Sunday, April 19, 2026
E-PAPER
Homeకరీంనగర్నేను నాలుగు పేపర్లు మాత్రమే చూస్తాను

నేను నాలుగు పేపర్లు మాత్రమే చూస్తాను

- Advertisement -

బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు 
మీడియా బహిష్కరణతో బిఆర్ఎస్ సమావేశం ఉద్రిక్తత..
కేసీఆర్ సభకు ముందే పెరిగిన విభేదాల వాతావరణం
నవతెలంగాణ – జగిత్యాల టౌన్

రేపు నిర్వహించనున్న కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించి జగిత్యాల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం వివాదాస్పదంగా మారింది. సాయంత్రం 4.30 గంటలకు జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ జెడ్పి చైర్పర్సన్ దావా వసంత తదితర నేతలు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.

అయితే, నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశాయి. “నేను నాలుగు పేపర్లు మాత్రమే చూస్తాను… మిగతా పత్రికలను చూడను” అని ఆయన వ్యాఖ్యానించడం విలేకరులలో అసంతృప్తి రేకెత్తించింది. ఈ వ్యాఖ్యలను అవమానంగా భావించిన జగిత్యాల జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో, కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లపై నిర్వహించాల్సిన కీలక సమావేశాన్ని మీడియా ప్రతినిధులు పూర్తిగా బహిష్కరించారు. సమావేశానికి విలేకరులు హాజరుకాకపోవడంతో బిఆర్ఎస్ నాయకులు ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.

సభకు ముందే ప్రతిష్టాత్మకంగా మారిన వివాదం
కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు కసరత్తులు చేస్తున్న సమయంలో మీడియాతో తలెత్తిన ఈ విభేదాలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజలకు పార్టీ కార్యక్రమాలు చేరవేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని భావించే తరుణంలో ఈ బహిష్కరణ చర్చనీయాంశమైంది.

చర్చలు జరగకుండానే నిలిచిన పరిస్థితి
ఇప్పటివరకు బిఆర్ఎస్ నాయకులు మీడియా ప్రతినిధులతో ఎలాంటి చర్చలు జరపలేకపోయారు. పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు పార్టీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఈ ఘటనతో జిల్లాలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కేసీఆర్ సభకు ముందు మీడియా-పార్టీ మధ్య ఉన్న ఈ దూరం ఎలా తగ్గుతుందో ఆసక్తిగా మారింది.

జీవన్ రెడ్డి చేరికతో కొత్త చర్చలు
ఇదిలా ఉండగా.. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరడం జిల్లాలో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ చేరికపై కొంతమంది సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ లోపల సమన్వయం లోపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధిష్టానం ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -