అజీజ్‌నగర్ అసైన్డ్ భూమిలో అక్రమ నిర్మాణాలు
కేటీఆర్ లీజు డ్రామాలు, బినామీ ఆస్తుల బాగోతం
కాంగ్రెస్ క్షేత్రస్థాయి పర్యటనలు..రాజకీయ ఉద్రిక్తతలు
నవతెలంగాణ – మొయినాబాద్
తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలనలో ఫామ్‌హౌస్‌ల సంస్కృతి విపరీతంగా పెరిగిపోయిందని, అజీజ్‌నగర్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో అనేక అక్రమాలు, రేవ్ పార్టీలు జరిగాయని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘ఫామ్‌హౌస్ ఫైల్స్’ నడుస్తున్నాయని, రంగనాయక సాగర్ నుంచి మొదలుపెట్టి ఎర్రవెల్లి, జన్వాడ, అజీజ్‌నగర్ వరకు ఉన్న ఫామ్‌హౌస్‌ల బాగోతాలను ప్రజల ముందుంచుతున్నామని తెలిపారు. ఆదివారం కాంగ్రెస్ నేతలు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌లో పర్యటించి, ఫామ్‌హౌస్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అజీజ్‌నగర్‌లోని ఆ ఫామ్‌హౌస్ అసైన్డ్ భూమి అని, 111 జీఓ పరిధిలో ఉన్న ఆ భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకునే అధికారం రోహిత్ రెడ్డికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరోజు ఆగర్భ శ్రీమంతులం అంటారని, మరొక రోజు తమకు హైదరాబాద్‌లో ఇల్లు కూడా లేదని డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేటీఆర్.. సత్యం రామలింగరాజు కంపెనీ భూముల్లో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని, నార్సింగిలో ఉంటున్నానని చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో ఈగల్ ఫోర్స్ దాడులు చేసి ఏం జరిగిందో అందరికీ తెలుసని, అమెరికాలో చదువుకుని వచ్చి కేటీఆర్ తెలంగాణలో నేర్పిన సంప్రదాయం ఇదేనా అని ప్రశ్నించారు.
ఈ ఏడాది మార్చిలో పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో డ్రగ్స్ వ్యవహారం బట్టబయలైందని తెలిపారు. అక్కడ పోలీసులు తనిఖీలు నిర్వహించిన సమయంలో డ్రగ్స్ తాగినట్టు తేలిందని, పైలట్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకు చెందిన కేదార్ అనే వ్యక్తికి రూ.25 లక్షలు చెల్లించారని ఆరోపించారు. ఆ తర్వాత ఆ కేదార్ 2025లో దుబాయ్‌లో డ్రగ్ ఓవర్ డోస్‌తో మరణించాడని తెలిపారు. నార్త్ ఇండియాకు చెందిన ఆ వ్యక్తులతో వారికి ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఫామ్‌హౌస్‌లను డ్రగ్స్, రేవ్ పార్టీలకు అడ్డాలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ తన ఫామ్‌హౌస్‌ను ప్రదీప్ రెడ్డి పేరు మీద రాయించి, ఆ భూములను తన భార్య, అత్త కుటుంబ సభ్యుల పేర్ల మీద మార్చుకున్నారని ఆరోపించారు. ఫామ్‌హౌస్ దందాల అసలు బాగోతం తెలంగాణ ప్రజలకు తెలియాలనే తాము క్షేత్రస్థాయి పర్యటనలకు వచ్చామని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దోచుకుని ఫామ్‌హౌస్‌ల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించిన బీఆర్ఎస్ నాయకుల అసలు బండారం త్వరలోనే ప్రజల ముందు పూర్తిగా బయటపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు ఉన్నారు.
మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద పోలీసుల బందోబస్తు
షాబాద్ మండలం మద్దూర్ గ్రామ శివారులోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద పోలీసులు ఆదివారం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అక్కడికి వస్తారన్న సమాచారంతో ఇన్‌స్పెక్టర్ లక్ష్మి ఆధ్వర్యంలో పోలీసులు ఫామ్‌హౌస్ వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలీసులు అక్కడే విధులు నిర్వహించారు. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ అక్కడికి రాకపోవడంతో పోలీసులు తిరిగి షాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు.



