Thursday, September 17, 2026
E-PAPER
Homeఖమ్మంతెలంగాణ సాయుధపోరాటం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

తెలంగాణ సాయుధపోరాటం చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట 
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య పిలుపునిచ్చారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ – ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనన్నారు. తెలంగాణ వారోత్సవాల ముగింపు సందర్భంగా గురువారం సీపీఐ(ఎం) దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో జమేదార్‌ బంజర్‌ గ్రామంలోని అమరజీవి కామ్రేడ్‌ సోయంగంగులు స్మారక స్థూపం వద్ద సభ నిర్వహించారు. ముందుగా పుల్లయ్య పార్టీ జెండాను ఆవిష్కరించగా, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్‌ సోయంగంగులు స్థూపానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు అధ్యక్షతన సభ జరిగింది.

ఈ సందర్భంగా పుల్లయ్య, పిట్టల అర్జున్‌, దొడ్డా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం 1946 జూలై 4న దొడ్డి కొమురయ్య అమరత్వంతో ప్రారంభమైన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం 1951 అక్టోబర్‌ వరకు కొనసాగిందన్నారు. చాకలి ఐలమ్మ వంటి వీరనారులు, పేదలు, కష్టజీవులు ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.

పోరాట ఫలితంగా పది లక్షల ఎకరాల భూమిని సాధించి, మూడు వేల గ్రామాలను విముక్తి చేసినట్లు వివరించారు. ఈ పోరాటంలో వేలాది మంది అమరులయ్యారని పేర్కొన్నారు. జమీందారులు, జాగీర్దారులు, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి పేదలు, కష్టజీవులకు అండగా నిలిచిన అమరజీవి సోయంగంగులు మన్యం వీరుడిగా ప్రజల హృదయాల్లో నిలిచారని కొనియాడారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో ముస్లింలు కూడా పాల్గొని అమరులయ్యారని తెలిపారు. ఈ పోరాటాన్ని మతపరమైన ఘర్షణగా చిత్రీకరించే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రచారాన్ని ఖండించారు. తెలంగాణ పోరాటం భూస్వామ్య, జమీందారీ దోపిడీకి వ్యతిరేకంగా సాగిన రైతాంగ వర్గపోరాటమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొలిక్కిపోగు శ్రీనివాసరావు, కొప్పుల శ్రీనివాసరావు, సీఐటీయూ మండల కన్వీనర్‌ మురహరి రఘు, జగన్నాథపు శ్రీనివాసరావు, కౌలూరి రామకృష్ణ, రావుల శోభన్‌బాబు, కణితి బాబూరావు, మిద్దెన బాబూరావు, కణితి లక్ష్మి, మోటేపల్లి ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

అనంతరం సోయంగంగులు అనుచరులు, ఎర్రన్నపేట గ్రామవాసుల ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్‌ కణితి బుల్లయ్య స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -