– తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరం సత్యనారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని హిందూ – ముస్లిం పోరాటంగా చిత్రీకరించడం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమేనని, అది భూస్వామ్య దోపిడీ, వెట్టిచాకిరీ, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన వర్గపోరాటమని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరం సత్యనారాయణ పేర్కొన్నారు. మండలంలోని వినాయపురం లో గురువారం జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ముగింపు సమావేశానికి హాజరైన సత్యనారాయణ మాట్లాడుతూ..నిజాం పాలనలో గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు, జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌ల ఆధిపత్యం కొనసాగిందని, అధిక కౌలు, అక్రమ వసూళ్లు, వెట్టిచాకిరీ, భూమిపై హక్కుల నిరాకరణతో రైతాంగం తీవ్ర దోపిడీకి గురైందని తెలిపారు.
ఈ దోపిడీకి వ్యతిరేకంగా రైతులు సంఘటితమై సాగించిన పోరాటమే క్రమంగా సాయుధ రైతాంగ ఉద్యమంగా రూపుదిద్దుకుందని వివరించారు. వెట్టిచాకిరీ నిర్మూలన, సాగుచేసే రైతుకు భూమిపై హక్కు, భూస్వామ్య ఆధిపత్యానికి ముగింపు, సామాజిక గౌరవం వంటి డిమాండ్లు ఈ పోరాటానికి కేంద్రబిందువులుగా ఉన్నాయని పేర్కొన్నారు. శ్రమించే ప్రజలపై జరుగుతున్న ఆర్థిక, సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా సాగిన ఈ ఉద్యమంలో దళితులు, ఆదివాసీలు, పేద రైతులు, వ్యవసాయ కూలీలు, మహిళలు కీలక పాత్ర పోషించారని తెలిపారు.
మార్క్సిస్టు విశ్లేషణలో పాలకుల మతపరమైన గుర్తింపుల కంటే వారి వర్గ స్వభావం, ఆర్థిక ఆధిపత్యమే ప్రధానమని పేర్కొన్నారు. అందువల్ల తెలంగాణ రైతాంగ పోరాటాన్ని మత ఘర్షణగా కాకుండా భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాగిన ప్రజా వర్గపోరాటంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి, రైతు సంఘం జిల్లా నాయకురాలు శాంతి,నందిపాడు సర్పంచ్ కూరం దుర్గమ్మ,రైతు సంఘం సీసం రాంబాబు, ముల్లగిరి గంగరాజు లు పాల్గొన్నారు.



