Monday, September 21, 2026
E-PAPER
Homeజాతీయంఓటు హక్కు తొలగింపుపై సుప్రీంకోర్టులో కీలక గణాంకాలు

ఓటు హక్కు తొలగింపుపై సుప్రీంకోర్టులో కీలక గణాంకాలు

- Advertisement -

పశ్చిమ బెంగాల్‌లో 38.2 లక్షల అప్పీళ్లలో 22.2 లక్షలు తొలగించిన ఓటర్లవే
విచారణ పూర్తయిన కేసుల్లో 93 శాతం ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చిన ట్రిబ్యునళ్లు : కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) సందర్భంగా తొలగించిన ఓటర్లలో 82 శాతం మంది తమ పేర్లను తిరిగి చేర్చాలని అప్పీల్‌ చేసినట్టు కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల జాబితా నుంచి పేర్ల తొలగింపు, తిరిగి చేర్పు ప్రక్రియపై కొనసాగుతున్న న్యాయపరమైన పరిశీలనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఎన్నికల సంఘం సమర్పించిన గణాంకాల ప్రకారం.. ప్రత్యేక ట్రైబ్యునళ్ల ముందు మొత్తం 38.2 లక్షల అప్పీళ్లు దాఖలయ్యాయి. వీటిలో 22.2 లక్షల అప్పీళ్లు ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించిన నిర్ణయాలకు వ్యతిరేకంగా దాఖలైనవే. సవరణ ప్రక్రియలో తొలగించి విచారణకు ఉంచిన 27 లక్షల మంది ఓటర్లతో పోలిస్తే ఇది సుమారు 82 శాతానికి సమానం. మరోవైపు, ఓటర్లను జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ కనీసం 16.1 లక్షల అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ అప్పీళ్లను ఎవరు దాఖలు చేశారనే విషయాన్ని ఎన్నికల సంఘం స్పష్టంగా వెల్లడించలేదు.

విచారణ పూర్తయిన కేసుల్లో 93 శాతం చేర్పులు
మొత్తం 38.2 లక్షల అప్పీళ్లలో సుమారు 1.2 లక్షల కేసులను మాత్రమే అప్పటికి ట్రైబ్యునళ్లు పరిష్కరించాయి. అంటే మొత్తం అప్పీళ్లలో 3.1 శాతం కేసులపై మాత్రమే నిర్ణయం వెలువడింది. ఏప్రిల్‌లో ట్రైబ్యునళ్లు అప్పీళ్ల విచారణ ప్రారంభించాయి. కోర్టుకు సమర్పించిన అనుబంధ గణాంకాల ప్రకారం.. విచారణ పూర్తయిన అప్పీళ్లలో 93 శాతం కేసుల్లో ఓటర్లను తిరిగి ఎన్నికల జాబితాలో చేర్చారు.

లక్షలాది ఓటర్లపై సవరణ ప్రభావం
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టారు. ఫిబ్రవరిలో విడుదలైన తుది జాబితాలో తొలుత 61 లక్షలకుపైగా ఓటర్ల పేర్లు చేర్చబడలేదు. అనంతరం అనుబంధ జాబితాలు, విచారణ ప్రక్రియ ద్వారా సుమారు 60 లక్షల అనుమానాస్పద, పెండింగ్‌ కేసులను పరిశీలించే ప్రక్రియ కొనసాగింది. ఏప్రిల్‌ 6 నాటికి సుమారు 91 లక్షల మంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయని నివేదికలు పేర్కొన్నాయి. ఇది సవరణ ప్రారంభానికి ముందు ఉన్న పశ్చిమ బెంగాల్‌ మొత్తం ఓటర్ల సంఖ్యలో దాదాపు 11.9 శాతం. దేశవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో తొలగింపుల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడిందా అనే అంశంపైనా పలు విశ్లేషణలు వెలువడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -