– తెలంగాణలో ఆయిల్‌పామ్ తోటల్లో ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తల సర్వే
– తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పామ్ గ్రోయర్స్ సొసైటీ కృషి ఫలితం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఆయిల్‌పామ్ తోటల్లో ఫైటోఫ్తోరా పాల్మివోరా (Phytophthora palmivora) ఫంగస్ వ్యాప్తిపై రైతుల్లో నెలకొన్న ఆందోళనలకు శాస్త్రీయ పరిశీలనతోనే స్పష్టత లభించనుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈ ఫంగస్ విస్తరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పామ్ గ్రోయర్స్ సొసైటీ స్పందించింది.వాస్తవ పరిస్థితులను పరిశీలించి రైతులకు స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఐసీఏఆర్ – ఐఐఓపీఆర్( ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌పామ్ రీసెర్చ్) డైరెక్టర్ డా. కంచర్ల సురేష్ కు గ్రోయర్స్ సోసైటీ అద్యక్ష కార్యదర్శులు తుంబూరు మహేశ్వర రెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య లు ఈ నెల 16 న లేఖ రాసారు.
ఒక స్వయంకృత వ్యవసాయ కన్సల్టెంట్ తదితరులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఫైటోఫ్తోరా ఫంగస్ విస్తరించిందని, దీని వల్ల ఆయిల్‌పామ్ తోటలు నాశనమై దిగుబడులు కనీసం 50 శాతానికి పడిపోతాయని ప్రచారం చేస్తున్నారని సొసైటీ లేఖలో వారు పేర్కొన్నారు. ఈ ప్రచారం రైతుల్లో తీవ్ర ఆందోళన, గందరగోళాన్ని సృష్టిస్తోందని తెలిపారు. వాస్తవాలను నిర్ధారించేందుకు శాస్త్రవేత్తల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించి, ఫంగస్ ఉన్నట్లు తేలితే అవసరమైన నియంత్రణ చర్యలు సూచించాలని విజ్ఞప్తి చేసారు.
తెలంగాణలో సర్వే చేపట్టనున్న ఐఐఓపీఆర్:
రైతుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్న ఐసీఏఆర్ – ఐఐఓపీఆర్, తెలంగాణలో నివేదించబడిన ఆయిల్‌పామ్ తోటల్లో శాస్త్రవేత్తల బృందంతో సర్వే నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. బృందం తోటలను సందర్శించి మొక్కల్లో కనిపిస్తున్న లక్షణాల స్వభావం, తీవ్రతను పరిశీలించడం తో పాటు అవసరమైన చోట్ల నమూనాలను సేకరించి ప్రయోగశాలలో పరీక్షించనుంది. తగిన శాస్త్రీయ నిర్ధారణ పద్ధతుల ద్వారా వ్యాధికారక సూక్ష్మజీవులను గుర్తించనున్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు గుర్తించలేదు:
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనల్లో, పరిశీలించిన తోటల్లోగానీ, సంస్థ విశ్లేషించిన మొక్కల నమూనాల్లోగానీ ఫైటోప్తోరా పాల్మిఒరా గుర్తించబడలేదని ఐఐఓపీఆర్ వెల్లడించింది. ప్రయోగశాలలో సంప్రదాయ ఫంగస్ వేరు చేసే పద్ధతులతో పాటు షాట్‌గన్ మెటాజెనోమిక్ విశ్లేషణలోనూ ఫైటోఫ్తోరా కంటే Colletotrichum, Fusarium జాతుల ఫంగస్లే అధికంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది.
అయితే ఏదైనా నిర్దిష్ట తోటలో వ్యాధికారక సూక్ష్మజీవి ఉనికిని నిర్ధారించాలంటే క్షేత్రస్థాయి పరిశీలన, ప్రయోగశాల పరీక్షలు తప్పనిసరని సంస్థ స్పష్టం చేసింది. తోటల సర్వే, ప్రయోగశాల విశ్లేషణల ఫలితాల ఆధారంగానే తుది వివరాలను వెల్లడిస్తామని తెలిపింది.
వదంతులను నమ్మొద్దు:
ఆయిల్‌పామ్ రైతులు అనుమానిత కేసులను సంబంధిత ఉద్యాన వన శాఖ అధికారులకు లేదా ఐసీఏఆర్ – ఐఐఓపీఆర్ కు తెలియజేయాలని సంస్థ సూచించింది. ధ్రువీకరణ లేని సమాచారం, వదంతుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దని రైతులకు విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఫైటోఫ్తోరా ఫంగస్‌పై శాస్త్రీయ బృందం నిర్వహించే పరిశీలన నివేదిక కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.



