… ఇవన్నీ కలసి భూ ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం సంభవిస్తున్నది. ఎంత సాంకేతిక విజ్ఞానం పెరిగినా వంట చెరకు కోసం అడవులపై ఆధార పడే జనాభా ప్రపంచం మొత్తం మీద 240 కోట్ల పైనే ఉంటారని అమెరికాకు చెందిన ఆహార సంస్థ పేర్కొంది. ధరణి హరితంగా ఉండాలంటే 33 శాతం అడవులు ఉండాలి. కానీ మన దేశంలో మాత్రం ఇవి 21 శాతానికి మించి లేవు. అంతే కాదు మనదేశంలో సగటున రోజుకు 333 ఎకరాల అటవీ భూమి అదశ్యం అయిపోతుందని గణాంకాలు చెబుతున్నాయి. నీటి పారుదల ప్రాజెక్ట్‌లు రహదారుల నిర్మాణాల వలన కూడా అటవీ భూములను కోల్పోతున్నాం. వీటి కారణంగా పెరిగిన కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, మనుషుల జీవనశైలి కారణంగా కర్బన ఉద్గారాలు పెరిగి 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. వాహనాలు, పరిశ్రమలు, ఇతర కార్యక్రమాల ద్వారా విడుదలవుతున్న కర్భన ఉద్గారాల ప్రభావం వాతావరణాన్ని మరింత కలుషితం చేస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు అధికమై భూతాపం పెరిగి భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది.
భూ ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల భూతాపం పెరుగుతోంది. దాంతో హిమాలయాలు కూడా కరిగిపోవడం ఆరంభమయ్యాయి. సముద్ర నీటి మట్టాలు సుమారు ఏడు అంగుళాల వరకూ పెరిగి జనావాసాలపై విరుచుకు పడుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా రకరకాలైన వైరస్‌లు మనపై దాడిచేస్తూ ప్రాణాంతకంగా తయారయ్యాయి.
భూతాపం తీవ్రత వల్లనే
ఈ భూతాపం వలన సగటు వర్షపాతం తగ్గిపోతుంది. తుఫాన్లు, సునామీలు, భూకంపాలు, కరువు కాటకాలు సంభవిస్తున్నాయి. భూమికి రక్షణ కవచంగా నిలిచే ఓజోన్ పొరకు ఏర్పడ్డ రంధ్రాల పరిమాణం పెరుగుతోంది. అభివద్ధి పేరిట ప్రకతిని అవసరాలకు మించి వాడుకోవడం మన మనగడకే ముప్పు అనే సత్యాన్ని విస్మరిస్తున్నాం. ఇదే విధంగా భూతాపం కొనసాగితే పెరిగే పర్యావరణ విధ్వంసం వల్ల మానవాళికి మరో వేయ్యేళ్లు పిదప ఈ భూమిపై మనుగడ ఉండదని స్టీఫెన్ హాకింగ్ హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే.
ప్రకతిలో గల ఎన్నో వక్షాలు జంతువులు అంతరించి పోతూ జీవ వైవిధ్యానికి పెను ప్రమాదం ఏర్పడింది. బుతువులు క్రమం తప్పి వర్షాలు కురవడం లేదు. పరిశుద్ధమైన నీరు లభించడం లేదు. ప్లాస్టిక్ కుప్పలతో భూమి సార విహీనం అయిపోయింది. భూ గర్భంలో నీరు కలుషితం అయిపోయింది. ప్రకతి సమతూకాన్ని దారుణంగా దెబ్బతీసే పారిశ్రామికీకరణ ఫలితం యావత్ మానవాళి పాలిట పెనుశాపంగా పరిణమించింది. ఈ మహోత్పాతం నుంచి గట్టెక్కాలంటే, ఈ శతాబ్ది చివరికి భూతాప వద్ధిని క్రితం కంటే రెండు డిగ్రీల సెల్సియస్ తక్కువకు కట్టడి చేయాలని ప్యారిస్ ఒడంబడిక చెబుతోంది. అయితే వాస్తవం దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. వాతావరణ మార్పుల వలన ఏర్పడే దుష్ప్రభావాలు ప్రపంచ దేశాలపై ఎలా ఉందో తెలియచేసే క్లైమేట్ రిస్క్ సూచీలో మన దేశం 7వ స్ధానంలో నిలిచింది. రాష్ట్రాల వారిగా చూస్తే… జార్ఖండ్, మిజోరం, ఒడిశా, చత్తీస్ ఘడ్ అస్సాం, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్ రాష్ట్రాలపై అత్యధికంగా, మధ్య స్థాయి ముప్పును ఎదుర్కొనే పది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ వుంది. తక్కువ స్థాయిలో ఎఫెక్ట్ అయ్యే పదకొండు రాష్ట్రాల్లో తెలంగాణ వుందని కేంద్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. దీన్ని బట్టి ప్రభుత్వాలు, ప్రజలు అప్రమత్తంగా అ వుండాల్సిన అవసరం వుంది.
గత ఎనిమిది లక్షల సంవత్సరాల్లో ఏనాడూ లేనంతటి గరిష్ఠ స్థాయిలో భూగోళమంతటా ఇప్పుడు మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్‌డై ఆక్సైడ్ పేరుకున్నట్లు గణాంకాలు చాటుతున్నా, దిద్దుబాటు చర్యలు మాత్రం నామ మాత్రమే.
పెరుగుతున్న టెక్నాలజీ జీవితాన్ని సుఖమయం చేసిందని సంబర పడుతూ కాంక్రీట్ జంగిల్‌లో ఉంటున్న మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు ఈ భూమిని ప్రమాదటంచుల్లో పడేస్తుందని గుర్తించడం లేదు. భూమి పరిరక్షణపై ఎంతమందికి అవగాహన ఉందంటే సమాధానం దొరకని ప్రశ్నే. భూ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా, హాని కలిగించకుండా ఉంటే చాలనేది నగ సత్యం. ఈ భూమిపై మనం ఒక్కరమే కాదు, లక్షలాది జీవరాసులు జీవిస్తున్నాయి. వాటి మనుగడ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఎన్నో జాతులు అంతరించి పోవడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా జీవ వైవిధ్యంలో అసమతౌల్యానికి కారణం అవుతున్నాం.
ఎంతో శ్రమించి, ఆర్జించి పోగు చేసిన సంపదను మన వారసులకు అందించడంలో ఎంతో ఉత్సహం చూపిస్తాం. అందుకోసం ఎన్నింటినో త్యాగం చేస్తాం. అదే ప్రకృతి ఇచ్చిన వనరులు విషయంలో భావితరాల వారికి అందించాలని స్పహ లేకుండా వ్యవహరిస్తున్నాం. రాబోయే తరాలమనుగడే ప్రశ్నార్ధకం అవుతున్న దుస్థితి నెలకొంది. ఇది సుస్ధిర అభివద్ధికి తీవ్ర అఘాతంగా నిలిచింది.
గ్రహాంతర వాసానికి పరిశోధనలు
ప్రస్తుత ప్రపంచం భూతాపాన్ని తగ్గించే దిశగా కాకుండా గ్రహాంతర వాసం కోసం పరిశోధనలు చేస్తూ చంద్రుడి మీద నివాసం కోసం, అంగారకుడి మీదకూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అక్కడి వాతావరణం అనుకూలంగా వుండదని తెలిసీ వేల కోట్లు, లక్షల కోట్లు వెచ్చించి పరిశోధనలు చేస్తున్నాం. కానీ, అన్ని విధాల అనుకూలంగా వున్న పుడమి తల్లిని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నాం.
గడచిన అయిదు దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా భూసారం, ఉత్పాదకశక్తి తగ్గిపోతూ వస్తున్నాయి. భూ వనరుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అధిక దిగుబడే లక్ష్యంగా వ్యవసాయం చేస్తుండటంతో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. సింథటిక్ పైరేత్రోయిడ్స్ (ప్లాస్టిక్ తదితరాలు) వంటి రసాయనాల వల్ల నేలలోని ప్రయోజనకర సూక్ష్మజీవులు, శిలీంద్రాలు నశించిపోతున్నాయి. పర్యవసానంగా నేల సహజత్వం కోల్పోయి పంట పొలాలు నిస్సారమవుతున్నాయి.
వ్యవసాయం, గహ నిర్మాణం కోసమని అడవులను ధ్వంసం చేయడం, చెట్లను నరికేయడం కొంతకాలంగా పెరుగుతోంది. ఈ పరిణామంతో వన్యప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతింటోంది. తాగునీరు, ఆహారం కోసం వన్యప్రాణులు సమీప జనావాసాల్లోకి వస్తున్నాయి. దాంతో మనుషులు వాటిని చంపడం, అవి మనుషులను చంపడం పరిపాటిగా మారింది.
గడచిన 75 సంవత్సరాల్లో నాశనమైన అటవీ భూములను అదే స్థాయిలో పునరుద్ధరించడం సాధ్యపడే విషయం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం ఏటా కోటి హెక్టార్లకుపైగా అడవులు కనుమరుగవుతున్నాయి. మూడు దశాబ్దాల కాలంలో సుమారు 42 కోట్ల హెక్టార్లకు పైగా విస్తీర్ణంలోని అడవులు అంతరించాయన్న అంచనా.
మరోవైపు సముద్రాలు వేడెక్కడం, నీటి మట్టాలు పెరగడంతో తీరప్రాంతాల్లోకి సాగర జలాలు చొచ్చుకొస్తున్నాయి. దాంతో అక్కడి భూముల్లో లవణీయత పెరిగి సేద్యానికి పనికిరావడం లేదు
ప్రపంచ ఆహార సంస్థ నివేదికల ప్రకారం వ్యవసాయ భూములు, నగరాల విస్తరణ, మౌలిక సదుపాయాలు, ఖనిజ తవ్వకాలు వంటి అభివద్ధి కార్యక్రమాల ప్రభావం అడవులపై పడుతోంది. ఇలా ప్రకతిపై మనిషి మితిమీరిన ఆధిపత్యం చూపడం వల్ల భూమి సమతౌల్యం దెబ్బతింది.
భూమి చరిత్రలో ఆరవ మహా వినాశనం ప్రారంభమైందా?
సహజంగా జాతులు అంతరించడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. భూమి చరిత్రలో కొన్ని సందర్భాల్లో భారీ స్థాయిలో జీవరాశులు అంతరించిపోయాయి. వీటిని మహా వినాశనాలు అంటారు. ఇప్పటివరకు భూమి చరిత్రలో ఐదు ప్రధాన వినాశనాలు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ ఆరో మహా వినాశనం ఇప్పటికే ప్రారంభమై, అది 100 నుంచి 1000 రెట్లు వేగంగా జరుగుతోందని ఉండవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇది ఒక్కసారిగా సంభవించే విపత్తు కాదు…మెల్లగా, నిరంతర ప్రక్రియగా జరుగుతున్న మార్పు.
అయితే గత వినాశనాలన్నీ అగ్నిపర్వత విస్ఫోటాలు, గ్రహశకలాల ఢకొీనడం వంటి సహజ కారణాల వల్ల జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. ఈసారి ఆరవ వినాశనానికి ప్రధాన కారణం మనిషి కార్యకలాపాలే అని చెప్పడంలో సందేహం లేదు.
గాలి, నీటి కాలుష్యం, వనరుల దోపిడీ, అధిక సముద్ర వనరుల వినియోగం… ఇవన్నీ జీవరాశుల అంతరించడానికి కారణాలు అవుతున్నాయి. ఫలితంగా ఆహార శృంఖల విరిగిపోతుంది వ్యవసాయం దెబ్బతింటుంది. నీటి కొరత పెరుగుతుంది. మానవ ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో పడింది. ఫలితమే ఈ ఆరవ మహా వినాశనం. దీనికి కారణం మనమే, అలాగే దాన్ని ఆపగలిగేది కూడా మనమే.
ఇకనైనా తగు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే ఇది పూర్తి స్థాయి మహా వినాశనంగా మారుతుంది.
సమతుల్యతను కాపాడి…
మానవ నిర్మిత జీవవైవిధ్యం ద్వారా జరిగే విధ్వంసాన్ని ఈ దశాబ్దంలోనే అడ్డుకోవచ్చని అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఎకాలజిస్ట్ గ్రెగ్ అస్నర్ అంటున్నారు. భూమిపై జీవ వైవిధ్యాన్ని, సమతుల్యతను కాపాడి ఆరో వినాశనాన్ని తప్పించేందుకు రూపొందించిన ఓ విధానం అమలుకు ఏడాదికి రూ.7 లక్షల కోట్లు అవసరమవుతాయని ఆయన వెల్లడించారు.
ప్రస్తుతం భూమి ఎదుర్కొంటున్న సమస్యలు మునుపెన్నడూ లేనంత తీవ్రంగా ఉన్నాయి:
1. గ్లోబల్ వార్మింగ్: భూమి సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక విప్లవం పూర్వం కంటే 1.2ళీజ నుండి 1.5ళీజ వరకు పెరిగింది. 2025-2029 మధ్య కాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
2. ప్లాస్టిక్ కాలుష్యం: ఏటా లక్షలాది టన్నుల ప్లాస్టిక్ సముద్రాల్లోకి చేరుతోంది. ఇది సముద్ర జీవులనే కాకుండా, మైక్రో ప్లాస్టిక్స్ రూపంలో మానవ ఆహార గొలుసును కూడా కలుషితం చేస్తోంది.
3. జీవవైవిధ్యం క్షీణత: అడవుల నరికివేత వల్ల వన్యప్రాణుల ఆవాసాలు ధ్వంసమవుతున్నాయి. దీనివల్ల వేల సంఖ్యలో జీవజాతులు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
భవిష్యత్తులో ఏర్పడే ముప్పులు
మనం ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే 2040-2050 నాటికి భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
తీర ప్రాంతాల ముంపు: మంచు పలకలు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి ముంబై, న్యూయార్క్ వంటి నగరాలు నీట మునిగే ప్రమాదం ఉంది.
ఆహార సంక్షోభం: అకాల వర్షాలు, తీవ్రమైన కరువుల వల్ల వ్యవసాయ దిగుబడి తగ్గి ఆకలి చావులు పెరగవచ్చు. సుమారు 2.4 కోట్ల మంది ఆకలితో అలమటించే అవకాశం ఉందని అంచనా.
ఆరోగ్య సమస్యలు: పెరిగిన కాలుష్యం వల్ల శ్వాసకోస వ్యాధులు, కొత్త రకం వైరస్‌లు విజృంభించే అవకాశం ఉంది.
ప్రపంచ దేశాలు చేపట్టిన చర్యలు
పర్యావరణ పరిరక్షణ కోసం అంతర్జాతీయ స్థాయిలో కొన్ని కీలక అడుగులు పడ్డాయి.
పారిస్ ఒప్పందం : భూ ఉష్ణోగ్రతలను 1.5ళీజ లోపు ఉంచాలని ప్రపంచ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి.
COP సదస్సులు: ప్రతి ఏటా జరిగే వాతావరణ సదస్సుల ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇటీవల 2025లో జరిగిన సదస్సులో అభివద్ధి చెందుతున్న దేశాలకు వాతావరణ సహాయం కింద 1.3 ట్రిలియన్ డాలర్ల నిధిని కేటాయించాలని చర్చించారు.
గ్రీన్ ఎనర్జీ వైపు మొగ్గు: భారతదేశంతో సహా అనేక దేశాలు సౌర మరియు పవన విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచాయి.
ప్రపంచ ధరిత్రి దినోత్సవం :
మానవ కార్యకలాపాల వలన ఏర్పడుతున్న భూతాపం, వాతావరణ కాలుష్యంతో అల్లాడుతున్న భూమిని కాపాడుకుని పర్యావరణ పరిరణక్ష విషయమై ప్రజల్లో అవగాహన పెంచడం కోసం, భూమికి కృతజ్ఞతగా ప్రతీ సంవత్సరం ఏప్రిల్ 22న ‘ప్రపంచ ధరిత్రి దినోత్సవం’ను 1970 నుండి జరుపుకుంటున్నాం.
భూమి విషయంలో జరుగుతున్న అవాంఛనీయ పరిణామాలు భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పును మోసుకొస్తాయని గ్రహించిన పర్యావరణవేత్తలు గేలోర్డ్ నెల్సన్, డెనిస్ హేస్- ప్రకతి సంరక్షణ కోసం ఈ ఉద్యమం ఆరంభించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమానికి నాంది పలికింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200 పైగా దేశాలు ఈ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. ప్రతి సంవత్సరం 100 కోట్లకు పైగా ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇది వేడుక కాదు; అది భూమి పట్ల మన బాధ్యతను గుర్తుచేసే ఒక హెచ్చరిక.
ఈ సంవత్సరం ఎర్త్ డే నెట్‌వర్క్ ప్రకటించిన థీమ్ ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’. మనకు ఉన్న పౌర అధికారం, సాంకేతిక శక్తిని ఉపయోగించి భూమిని కాపాడుకోవడమే దీని ఉద్దేశం.
భూమిని కాపాడుకోవడంలో సామాన్య ప్రజలందరికీ ‘అధికారం, బాధ్యత ఉందని ఈ థీమ్ చాటిచెబుతోంది.
1. ప్రజల భాగస్వామ్యం: కేవలం ప్రభుత్వాలు లేదా పెద్ద సంస్థలే కాకుండా, సామాన్యులు కూడా పర్యావరణ మార్పులకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ థీమ్ పిలుపునిస్తోంది. ఓటింగ్ ద్వారా, శాంతియుత నిరసనల ద్వారా, స్థానిక నాయకులను ప్రశ్నించడం ద్వారా పర్యావరణ అనుకూల విధానాలను తీసుకురావాలని ఈ ప్రచారం కోరుతోంది.
2. పర్యావరణ చట్టాల పరిరక్షణ :
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం ఉన్న చట్టాలు బలహీనపడకుండా చూసుకోవడం ఈ ఏడాది ప్రధాన లక్ష్యం. కాలుష్య కారక పరిశ్రమలపై కఠిన నియమాలు ఉండాలని, అడవుల నరికివేతను ఆపాలని ఈ థీమ్ నొక్కి చెబుతోంది.
3. స్వచ్ఛ ఇంధనం : సౌర శక్తి, పవన శక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా మన గ్రహాన్ని కాపాడుకోవచ్చని ఈ థీమ్ వివరిస్తుంది. ఇది కేవలం పర్యావరణానికే కాకుండా, కొత్త ఉద్యోగాల సష్టికి తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనానికి కూడా దారితీస్తుందని పేర్కొంది.
ఈ ఉద్యమం 56వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.
శుద్ధ విద్యుత్: 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సౌర, పవన విద్యుత్ ఉత్పాదనను మూడు రెట్లు పెంచడం.
పర్యావరణ విద్య: పాఠశాలల్లో పర్యావరణ మార్పులపై పూర్తిస్థాయి విద్యను అందించడం.
ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు: గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీని సమర్థవంతంగా అమలు చేయడం.
‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ అనేది మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని, మన గొంతును వినిపించి భూమిని కాపాడుకోవాలని ఇచ్చే ఒక బలమైన పిలుపు.
2025లో ప్రారంభమైన ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ ఉద్యమం 2026 నాటికి కేవలం నినాదంగా కాకుండా, ఆచరణాత్మక ఫలితాలను ఇస్తోంది. ఈ 56వ వార్షికోత్సవం నాటికి ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంలో సాధించిన ప్రగతి పరిశీలిస్తే గత ఏడాది కాలంలో ఈ థీమ్ కింద ప్రపంచం కొన్ని కీలక మైలురాళ్లను అందుకుంది.
పునరుత్పాదక ఇంధన విప్లవం: 2025-26 కాలంలో ప్రపంచవ్యాప్తంగా సౌర, పవన విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. అనేక దేశాలు తమ మొత్తం విద్యుత్ అవసరాలలో 30% కంటే ఎక్కువ వాటాను క్లీన్ ఎనర్జీ ద్వారా పొందుతున్నాయి.
ప్లాస్టిక్ నియంత్రణ
గ్లోబల్ ప్లాస్టిక్ ట్రీటీలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన దేశాల సంఖ్య పెరిగింది. 2026 నాటికి సముద్రాల్లోకి చేరే ప్లాస్టిక్ వ్యర్థాలను 15-20% తగ్గించగలిగారు.
పౌర స్పందన:
సామాజిక మాధ్యమాల ద్వారా పర్యావరణ పరిరక్షణ ఒక అంతర్జాతీయ ఉద్యమంగా మారింది. ముఖ్యంగా యువత ‘క్లైమేట్ యాక్షన్’లో చురుగ్గా పాల్గొంటున్నారు.
నార్వే డ స్వీడన్: ఈ దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాయి. 2026 నాటికి అక్కడ విక్రయించబడే కార్లలో దాదాపు 90% విద్యుత్ వాహనాలే.
బ్రెజిల్: అమెజాన్ అడవుల నరికివేతను అరికట్టడంలో బ్రెజిల్ ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. 2025-26లో అడవుల విధ్వంసం రేటు గణనీయంగా తగ్గింది.
జర్మనీ: పారిశ్రామిక దేశం అయినప్పటికీ, బొగ్గు వినియోగాన్ని తగ్గించి గ్రీన్ హైడ్రోజన్ వైపు వేగంగా మళ్లుతోంది.
భారతదేశం చేస్తున్నకృషి
మిషన్ లైఫ్ : ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ ఉద్యమం 2026 నాటికి ప్రతి భారతీయుడి జీవనశైలిలో భాగంగా మారింది. వనరులను వథా చేయకుండా, పొదుపుగా వాడటమే దీని ప్రధాన ఉద్దేశం.
గ్రీన్ హైడ్రోజన్ మిషన్: భారతదేశం 2047 నాటికి ఇంధన స్వయంసమద్ధి సాధించాలనే లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని భారీగా పెంచింది.
సౌర శక్తి(International Solar Alliance): ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్కులు భారత్‌లో ఉన్నాయి. 2026 నాటికి భారత విద్యుత్ సామర్థ్యంలో దాదాపు 40% పైగా శిలాజ ఇంధనేతర వనరుల నుంచే వస్తోంది.
నమామి గంగే డ అటవీ విస్తరణ: గంగానది ప్రక్షాళనతో పాటు, ‘నగర్ వన్’ పథకం ద్వారా నగరాల్లో అడవుల పెంపకాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ విషయంలో మనం కొంత పురోగతి సాధించినప్పటికీ, వాతావరణ మార్పుల వేగం ఇంకా ఎక్కువగా ఉంది. 2026 ఎర్త్ డే సందర్భంగా ప్రపంచ దేశాలు ”క్లైమేట్ ఫైనాన్స్” (అభివద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థిక సహాయం) విషయంలో ఇంకా స్పష్టమైన హామీలు ఇవ్వాల్సి ఉంది.
భూమి బాగుంటేనే మనం బాగుంటాం. అయితే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి రోజును ధరిత్రీ దినోత్సవంలా భావించిన్నప్పుడే ఈ భూ గ్రహంపై కొంత కాలం జీవించగలుగుతాం. లాక్ డౌన్ సమయంలో పర్యావరణంలో వచ్చిన గుణాత్మక మార్పులే దీనికి సాక్ష్యంగా చెప్పు కోవచ్చు. ఈ భూమి ఉన్నది ప్రతీ ఒక్కరి అవసరాలను తీర్చడానికే కానీ వారి దురాశ తీర్చడానికి కాదు అనే బాపూజీ మాటలు అక్షర సత్యం. మన ముందు తరం నుండి మనకు ఎలా ప్రకతి వనరులు లభించాయో అదే విధంగా మన ముందు తరానికి అందించడం మన బాధ్యత.
భూమి ఇచ్చింది అపారం… కానీ మనం?
ఈ భూమి మనది కాదు… మనమే భూమికి చెందినవాళ్లం. భూమిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడు కోవడమే అవుతుంది. ఇంకా ఆలస్యం కాలేదు… ఇప్పటికీ కూడా మార్పు అనేది మన చేతుల్లోనే ఉంది.
కాలుష్యం కడగాలి… భూమిని కాపాడాలి
సర్వస్వాన్ని మనకు ఇచ్చిన భూమికి. ఇప్పుడు మనం తిరిగి ఇచ్చే సమయం వచ్చింది. ‘అవర్ పవర్, అవర్ ప్లానెట్’ అనే నినాదం మన గుండెల్లో ప్రతిధ్వనించాలి. మన జీవనశైలిలో చేసే చిన్న మార్పు, ప్రపంచం మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కనుక భూమిని ఒక అందమైన, పచ్చని గ్రహంగా మార్చే బాధ్యతను అందరం స్వీకరిద్దాం.
మన ముందు తరాల నుండి వచ్చిన ప్రకతి సంపదను భావితరాలకు అందించడం మన బాధ్యత. ధరిత్రీ దినోత్సవం అంటే ఒక రోజు మాత్రమే జరుపుకోవడం కాదు దీనిని మన జీవన విధానంగా మార్చుకోవాలి. దీనికై ప్రతి రోజును ధరిత్రి దినోత్సవంగా భావిద్దాం.
రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578



