ఏటా పెరుగుతున్న పెట్టుబడులు
నవతెలంగాణ – మల్హర్ రావు
రైతన్నకు వ్యవసాయం భారమవుతోంది. ఏటా పెరుగుతున్న ఎరువులు,విత్తనాల ధరలు, కూలి ఖర్చులతో చివరకు ఏమీ మిగలని పరిస్థితి. వర్షాభావ పరిస్థితుల కారణంగా గతేడాది ఖరీఫ్ రైతులు భారీగా నష్టపోయారు. కనీసం పెట్టుబడులు కూడా రాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అవగాహన లేమితో కొందరు..అధికారుల సూచనలు పాటించని మరికొందరి రైతులకు వ్యవసాయం భారంగానే మారింది. మండలంలో మొత్తం వ్యవసాయ భూములు 23,200 ఎకరాల సాగు భూమి ఉండగా 21,200 ఎకరాలు సాగు చేస్తున్నారు. ఇందులో 14,900 ఎకరాలు వరి, 3,600 ఎకరాల్లో పత్తి.2,100వేల ఎకరాల్లో మిర్చి మిగతా భూముల్లో ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
పెరిగిన పెట్టుబడులు..
వర్షాలు సకాలంలో కురవకపోవడంతో చేసిన అప్పులు మోపెడయ్యాయి. దీనికితోడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులు సాగు చేయాలన్న ఉద్దేశంతో యంత్రాలను అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. చేసిన అప్పులకు పంటలు చేతికందని సమయంలో తిరిగి యంత్ర సామగ్రిని తక్కువ ధర లకు విక్రయిస్తూ నష్టపోతున్నారు.
పెరిగిన కూలి ధరలు..
వ్యవసాయం రోజురోజుకూ భారంగా మారుతుండడంతో వ్యవసాయం వైపు కన్నెత్తి చూడడం లేదు. గత సంవత్సరం వరకు కూలి రేట్లు రూ.500 ఉండేది. ఎడ్ల ద్వారా పనిచేస్తే గతేడాది రోజుకు రూ.2వేలు ఇచ్చేవారు. ఈఏడాది అదనంగా మరో రూ.200 చెల్లించాల్సి వస్తోంది. విత్తనాల ధరలు ఈ ఏడాది నిలకడగా ఉన్నా.. ఎరువుల ధరలు గతేడాది కంటే కొంత మేరకు పెరిగాయి. పప్పు దినుసుల పంటలు వేసుకోవాల్సిందింగా వ్యవసాయశాఖ అధికారులు సూచించినా రైతులు అటువైపు వెళ్లడం లేదు.
ఆభరణాలు తాకట్టు..
ఖరీఫ్ కు సిద్ధమవుతున్న రైతాంగం వద్ద డబ్బులు లేకపోవడంతో బంగారు ఆభరణాలు తాకట్టు పెడుతున్నారు. భార్య తాళిబొట్టు, కమ్మలు తదితర బంగారం ఆభరణాలను బ్యాంకుల్లో కుదువ పెట్టి నగదు తెచ్చుకుంటున్నారు.
పంటల సాగు ప్రశ్నార్థకమైంది: దేవదానం…రైతు తాడిచెర్ల
గత ఖరీఫ్ లో పెట్టిన పెట్టుబడులు కూడా రాక అప్పులపాలయ్యాం. ఆ డబ్బులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నాం.ప్రస్తుతం ఖరీఫ్ సాగు ఎలా చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం వంద శాతం సబ్సిడీపై విత్తనాలు అందించాలి.ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో పాటు కొత్త రుణాలిచ్చి ఆదు కోవాలి.పంటల సాగుపై వ్యవసాయాధికారు లు అవగాహన కల్పించాలి.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం: శ్రీజ..మండల వ్యవసాయాధికారి
ఖరీఫ్ సీజన్ లో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా పత్తికి బదులు ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి. వీటిపై శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు అధిక దిగుబడులు సాధించాలి.



