ముంబయి : మధ్యప్రదేశ్‌తో పాటు ముంబయి మహానగరంలోని పెట్రోల్ బంకుల్లో వచ్చే అక్టోబర్ 15 నుంచి యూపీఐ చెల్లింపులను నిలిపివేయనున్నట్టు పెట్రోల్ డీలర్లు హెచ్చరించారు. రూ.2000కు మించిన లావాదేవీలపై విధించిన కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే ఈ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ముంబయి (పీడీఎం) ఈ అంశంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ), కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాసినట్టు పీడీఎం ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. ఇంధన రిటైలర్లకు ఎండిఆర్ చార్జీలను మినహాయించాలని కోరారు. ఈ చార్జీలను వెనక్కి తీసుకోకపోతే యూపీఐ సదుపాయాన్ని ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. మధ్యప్రదేశ్ పెట్రోల్ పంప్స్ డీలర్స్ అసోసియేషన కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సీఐఏటీ) మధ్యప్రదేశ్ ప్రతినిధి ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 4,700 పెట్రోల్ బంక్‌లపై ఈ నిర్ణయం ప్రభావం చూపుతుందన్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే ఒక్కో పెట్రోల్ బంక్‌కు నెలకు సుమారు రూ. 17,700 వరకు అదనపు భారం పడుతుందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తమ ఇష్టానుసారం నిర్ణయించే అవకాశం డీలర్లకు లేకపోవడంతో ఎండీఆర్ రూపంలో వచ్చే అదనపు ఖర్చును వినియోగదారులపై నేరుగా మోపలేమని ఆపరేటర్లు అంటున్నారు.



