Monday, September 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదళితుల భూమి ఒక్క అంగుళం తీసుకోం

దళితుల భూమి ఒక్క అంగుళం తీసుకోం

- Advertisement -

దళిత, గిరిజనులకు భూములు పంచిన చరిత్ర కాంగ్రెస్‌దే…
ఆ భూములకు సంపూర్ణ రక్షణ కల్పిస్తాం
విషప్రచారాన్ని నమ్మొద్దు : రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
దళిత, గిరిజనుల భూములను లాక్కోవడం ప్రజా ప్రభుత్వ విధానం కాదని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. దళితులకు సంబంధించిన అంగుళం భూమిని కూడా ప్రభుత్వం తీసుకోబోదని భరోసా ఇచ్చారు. దళితుల భూములకు ప్రజా ప్రభుత్వం సంపూర్ణ రక్షణ కల్పిస్తోందని తెలిపారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పునరుద్ఘాటించారు. పేదలు, దళితులు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎన్నో చారిత్రాత్మక మైన నిర్ణయాలను తీసుకుందని గుర్తు చేశారు. భూ సంస్కరణలు, భూ పంపిణీ వంటి కార్యక్రమాల ద్వారా భూమిలేని దళితులకు భూములిచ్చి ఆ భూమిపై హక్కులు కల్పించిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలకు ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో దళితులకు సుమారు 25 లక్షల ఎకరాల భూపంపిణీ, సుమారు రెండు లక్షల ఎకరాల పోడు భూములపై గిరిజనులకు హక్కులు కల్పించిన ఘనత కూడా కాంగ్రెస్‌దేనని తెలిపారు.

భూమిలేని పేదలకు హక్కులు కల్పించాం
భూమిలేని పేదలకు భూమి, హక్కులు లేని వారికి హక్కులు కల్పించడమే కాంగ్రెస్ పార్టీ విధానమని స్పష్టం చేశారు. దళిత, గిరిజనుల భూ హక్కులను కాపాడుతూ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని తెలిపారు. అధికారంలోకి వస్తే దళితులకు మూడెకరాల భూమి ఇస్తామంటూ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించారని విమర్శించారు. ‘దళితులకు సంబంధించిన ఒక అంగుళం భూమి కూడా ప్రభుత్వం లాక్కోదు. మీ భూమిని తీసుకునే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మీ భూముల విషయంలో మీరు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’ మంత్రి భరోసా ఇచ్చారు. భూములకు సంబంధించిన రికార్డుల పరిశీలన, సర్వేలు, భూ సమస్యల పరిష్కారం వంటి ప్రక్రియలను ప్రజల భూములను లాక్కోవడానికి చేస్తున్న చర్యలుగా చూడటం సరికాదని స్పష్టం చేశారు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు.భూముల రీ-సర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్, మద్దిరాల ప్రాంతంలోని 15 రెవెన్యూ గ్రామాల్లో, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామంలో దశాబ్దాల భూ సమస్యలకు పరిష్కారం చూపించామని వివరించారు. భూమిపై హక్కులు కల్పించడం ద్వారా వారికి ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది దొరలు కావాలనే భయాందోళనలు సృష్టిస్తూ… విషప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళితులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -