ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు అందుబాటులో ఉండాలి
మండల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
నవతెలంగాణ-అచ్చంపేట
నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గిరిజన పల్లెలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అధికారులకు సూచించారు. గురువారం లింగాల మండల కేంద్రంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గ్రామాలలో సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి మండల సర్వసభ్య సమావేశం గొప్ప వేదిక అన్నారు. నియోజకవర్గంలో వ్యవసాయమే జీవనాధారమనీ, ప్రతి ఎకరానికి సాగునీరు అందివ్వడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందేలా చూడాలని, రైతుల సమస్యల పట్ల వ్యవసాయ అధికారులు నిర్లక్ష్యం చేయకూడదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలనీ, మధ్యాహ్న భోజనం నాణ్యతగా వడ్డించాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రజలకు వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేసిన వైద్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం చాలా ముఖ్యమనీ, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. లింగాల మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఆర్డబ్ల్యుఎస్ డిఈ హేమలత, వివిధ గ్రామాల సర్పంచులు అధికారులు ఉన్నారు.



