ఉదయం అల్ఫాహారం అంటే చాలు అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవి ఇడ్లీ, దోసె. ఈ రెండింటిలో ఏది కావాలి అంటే చాలా మంది దోసెకే ఓటు వేస్తారు. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ ఎగ్ దోసె, కారం దోసె, పెసరదోసెలు తినీ తినీ బోర్ కొట్టేసిందా.! అయితే ఈ సారి ఈ వెరైటీ దోసెలు ట్రై చేయండి. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
మొలకలతో…
కావల్సిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు, శనగలు కలిపి – పావు కప్పు, ఓట్స్ – నాలుగు టేబుల్ స్పూన్లు, శనగపిండి – మూడు టేబుల్ స్పూన్లు, పాలకూర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, కొత్తివీుర – గుప్పెడు, నూనె – ఆరేడు చెంచాలు, ఉప్పు – రుచికి తగినంత, పచ్చిమిర్చి – రెండు, అల్లం – అంగుళం ముక్క.
తయారు చేసే విధానం: మొలకెత్తిన పెసలు, ఓట్స్, శనగపిండి, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం, పాలకూర, కొత్తిమీరలను మిక్సీ జార్లో వేయాలి. అందులో కొన్ని నీళ్లు జోడించి గ్రైండ్ చేయాలి. ఈ పిండితో దోశలు వేసుకోవాలి. అంతే.. నోరూరించే ప్రొటీన్ దోశలు ఎంచక్కా తిని ఆనందించవచ్చు. వీటికి పల్లీ, టొమాటో, కొబ్బరి, అల్లం.. ఏ పచ్చడైనా బాగుంటుంది.
అటుకులతో…
కావల్సిన పదార్థాలు: అటుకులు – ఒకటిన్నర కప్పులు, ఉప్పు – రుచికి తగినంత, ఉప్మారవ్వ – కప్పు, పెరుగు – అర కప్పు, వంట సోడా – కొద్దిగా, నూనె – మూడు స్పూన్లు, నిమ్మరసం – అర స్పూన్, ఉల్లి తరుగు – గుప్పెడు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి – రెండు స్పూన్లు
తయారు చేసే విధానం: అటుకులను కడిగి నీళ్లు వంపేయాలి. అందులో ఉప్మారవ్వ, పెరుగు, కొన్ని నీళ్లు జతచేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం ఒక పావు గంట నానిన తర్వాత.. పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. ఈ పిండిని ఒక పాత్రలోకి తీసి.. ఉప్పు, వంట సోడా, నిమ్మరసం, ఇంకొన్ని నీళ్లు చేర్చి కలియబెట్టాలి. పిండి మరీ గట్టిగానో లేదో పల్చగానో ఉండకూడదు. తర్వాత కాలుతున్న పెనం మీద అట్లు వేసుకోవాలి. పైన ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి తరుగు చల్లాలి. అంతే.. పప్పు నానబెట్టడం, పిండి రుబ్బడం లాంటి శ్రమ లేకుండానే నోరూరించే అటుకుల అట్లు సిద్ధమైపోతాయి. సులభంగా చేసుకోగల అల్పాహారమిది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అట్టు వేడిగా ఉన్నప్పుడు కాస్త వెన్న వేస్తే.. మరింత రుచిగా ఉంటుంది.
పాలకూరతో…
కావల్సిన పదార్థాలు: పాలకూర: కట్ట (శుభ్రంగా కడిగినది), దోసె పిండి లేదా బియ్యపు పిండి – రెండు కప్పులు, పచ్చిమిర్చి – మూడు లేదా నాలుగు, అల్లం ముక్క – అంగుళం, జీలకర్ర – అర టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, నూనె లేదా నెయ్యి – దోసె కాల్చడానికి తగినంత.
తయారు చేసే విధానం: ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరగాలి. మిక్సీ జార్లో తరిగిన పాలకూర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్‌ను దోసె పిండిలో వేసి బాగా కలపాలి. రుచికి తగినంత ఉప్పు వేసి, పిండి దోసెల్లా వచ్చేలా తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కిన తర్వాత గరిటెతో పిండిని తీసుకుని దోసెలా పలుచగా వేయాలి. చుట్టూ నూనె లేదా నెయ్యి వేసి, రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.
మొక్కజొన్నతో…
కావలసిన పదార్థాలు: మొక్కజొన్న గింజలు – రెండు కప్పులు, బియ్యం పిండి – మూడు టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి – రెండు, అల్లం ముక్క – చిన్నది, జీలకర్ర – టీస్పూను, ఉప్పు – తగినంత, నూనె – దోసె వేయడానికి సరిపడా.
తయారు చేసే విధానం: ముందుగా మొక్కజొన్న గింజలను శుభ్రం చేసుకొని మిక్సీ జార్లో వేయాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, బియ్యం పిండి, కొద్దిగా నీరు కలిపి దోసె పిండిలా కలుపుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టి వేడెక్కిన తర్వాత, కొద్దిగా నూనె రాసి పిండిని దోసెలా పలుచగా పోయాలి. చుట్టూ నూనె వేసి మీడియం మంటపై బంగారు రంగు వచ్చే వరకు క్రిస్పీగా కాల్చు కోవాలి. దీనిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో లేదా అల్లం చట్నీతో తింటే చాలా బాగుంటుంది.


