– వ్యవసాయ అభివృద్ధిలో విద్యార్థులు భాగస్వాములు కావాలి
అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ప్రజాపాలన దినోత్సవాన్ని గురువారం దేశభక్తి భావంతో ఘనంగా నిర్వహించారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, ఓఎస్ఏ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్. జె. హేమంత కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ పునరుద్ధరణ కోసం పోరాడిన, త్యాగాలు చేసిన వారిని స్మరించుకున్నారు. తెలంగాణ భారత యూనియన్‌లో విలీనం కావడానికి జరిగిన చారిత్రక పోరాటాలను గుర్తు చేశారు.
విద్యార్థులు భవిష్యత్‌లో బాధ్యతాయుతమైన వృత్తి నిపుణులుగా, చైతన్యవంతమైన పౌరులుగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. వినూత్న, సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులకు దోహదపడాలని కోరారు. వ్యవసాయ అభివృద్ధికి విద్యార్థులు తమ వంతు కృషి చేసి, తెలంగాణతో పాటు దేశ సమగ్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది వ్యవసాయ రంగ అభివృద్ధికి, రాష్ట్ర ప్రగతికి, దేశ అభ్యున్నతికి కృషి చేస్తామని సంకల్పం వ్యక్తం చేశారు.



