Thursday, September 17, 2026
E-PAPER
Homeఖమ్మంరైతు సమస్యల పరిష్కారానికి ఏఐకేఎస్‌ మహాసభలు వేదిక

రైతు సమస్యల పరిష్కారానికి ఏఐకేఎస్‌ మహాసభలు వేదిక

- Advertisement -

– విజయవంతానికి రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య పిలుపు 
నవతెలంగాణ – అశ్వారావుపేట

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) 36వ జాతీయ మహాసభలు వేదిక కానున్నాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య పేర్కొన్నారు. ఏఐకేఎస్ 36 వ మహాసభల నేపధ్యంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం రైతు సంఘం మండల అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ అధ్యక్షతన గురువారం వినాయకపురం లో నిర్వహించారు.

ముందుగా మహా సభలు ప్రారంభం సూచికగా 36 సంఘం పతాకాలను జిల్లా అద్యక్షులు అన్నవరం సత్యనారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య నేతృత్వంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుల్లయ్య మాట్లాడుతూ ఈ మహాసభలు 2026 నవంబర్‌ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు.మహాసభల విజయవంతానికి రైతులు, రైతు శ్రేయోభిలాషులు విరివిగా విరాళాలు అందించి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.

1936లో ఆవిర్భవించిన ఏఐకేఎస్‌ కు 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాల పురిటిగడ్డ నల్లగొండలో తొలిసారిగా జాతీయ మహాసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌ 15న లక్ష మంది రైతులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నామని, దేశవ్యాప్తంగా సుమారు 1,500 మంది రైతు ఉద్యమ ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, వ్యవసాయ రంగ కార్పొరేటీకరణ, విద్యుత్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐకేఎస్‌ పోరాటాలు కొనసాగిస్తోందని తెలిపారు. మూడు వ్యవసాయ నల్ల చట్టాల రద్దు కోసం జరిగిన రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సంఘం, ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు ఐక్య పోరాటాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండించిన అన్ని పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం కోసం పోరాడుతున్నట్లు తెలిపింది.

తెలంగాణలో పోడు భూములకు పట్టాలు, కౌలు రైతులకు న్యాయం, పంట రుణాలు, నాణ్యమైన ఎరువులు–విత్తనాల సరఫరా, రుణమాఫీ, పెండింగ్‌ రైతు భరోసా నిధుల విడుదల కోసం ఆందోళనలు చేస్తున్నట్లు తెలిపింది. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేసారు 

నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు త్వరగా పూర్తి చేయాలని, డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు సాగునీరు అందించాలని, మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, చిన్న నీటిపారుదల పథకాల పూర్తి కోసం పోరాడుతున్నట్లు తెలిపారు. సాగర్‌ ఎడమ కాలువ లిఫ్టుల ఆధునీకరణ, సాగర్‌, మూసీ డ్యామ్‌లలో పూడికతీత పనులు చేపట్టాలని కోరింది.

భూసేకరణలో 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం, ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అక్రమాల నివారణ, పండ్లు, కూరగాయలు, పత్తి, మిర్చి తదితర పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్‌ చేసింది. ఎరువుల ధరలు తగ్గించడం, వ్యవసాయ సబ్సిడీలు పెంచడం, రైతులను రుణ విముక్తులను చేయాలని కోరారు.

మహాసభల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, సెమినార్లలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, మేధావులు పాల్గొంటారని ఆహ్వాన సంఘం తెలిపారు. మహాసభల జయప్రదానికి రైతులు, ప్రజలు ఆర్థిక, హార్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు చిరంజీవి,రైతు సంఘం జిల్లా నాయకురాలు శాంతి, నందిపాడు సర్పంచ్ కూరం దుర్గమ్మ,తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి సీసం రాంబాబు,ముల్లగిరి గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -